ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 09:58:34

పూర్తికావస్తున్న బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ పనులు

పూర్తికావస్తున్న బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ పనులు

బాలానగర్‌, అక్టోబర్‌ 26 : స్టాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) లోభాగంగా బాలానగర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ైఫ్లైఓవర్‌ పనులు డిసెంబర్‌ వరకు పూర్తయ్యేలా హెచ్‌ఎండీఏ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ైప్లెఓవర్‌ పనులలో భాగంగా భూసేకరణ పనులలో జాప్యం ఏర్పడిన కారణంగా ఏప్రిల్‌లో పూర్తి అవుతాయి అనుకున్న పనులు డిసెంబర్‌ నెలలో పూర్తి చేసేందుకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు తీవ్రంగా సన్నాహాలు చేస్తున్నారు. ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పిల్లర్ల నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. ఒక పిల్లర్‌ నుంచి మరో పిల్లర్‌కు 8 గడ్డర్లు ఏర్పాటు చేయడాన్ని ఒక స్పాన్‌ అంటారు. ఈ నేపథ్యంలో పిల్లర్లపై బీమ్‌లు ఏర్పాటు చేసి తొమ్మిది స్పాన్‌లలో స్లాబ్‌ పనులు సైతం పూర్తి అయ్యాయి.

 మిగతా స్పాన్‌లలో గడ్డర్ల ఏర్పాటు పనులు చకచక సాగుతున్నాయి. రెడీగా ఉన్న పిల్లర్లపై బీమ్‌లు ఏర్పాటు చేయడానికి క్రిబ్స్‌ (కాలం) ఏర్పాటు చేసి రెడిమెడ్‌గా ఉన్న గడ్డర్లు (బీమ్‌) ఇన్‌స్టాల్‌ చేసే పనులు మరింత చురుకుగా జరుగుతున్నాయి. ైప్లెఓవర్‌ మొత్తంలో 206 గడ్డర్లు (బీమ్‌)లు ఏర్పాటు చేయనుండగా వాటిలో 176 ఆర్‌సీసీ గడ్డర్లు, మరో 30 స్టీల్‌ గడ్డర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు 176 ఆర్‌సీసీ గడ్డర్లతో పాటు 16 స్టీల్‌ గడ్డర్లు ఇన్‌స్టాల్‌ చేశారు. మరో 14 స్టీల్‌ గడ్డర్లు వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తాలో 2 స్పాన్‌లలో స్టీల్‌ గడ్డర్లు ఏర్పాటు చేయనుండగా, ఫతేనగర్‌ టీజంక్షన్‌లో మరో స్పాన్‌లో స్టీల్‌ గడ్డర్‌ ఏర్పాటు చేయనున్నారు. 

బాలానగర్‌ పారిశ్రామికవాడ ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు నివారించడం కోసం రూ. 387 కోట్ల భారీ నిధులు కేటాయించి ఫ్లైఓవర్‌ పనులు చేపట్టిన విషయం విధితమే. బాలానగర్‌ ఎస్‌ఎమ్మార్‌ వినయ్‌ క్యాపిటల్‌ వద్ద నుంచి బాలానగర్‌ ఆంధ్రాబ్యాంక్‌ వరకు 1.13 కిలో మీటర్ల దూరంలో.. 78.72 ఫీట్ల్లు (24 మీటర్లు) వెడల్పుతో ఫ్లైఓవర్‌ పనులు కొనసాగుతున్నాయి. బాలానగర్‌ ఫ్లైఓవర్‌కు మొత్తం 26 పిల్లర్లకు గాను 2 ర్యాంప్‌ పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లర్‌ టూ పిల్లర్‌ 30 మీటర్ల మేర దూరంతో ఫ్లైఓవర్‌ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. 32 ఫీట్ల లోతుతో చేపట్టిన ఒక పిల్లర్‌ క్యాప్‌కు 6 పైల్స్‌(బీంలు)లతో నిర్మాణం పనులు చేపట్టారు. ఒకపైల్‌ క్యాప్‌( పిల్లర్‌ బేస్‌) పైన పిల్లర్‌ ఎత్తును బట్టి 2,3,4,5 వేర్వేరుగా పియర్‌ సిగ్మెంట్‌లు ఏర్పాటు చేశారు. పియర్‌ సిగ్మెంట్‌ల పైన మరో ఫైనల్‌ పియర్‌ క్యాప్‌ ఏర్పాటు చేసి చివరగా బీంలు ఏర్పాటు చేశారు. బీంల పైన రూప్‌ (స్లాబ్‌) సీసీ రోడ్డు వేయనున్నారు. ప్రీ కాస్టింగ్‌ పద్దతిలో ఫైల్‌ (పిల్లర్‌ బీం) నిర్మాణం చేపడుతున్నారు. ఇదిలా ఉండగా రెండు ర్యాంపు పిల్లర్లకు గాను.. ఒక ర్యాంప్‌ పిల్లర్‌ రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఏర్పాటు చేయగా మరో ర్యాంప్‌ పిల్లర్‌ ఎన్‌ఈర్‌ఎస్‌సీ వద్ద ఏర్పాటు చేశారు. రిలయన్స్‌ బంక్‌ నుంచి ఆంధ్రాబ్యాంక్‌ వరకు ఒకటి, ఎన్‌ఆర్‌ఎస్‌సీ నుంచి ఎస్‌ఎమ్మార్‌ వినయ్‌ క్యాపిటల్‌ బిల్డింగ్‌ వరకు మరో ర్యాంప్‌ పనులు చకచక జరుగుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో ర్యాంపు పనుల్లో కొంత జాప్యం ఏర్పడింది. కాగా మొత్తం 26 పిల్లర్లకు గాను 26 పిల్లర్లు ఏర్పాటు కాగా గడ్డర్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు మొత్తం గడ్డర్లు ఏర్పాటు పూర్తి చేయడంతో పాటు మిగిలిన స్పాన్‌లలో స్లాబ్‌ పనులు చేపట్టనున్నారు. డిసెంబర్‌ చివరి వరకు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.  
బాలానగర్‌లో ప్రజలు నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి ఫ్లైఓవర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రూ.387 కోట్ల నిధులు కేటాయింపజేశాను. చేపట్టిన ఫ్లైఓవర్‌ పనులు భూసేకరణలో భాగాంగా కొంత జాప్యం ఏర్పడినా.. అనంతరం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2020 డిసెంబర్‌ వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదేమైనా కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. - మాధవరం కృష్ణారావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే 
ఫ్లైఓవర్‌ పనులను డిసెంబర్‌ నెలాఖరు వరకు పూర్తి చేయడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. మొత్తం 206 గడ్డర్లకు గాను ఇప్పటికే 176 ఆర్‌సీసీ గడ్డర్లు ఏర్పాటు చేయగా 30 స్టీల్‌ గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా 16 స్టీల్‌ గడ్డర్ల ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయి. మరో 14 స్టీల్‌ గడ్డర్లు ఏర్పాటు చేసి స్లాబ్‌ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనా డిసెంబర్‌ నెలాఖరు వరకు అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం.  - యూసుఫ్‌ హుస్సేన్‌, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ