గురువారం 09 జూలై 2020
Hyderabad - Jan 08, 2020 , 10:26:09

చైనా మాంజా అమ్మితే జైలుశిక్షే

చైనా మాంజా అమ్మితే జైలుశిక్షే
  • పక్షులకు ఉరితాళ్లుగా మారుతున్న పతంగుల దారం
  • చైనా దారం అనర్థాలపై అటవీశాఖ విస్తృత ప్రచారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిషేధిత చైనా మాంజాను అమ్మడం, రవాణాచేయడం, నిలువచేసినవారికి జైలుశిక్ష తప్పదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పక్షులతోపాటు మనుషులకు ఉరితాళ్లుగా మారుతున్న చైనా దారం ఎక్కడ కనిపించినా టోల్‌ఫ్రీ నంబర్‌ 040-23231440, 1800425536 కు సమాచారం అందించాలని ప్రజలను అటవీశాఖ అధికారులు కోరుతున్నారు. ‘పతంగులతోపాటు పక్షులనూ ఎగురనిద్దాం’ అనే నినాదంతో చైనా మాంజా వాడకం వల్ల కలుగుతున్న అనర్థాలను ప్రజలకు వివరించేందుకు అటవీశాఖ నడుం బిగించింది. మంగళవారం అరణ్యభవన్‌లో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అటవీశాఖ అధికారులు సమావేశమై చైనా మాంజాపై ఉన్న నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంపై చర్చించారు. దానికి బదులుగా సంప్రదాయ కాటన్‌ దారాలను వాడాలని సూచించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలమేరకు తెలంగాణలో చైనా మాంజా వినియోగంపై నిషేధం విధింనట్టు పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ తెలిపారు. ఎన్జీవోల సహకారంతో స్కూలు పిల్లలతోపాటు యువతలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. చైనా మాంజా అమ్మినా, నిలువ ఉంచినా, రవాణాచేసినా ఐదేండ్ల జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.


logo