బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Dec 01, 2020 , 08:02:48

ఏటీఎం దొంగలు దొరికారు

ఏటీఎం దొంగలు దొరికారు

హైదరాబాద్‌  : వనస్థలిపురం ఏటీఎంలో చోరీకి పాల్పడ్డది హర్యానా మేవాత్‌ ముఠా పనేనని రాచకొండ సీసీఎస్‌ పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన సీసీఎస్‌ పోలీసులు ముఠాలోని ఇద్దరిని సోమవారం అరెస్టు చేశారు. హర్యానా మేవాత్‌ గ్యాంగ్‌తో హైదరాబాద్‌కు చెందిన ఆమీర్‌, అఫ్రిదిలకు జైలులో పరిచయమైంది. వారి ప్రణాళికలో భాగంగా సెక్యూరిటీ గార్డు లేని, నిర్మానుష్యంగా ఉండే ఏటీఎం కేంద్రాలను గుర్తించి సమాచారం ఇవ్వమని ఆదేశించారు. దీంతో ఆమీర్‌, అఫ్రిదీల సమాచారంతో  హర్యానా ముఠాలోని ఆరుగురు  సభ్యులు రైలులో నగరానికి వచ్చారు. ముఠా సభ్యులను ఓయో రూమ్‌ గదుల్లో ఉంచారు. మరుసటి రోజు నుంచి ఫార్చూనర్‌ కారును అద్దెకు తీసుకొని ఏటీఎమ్‌ సెంటర్‌ల వద్ద రెక్కీ చేశారు. మొదట చౌటుప్పల్‌ ప్రాంతంలో ప్రయత్నించగా అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్‌ రావడంతో వెనుదిరిగారు.

 ఆ మరుసటి రోజు వనస్థలిపురం ఏటీఎమ్‌ లక్ష్యంగా చేసుకొని గ్యాస్‌ సిలిండర్‌, గ్యాస్‌ కట్టర్లను తీసుకొని ఏటీఎమ్‌ మిషన్‌ ముందు భాగాన్ని కోశారు. సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఆ కెమెరాలపై బ్లాక్‌ పెయింట్‌ను స్ప్రే చేసి, ఏటీఎంలోని రూ.6లక్షల నగదును తీసుకొని పరారయ్యారు. చోరీ అనంతరం కారులో ఆదిలాబాద్‌ వైపు వెళ్లి అక్కడ అడవిలో గ్యాస్‌ సిలిండర్‌, కట్టర్లు, ఏటీఎం కెమెరా డీవీఆర్‌, ఛెస్ట్‌ ర్యాక్స్‌ను ముక్కలుగా చేసి పడేశారు. కొంతమంది నాగపూర్‌ వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లగా, మరికొందరు కారులో హర్యానా మేవాత్‌ చేరుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వివిధ సీసీ కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో మొదట హైదరాబాద్‌కు చెందిన ఆమీర్‌, అఫ్రిదీలను అరెస్టు చేశారు. ముఠాకు చెందిన సాజిద్‌, అజర్‌, షాహీద్‌, ఆజాద్‌, జునైద్‌, అబిద్‌ ఖాన్‌ పరారీలో ఉన్నారు. ఇద్దరు నిందితుల నుంచి మొత్తం రూ.35లక్షలు విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


logo