బంజారాహిల్స్,సెప్టెంబర్ 7: ప్రేమిస్తున్నానంటూ నమ్మించి యువతిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో పాటు మోసానికి పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని జహీరానగర్‌కు చెందిన యువతి జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్ దావాఖానలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తోంది.
అక్కడే జూనియర్ సూపర్వైజర్గా పనిచేస్తున్న కొండబాబు అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దాంతో ఆమె ఒప్పుకుంది. కాగా ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు.
అనంతరం చాలాసార్లు ఇదే విధంగా లోబర్చుకున్న కొండబాబుకు పెళ్లయినట్లు ఇటీవల తెలుసుకున్న యువతి అతడిని నిలదీసింది. తన భార్యకు విడాకులు ఇస్తానని నమ్మబలికాడు. అయితే నెలలు గడిచినా పెళ్లి మాటెత్తకపోవడంతో ఈ నెల 6న కొండబాబు పనిచేస్తున్న చోటకు వెళ్లి ప్రశ్నించగా తాను కేవలం సెక్స్ కోసమే కలిసి ఉన్నానని, పెళ్లిచేసుకునే ప్రసక్తే లేదంటూ దురుసుగా ప్రవర్తించాడు.
దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిపై ఐపీసీ 376(2)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.