ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 22, 2021 , 07:16:27

తెలంగాణ యాదిలో.. అమృతవర్షిణి.. అచ్చమాంబ

తెలంగాణ యాదిలో..  అమృతవర్షిణి.. అచ్చమాంబ

  • వందేళ్ల కిందటే ఆధునిక కథానిక ప్రక్రియకు అక్షరార్పణ
  • తెలుగులో ఆధునిక కథా రచనకు ఆద్యురాలు 
  • కథా సాహిత్యం ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రముఖ రచయిత్రి
  • స్త్రీ చైతన్యం, సమాజాభివృద్ధికి కృషిలో భాగంగా పలు రచనలు
  • మహిళల ఉపాధి కోసం జీవితాన్ని ధారబోసిన త్యాగమూర్తి
  • ప్లేగు వ్యాధి బాధిత అనాథ పిల్లలను చేరదీసి అసువులు బాసిన మాతృమూర్తి
  • వందేళ్ల కిందటే స్త్రీల చదువు, చైతన్యం కోసం పరితపించిన రచయిత్రి అచ్చమాంబ

సరిగ్గా నూట ఇరవయ్యేండ్ల క్రితం ‘స్త్రీల చదువు, మహిళా అభ్యున్నతి, చైతన్యం’ కోసం అహర్నిషలు కృషి చేశారు. సమాజోద్ధరణకు, సమాజ పురోగతికి పాటు పడుతూ, ఆపత్కాలంలో అనాథ బాలలను అక్కున చేర్చుకొని, తుదకు సేవలందిస్తూనే మహమ్మారి ప్లేగు వ్యాధితో కనుమరుగయ్యారు. బతికింది ముప్పయ్యేళ్లే అయినా.. తన కథా రచనతో వందలాది మంది మహిళల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఆవిడే.. భండారు అచ్చమాంబ. తెలంగాణకు చెందిన ఆధునిక రచయిత్రి. ఈ నెల 19న అచ్చమాంబ వర్ధంతి. ముప్పయ్యేళ్ల జీవితంతో మూడు శతాబ్దాలు గుర్తుండిపోయేలా సేవలందించి ఒక త్యాగమూర్తిలా అచ్చమాంబ అమృతవర్షిణిగా కీర్తింపబడుతున్నారు.

మనం ఎంత గొప్పగా జీవించామన్నది కాదు.. మనం చేసిన పనులు సమాజంలో ఎంతకాలం నిలిచిపోతాయన్నది ముఖ్యం. అలా ఎందరో మహనీయులు చేసిన సమాజ స్ఫూర్తిని నేటికీ మనం స్మరిస్తున్నాం.. ఆచరిస్తున్నాం. ఆ కోవలోనే తెలుగువారి జీవితాలను స్ఫృశిస్తూ కథా సాహిత్యం ద్వారా వెలుగులోకి తెచ్చిన స్త్రీ చైతన్యమూర్తి, కథా రచయిత్రి భండారు అచ్చమాంబ. 19వ శతాబ్దంలోనే తెలంగాణ, ఆంధ్ర, విదర్భ, ఛత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల్లో తాను చూసిన జీవితాలను, వాటిలో రావాల్సిన మార్పులను కథా సాహిత్యంలో రికార్డు చేసిన రచయిత్రి. వందేళ్ల కిందటే ఆధునిక కథానిక ప్రక్రియకు అక్షరార్పణ చేసిన మహోన్నతురాలు భండారు అచ్చమాంబ. తెలుగులో మొట్టమొదటి సారిగా ఆధునిక పద్ధతిలో కథలు రాసిన వారిలో ఆద్యులుగా పేర్కొనే అచ్చమాంబ ఒకప్పటి కృష్ణా జిల్లాలోని.. ప్రస్తుత నల్లగొండ జిల్లాలోని మునగాల పరగణా మేనేజరు కొమర్రాజు వెంకటప్పయ్య - గంగమ్మల సంతానం. ఆనాటి ప్రజల జీవితాలను అధ్యయనం చేసి వాటిలో మెరుగైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో అచ్చమాంబ ఆయా పాత్రలను సృష్టించి వాటి ద్వారా కథను నడిపించిన తీరు ఆధునికతకు అద్దం పట్టింది.

ఆమె కథలన్నీ.. 

అచ్చమాంబ రాసిన కథలన్నీ స్త్రీ చైతన్యం, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాసినవే.. స్త్రీల చదువే సర్వ సమస్యలకు పరిష్కార మార్గమని నేటి పాపులేషన్‌ సిద్ధాంత కర్తలు చెబుతున్న విషయాన్ని వందేళ్ల కిందట ఆచరణకు ప్రయత్నించిన సాహసి ఆమె. బొంబాయి, బిలాస్‌పూర్‌, నాగపూర్‌, హైదరాబాద్‌, మచిలీపట్నం, రాజమండ్రి, వారణాసి వంటి పలు ప్రదేశాలు తిరిగి తన భావాలను ఉపన్యాసాలు, రచనలు, ఉత్తరాలు, పుస్తకాలు, ప్రసంగాల ద్వారా ఎంతోమంది ప్రజలను చైతన్యవంతులను చేశారు. ప్రజల్లో ఆమె తీసుకువచ్చిన చైతన్యం నేటికీ స్ఫూర్తిదాయకం. అచ్చమాంబ రాసిన కథల్లో ప్రధానంగా.. “గుణవతియగు స్త్రీ, లలితా శారదలు, జానకమ్మ, దంపతుల ప్రథమ కలహం, సత్పాత్ర దానము, స్త్రీ విద్య, ధనత్రయోదశి, భార్యాభర్తల సంవాదం, అద్దమును - సత్యవతియును, బీద కుటుంబము” ఉన్నట్లు తెలుస్తున్నది. అదే విధంగా ‘అబలా సచ్చరిత్ర రత్నమాల..’ దేశ విదేశాల్లోని వీర, ధీర వనితల ఉదాత్త చరిత్రల వ్యాస సంపుటి ఆనాటి మహిళల్లో స్ఫూర్తిని, రచనా ప్రేరణను కలిగించింది.

30 ఏళ్లకే.. 

తెలంగాణలో తెలుగు సాహిత్యం, పునర్వికాసోద్యమాలకు ఊపిరి పోసిన అచ్చమాంబ కేవలం రాతలకే పరిమితం కాకుండా మహిళలకు ఉపాధి కల్పించే ‘అల్లికలు, వంటలు, కుట్లు’ వంటి వాటిని ప్రచారం చేసేందుకు తన జీవితాన్ని వెచ్చించారు. అంతే కాకుండా ఆమె ఎంతో మంది అనాథ పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటూ వారి బాగోగులను పట్టించుకున్నారు. 1904 చివర్లో బిలాస్‌పూర్‌లో ప్లేగు వ్యాధి వచ్చిన సందర్భంలో అనాథ పిల్లలను చేరదీసి వారి ఆలన పాలన చూసిన ఆమె 1905 జనవరి 19న ప్లేగు వ్యాధితో మరణించారు. కేవలం 30 ఏళ్లు మాత్రమే జీవించిన భండారు అచ్చమాంబ తన సాహిత్యం, ఉద్యమ స్ఫూర్తిని వందల ఏళ్లు గుర్తుండిపోయేలా పాటుపడ్డారు. 

ఆధునిక భావాలకు వేదికలు

అచ్చమాంబ కథలన్నీ ఆధునిక భావాలకు వేదికలు. ప్రతి కథలోనూ సమాజోద్ధరణ, మహిళాభ్యున్నతి, మెరుగైన సమాజం కోసం ఆమె పడ్డ తపన ప్రతి అక్షరంలోనూ దర్శనమిస్తాయి. 1905 జనవరి 19న మరణించిన అచ్చమాంబ సాహిత్య సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. 20వ శతాబ్ధి ఆరంభంలో తన కథల ద్వారా ఆమె మహిళల్లో చెరగని ముద్ర వేశారు. ఆ కాలంలో చదువుకున్న ఆడవారు ఆమె సాహిత్యానికి అన్ని ప్రాంతాల వారు ప్రభావితం అయ్యారంటే అతిశయోక్తికాదు. అచ్చమాంబ కార్యాచరణ, వాక్చాతుర్యం వీటికి తోడు భిన్న ప్రదేశాల్లో వివిధ సభలు, సమావేశాల్లో పాల్గొనడం ద్వారా ఆయా ప్రాంతాల వారిలో ఒకరిగా కలిసిపోయారు. కేవలం కథలే గాకుండా అబలా సచ్చరిత్ర రత్నమాల పేరిట తెలుగులో మొట్టమొదటిసారిగా మహిళల జీవిత చరిత్రలను రచయిత్రిగా అచ్చమాంబ నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. - మామిడి హరికృష్ణ, ఇన్‌చార్జి కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ

VIDEOS

logo