మంగళవారం 26 మే 2020
Hyderabad - May 21, 2020 , 01:26:15

రూ.10 ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తిపై దాడి

రూ.10 ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తిపై దాడి

మారేడ్‌పల్లి : పది రూపాయలు ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తిపై మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...లోతుకుంట ప్రాంతానికి చెందిన ఉమాచందర్‌  సెయింట్‌ మేరీస్‌ రోడ్డులో ఉన్న హోమియోలో వైద్యుడి వద్దకు వచ్చాడు. తన కారును పాస్‌పోర్టు కార్యాలయం ఎదురుగా పార్కింగ్‌ చేశాడు. అనంతరం డాక్టర్‌ వద్ద చూపించుకున్న తరువాత ఉమాచందర్‌ కారు వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళలు ఆయన వద్దకు వచ్చి రూ.10 అడుగ్గా... తన వద్ద చిల్లర లేదని చెప్పారు.

  అయినా సరే ఆ మహిళలు డబ్బులు కావాలని బలవంతం చేయగా, లేవని మరోసారి చెప్పడంతో ఆ ఇద్దరు కారు అద్దాలు పగులగొడుతూ ఆయనపై దాడికి చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులపై ఆ మహిళలతో ఉన్న ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. స్థానికులు 100కు సమాచారం అందించగా, మార్కెట్‌, గోపాలపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఆ ఇద్దరు మహిళలు ప్లేట్‌ పిరాయించి తమపై అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు తెలిపారు. స్థానికులు జరిగిన విషయం పోలీసులకు చెబుతుండగా, వారిపై కూడా దాడి చేసేందుకు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే మార్గమధ్యంలో అందరూ చూస్తుండగానే ఆ మహిళలు మద్యం బాటిల్‌ పగులగొట్టి గాజుముక్కలను నోట్లో వేసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 


logo