ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 14, 2020 , 00:27:43

57 ఏండ్ల వయస్సులో.. ప్లాస్మా దానం

57 ఏండ్ల వయస్సులో.. ప్లాస్మా దానం

క్వారంటైన్‌, కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో.. నిత్యం పర్యటనలు చేశా..

విధినిర్వహణలో భాగంగా.. ఎక్కడో వైరస్‌ సోకింది..!

రికవరీ అయిన వారిని చూశాను.. అందుకే ధైర్యంగా ఉన్నా..

ప్రభుత్వం ఇచ్చిన కిట్‌ ద్వారానే.. కరోనాను జయించా

మరొకరికి ప్రాణాలు కాపాడాలని.. ప్లాస్మా దానం చేశా..

ఎల్బీనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ విజయకృష్ణ 

ప్లాస్మా డొనేట్‌ చేస్తున్న ఎల్బీనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ కొండూరి విజయకృష్ణ 

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. దగ్గరుండి నిత్యావసర సరుకులు, మందులు, పారిశుధ్యం తదితర వాటిని పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. విధినిర్వహణలో భాగంగా నిత్యం విస్తృతంగా పర్యటించిన ఆయనకు కరోనా మహమ్మారి సోకింది. 57 ఏండ్ల వయస్సులోనూ.. హోం క్వారంటైన్‌లోనే ఉంటూ.. మనోధైర్యంతో పీహెచ్‌సీ డాక్టర్లు ఇచ్చిన సలహాలు, సూచనలు, చిట్కాలు పాటిస్తూ.. ఆత్మైస్థెర్యం కోల్పోకుండా మహమ్మారిపై విజయం సాధించారు. పూర్తిగా కోలుకొని తన వంతుగా ప్లాస్మాదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు ఎల్బీనగర్‌ ఉప కమిషనర్‌ విజయకృష్ణ. వివరాలు ఆయన మాటల్లోనే..

ఎల్బీనగర్‌ : ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధి వనస్థలిపురం, చంపాపేట ప్రాంతాల్లో తొలి కేసులు నమోదైన నాటి నుంచి  క్వారంటైన్‌, కంటైన్మెంట్‌ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాను. ప్రధానంగా వనస్థలిపురంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో ప్రజాప్రతినిధుల సహకారంతో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టి విజయం సాధించాం. ప్రధానంగా మురికివాడలపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. ఇందులో భాగంగా జూలై 8వ తేదీన స్వల్పంగా జ్వరం ఉండటంతో కార్యాలయంలోనే ఉండి విధులు నిర్వహించాను. జూలై 11న జ్వరంతో పాటు తలనొప్పి ఉండటంతో సాధారణ అస్వస్థతగా భావించా. అయితే జూలై 13న జ్వరం ఎక్కువ కావడంతో సర్కిల్‌ కార్యాలయం పక్కనే ఉన్న సరూర్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అదేసమయంలో నా భార్య, డ్రైవర్లకు పరీక్షలు చేయించగా వారికి నెగెటివ్‌ వచ్చింది. వెంటనే హోం ఐసొలేషన్‌లో ఉండిపోయాను. సర్కిల్‌ వ్యాప్తంగా అప్పటికే పలువురికి కరోనా వచ్చి రికవరీ అయిన వ్యక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడిన అనుభవం ఉండటంతో భయపడకుండా ధైర్యంగా ఉన్నా.

పీహెచ్‌సీ డాక్టర్ల సూచనలు..

ప్రభుత్వ కిట్స్‌, మందులతోనే రికవరీ

పాజిటివ్‌ అని తేలగానే పీహెచ్‌సీ డాక్టర్లు ఇచ్చిన మందులు, వారి సూచనలు పాటించాను. ప్రభుత్వం పంపిన కరోనా కిట్స్‌, మందులతోనే కరోనాను జయించారు. నా సతీమణి సహకారంతో రోజుకు రెండు సార్లు ఆవిరిపట్టడంతో పాటుగా నిమ్మకాయ, తేనె, కషాయం, టీ తీసుకున్నా. ఉదయం అరగంట పాటు యోగాసనాలు చేశాను. ఉదయం టిఫిన్‌లో ఇడ్లీ, దోశ, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌, రాత్రి సమయంలో చపాతీ తీసుకున్నా. అలవాటు లేకున్నా అదనంగా కొడిగుడ్డును తీసుకున్నా. ఇలా 14 రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండి జూలై 25న తిరిగి కరోనా టెస్ట్‌ చేయించగా నెగెటివ్‌ వచ్చింది. అప్పటికే పూర్తిగా కోలుకోవడంతో జూలై 27న తిరిగి విధుల్లో చేరాను.  

ముందు వద్దన్నారు.. పిలిచి తీసుకున్నారు..

కరోనాను జయించి విధుల్లో చేరిన అనంతరం ఆగస్టు 12వ తేదీన ప్లాస్మా దానం చేశాను. తొలుత ప్లాస్మా దానం చేస్తానని చెప్పగానే 55 సంవత్సరాల పైబడిన వారి నుంచి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అయితే టెస్టు రిపోప్టు చూశాక డాక్టర్లే తిరిగి పిలిపించి ప్లాస్మాను తీసుకున్నారు. 

ధైర్యంగా ఉండి డాక్టర్ల సూచనలు పాటిస్తే.. 

కరోనా సోకినా.. ధైర్యంగా ఉండి వైద్యుల సూచనలు పాటిస్తే త్వరగా రికవరీ అవుతుంది. కరోనా వైరస్‌ ఆరంభం నుంచి సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కరోనా వచ్చినా.. ఎదుర్కోగలననే ధైర్యంతో ఉన్నా. నాకు షుగర్‌ లేదు. బీసీ లైట్‌గా ఉంది. పీహెచ్‌సీలో పాజిటివ్‌ వచ్చిన వెంటనే డాక్టర్ల సూచనలు, వారు సూచించిన మందులు వాడాను. నా సతీమణి పూర్తిస్థాయిలో సహాకారం అందించింది. హోంక్వారంటైన్‌లో ఉన్నప్పటికీ ఫోన్‌ద్వారా ప్రజల సమస్యలు, కార్యాలయ పనులను చక్కబెట్టాను. ప్లాస్మా ఇస్తామంటే వయస్సు ఎక్కువ అంటూ తొలుత నిరాకరించిన డాక్టర్లు నా యాంటీ బాడీ టెస్ట్‌ను చూసిన అనంతరం తీసుకునేందుకు అంగీకరించారు. కరోనా జయించాను. మరోకరి ఆరోగ్యం కోసం ప్లాస్మా దానం చేశాను. 

- కె. విజయకృష్ణ, ఉప కమిషనర్‌, ఎల్బీనగర్‌


logo