సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:24:37

నిమ్స్‌ జాగ కబ్జాకు యత్నం

నిమ్స్‌ జాగ కబ్జాకు యత్నం

  • పంజాగుట్ట పోలీసులకు సూపరింటెండెంట్‌ ఫిర్యాదు
  • అక్రమంగా పాతిన బోర్డును తొలగించిన పోలీసులు
  • కరోనా లక్షణాల వల్ల నిందితుల అరెస్ట్‌కు ఆలస్యం
ఖైరతాబాద్‌ : నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (నిమ్స్‌)కు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్లాన్‌ వేశారు. నిమ్స్‌ అధికారులు సకాలంలో స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డు పడింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం... ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్‌ వెనుక వైపు నిమ్స్‌కు సంబంధించిన పురాతన ఐజే క్వార్టర్స్‌ నం.21, 22, 29, 30 ఉండేవి. నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణలో భాగంగా ఎర్రమంజిల్‌ కాలనీలో తూర్పు ప్రహరీ వైపునున్న ఈ క్వార్టర్స్‌ను కొంత కాలం కిందట కూల్చేశారు. దాంతో అక్కడ 2 వేల గజాలపైగా జాగా తేలింది. ఇటీవల నగరానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌, ముజ్‌తబా బేగం నిజాం వారసులమంటూ, ఈ స్థలంపై తమకు హక్కు ఉందంటూ.. అక్కడ బోర్డు పాతారు. అంతటితో ఆగక స్థలాన్ని విక్రయించేందుకు కొందరు వ్యక్తులతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ గురువారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్థలంలో ఏర్పాటుచేసిన బోర్డును తొలగించి మహ్మద్‌ హుస్సేన్‌, ముజ్‌తబాబేగం, కొనుగోలు వ్యవహారంలో భాగస్వామి అయిన అబ్దుల్‌ అజీజ్‌ సయ్యీద్‌పై 427, 447 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. స్థలం ఆక్రమించిన వారికి కరోనా లక్షణాలు ఉండడంతో వారిని అదుపులోకి తీసుకోలేదని, వైరస్‌ నుంచి కోలుకున్నాక అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. 

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి...!

దేశంలోనే నిమ్స్‌ దవాఖానకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి డాక్టర్లు, సిబ్బంది కోసం ఎర్రమంజిల్‌ కాలనీలో దశాబ్దాల కిందట నిర్మించిన క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరుకున్నాయి. దాంతో కొంతకాలంగా ఖాళీగా ఉన్నాయి. తూర్పు ప్రహరీ వైపు ఐదు క్వార్టర్స్‌ను కూల్చేసిన స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. నిందితులను అరెస్టు చేసి విచారిస్తే 
వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. 

ఆ స్థలం నిమ్స్‌దే..

నిమ్స్‌ సిబ్బంది సౌలభ్యం కోసం ఎర్రమంజిల్‌ కాలనీలో పూర్వం ఐజే 21, 22, 29, 30 క్వార్టర్లు నిర్మించారు. ఆస్పత్రి విస్తరణలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఆ క్వార్టర్స్‌ను కూల్చేశారు. ఆ స్థలం మొత్తం అధికారికంగా నిమ్స్‌ దవాఖానకే చెందుతుంది. ఆక్రమించిన వారికి ఈ స్థలంతో ఎలాంటి సంబంధమూ లేదు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలి. - డాక్టర్‌ సత్యనారాయణ, నిమ్స్‌ సూపరింటెండెంట్‌