మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 07:09:52

బస్తీ దవాఖానలు.. ఇక మరింత పటిష్టం

బస్తీ దవాఖానలు.. ఇక మరింత పటిష్టం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వ్యాధులను ఎక్కడికక్కడే అరికట్టి నిరుపేద ప్రజలపై ఆర్థికభారం తగ్గించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను మరింత పటిష్టపర్చడంతో పాటు వాటి సంఖ్యను పెంచేందుకు  హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గ్రేటర్‌ వ్యాప్తంగా 190 బస్తీ దవాఖానలు ప్రజలకు సేవలందిస్తుండగా హైదరాబాద్‌ నగరంలో 116 బస్తీ దవాఖానలు స్థానికులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. 

చిన్నపాటి అనారోగ్యానికే.. 

హైదరాబాద్‌ నగరంలోని 12 క్లస్టర్ల పరిధిలో 14 ఏరియా దవాఖానలు, 85 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అయినప్పటికీ చిన్నపాటి జ్వరం, సాధారణ ఆరోగ్య సమస్యలకు రోగులు ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్‌ హాస్పిటళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అక్కడ గంటల కొద్దీ నిరీక్షించడం.. రోజువారీ కూలీలైతే పనులు మానుకునేవారు. ఈ క్రమంలో కొంతమంది నిరుపేదలు వ్యాధులు ప్రారంభ దశలో ఉన్నా పై కారణాల మూలంగా నిర్లక్ష్యం చేసి ప్రాణాలు కోల్పోవడం లేదా కార్పొరేట్‌ల దగాకు గురై ఆర్థికంగా చితికిపోవడం వంటివి జరిగేది. అయితే ప్రస్తుతం బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆయా దవాఖానల్లో సాధారణ రోగుల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా వ్యాధులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రబలకుండా ఈ బస్తీ దవాఖానల ద్వారా గుర్తించి ఎక్కడికక్కడే చికిత్స అందిస్తున్నారు. అంతే కాకుండా బస్తీ మధ్యలోనే దవాఖాన ఉండడం, గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకపోవడంతో చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే స్థానికులు బస్తీ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించగలుగుతున్నామని.. నగరంలో బస్తీ దవాఖానలు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 100 మందికి పైగా క్యాన్సర్‌ రోగులను గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అంతేకాకుండా టీబీ, బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం బస్తీదవాఖానల్లో గుర్తించి రోగులను అప్రమత్తం చేయడంతో పాటు వారికి సకాలంలో చికిత్స అందించామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా నగరంలో ప్రస్తుతం 116 బస్తీ దవాఖానలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. వీటిలో 56 రకాల వైద్యపరీక్షలు  నిర్వహిస్తున్నారు. త్వరలో మరో 19 బస్తీ దవాఖానలను ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు బస్తీ దవాఖానలను మరింత పటిష్టపరిచేందుకు 41 మంది వైద్యాధికారులను నియమించేందుకు హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నవంబర్‌ 13 లోపు అర్హులైన వైద్యాధికారి అభ్యర్థులు సికింద్రాబాద్‌ హరిహరాకళాభవన్‌ భవనలో ఉన్న హైదరాబాద్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి సూచించారు.