గ్రేటర్ బెటర్

- బల్దియా పోలింగ్ 46.55%
- ఆర్సీపురంలో అత్యధికం.. యూసుఫ్‌గూడలో అత్యల్పం
- 39 డివిజన్లలో 50శాతం దాటిన పోలింగ్
- 15 డివిజన్లలో 40 శాతం కన్నా తక్కువ.. జాబితా విడుదల చేసిన అధికారులు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్‌లో గ్రేటర్ ఓటర్లు కాస్త బెటర్ అనిపించుకున్నారు. పోలింగ్ రోజు ఉదయం మందకొడిగా వచ్చిన ఓటర్లు మధ్యాహ్నం తర్వాత ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో గత ఎన్నికల కంటే ప్రస్తుతం ఓటింగ్ శాతం కాస్త పెరిగింది. ఓల్డ్ మలక్‌పేట్ మినహా మిగిలిన 149 డివిజన్లలో పోలైన ఓటింగ్ వివరాలను ఎన్నికల అధికారులు బుధవారం వెల్లడించారు. ఆర్సీపురంలో అత్యధికంగా 67.71% పోలింగ్ నమోదు కాగా, యూసుఫ్‌గూడలో అత్యల్పంగా 32.99శాతం ఓటింగ్ జరిగింది. మొత్తానికి 46.55శాతం పోలింగ్ నమోదైంది.
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పొద్దుపోయే వరకు ఓటింగ్ జరగడంతో రాత్రికి పోలింగ్ శాతం అంచనాలు వెల్లడించిన అధికారులు, బుధవారం మధ్యాహ్ననికి వాస్తవ పోలింగ్ శాతంపై స్పష్టత ఇచ్చారు. సర్కిళ ్లవారీగా ఆయా డివిజన్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. మొత్తం 74,12,601 ఓట్లకుగాను 34,50,331 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 48 శాతం పురుషులు ఓటింగ్‌లో పాల్గొనగా, 44 శాతం మహిళలు, 10.67శాతం మంది ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం-పటాన్చెరు సర్కిల్లోని ఆర్సీపురం, పటాన్చెరు, భారతీనగర్ డివిజన్ల పరిధిలో అత్యధికంగా 65.09శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఆర్సీపురంలో అత్యధికంగా 67.71శాతం, పటాన్చెరులో 65.77శాతం, భారతీనగర్‌లో 61.89శాతం ఓటింగ్ నమోదైంది. బల్దియాలో జరిగిన సగటు పోలింగ్ కన్నా ఈ మూడు డివిజన్ల పరిధిలో 20శాతం అధికంగా ఓటింగ్ జరిగింది. హయాత్‌నగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్ల పరిధిలో 51.60శాతం, గోషామహెల్లోని ఆరు డివిజన్లలో 51.80, గాజుల రామారం సర్కిల్లోని నాలుగు డివిజన్లలో 53.65 శాతం పోలింగ్ నమోదైంది. ఇక అతి తక్కువగా పోలింగ్ నమోదైన సర్కిళ్లలో మలక్‌పేట్, చందానగర్ ఉన్నాయి. ఈ రెండు సర్కిళ్లలో 40 శాతానికి లోపే పోలింగ్ నమోదైంది. మలక్‌పేట్ సర్కిల్ పరిధిలో ఓల్డ్ మలక్‌పేట్ మినహా మిగిలిన ఆరు డివిజన్లలో 33.74శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. చందానగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్లలో 38.17శాతం పోలింగ్ నమోదైంది.
ఈసారే మెరుగైన ఓటింగ్..
రాష్ట్ర సగటుతో పోల్చుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం అతి తక్కువగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి కొంత మెరుగైనట్లు చెప్పవచ్చు. గ్రేటర్ ఏర్పాటు అనంతరం మూడుసార్లు ఎన్నికలు నిర్వహించగా, ఈసారే అధికంగా పోలింగ్ నమోదైంది. 2009 ఎన్నికల్లో 42.95శాతం, 2016ల్లో 45.27శాతం నమోదు కాగా, ఈసారి 1.28శాతం పెరిగి 46.55శాతం నమోదు కావడం కొంత ఊరటగా చెప్పవచ్చు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదని నమోదైన ఓటింగ్ శాతాన్ని చూస్తే స్పష్టమవుతున్నది. ఈసారి 39 డివిజన్లలో 50 శాతం కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కాగా, 15 డివిజన్లలో 40శాతం కన్నా తక్కువ ఓటింగ్ జరిగింది.