శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 06, 2020 , 00:51:05

‘నవ’ నాయకుడిగా.. ఖైరతాబాద్‌ గణేశుడు..

‘నవ’ నాయకుడిగా.. ఖైరతాబాద్‌ గణేశుడు..

తొమ్మిది అడుగులే

గంగమ్మ ఒడి నుంచి బంకమట్టి.. వాటర్‌ కలర్స్‌ వినియోగం

శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా దర్శనం

ప్రత్యక్ష దర్శనాలు లేవు... ఆన్‌లైన్‌కే పరిమితం

ఖైరతాబాద్‌ : ఖైరతాబాద్‌ వినాయకుడు ఈసారి కేవలం 9 అడుగులకే పరిమితం కానున్నారు. కరోనా నేపథ్యంలో విగ్రహం ఎత్తును తగ్గించడంతో పాటు.. ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేసినట్లు బుధవారం ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు చైర్మన్‌ సింగరి సుదర్శన్‌, కన్వీనర్‌ సందీప్‌ రాజ్‌, కార్యనిర్వహక కార్యదర్శి సింగరి రాజ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు మహేశ్‌ యాదవ్‌ గణపతి మండపంలో విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. 

ధన్వంతరి దైవం మాదిరిగా రూపం కలిగి నాలుగు చేతు లు కలిగి ఉంటాయి. ఇందులో కుడివైపు ఆయుర్వేదగ్రం థం, శంఖం, ఎడమ వైపు అమృత కలశం, వనమూలిక లు ఉంటాయి. అయితే భక్తులకు అభయమిస్తూ మరో చే యి, ఆయనకు ప్రతీకరమైన లడ్డూతో మరో చేతిని కూడా రూపొందిస్తున్నారు. మొత్తంగా ధన్వంతరి రూపంలోని శివపుత్రుడికి ఆరు చేతులు ఉంటాయి. పీటపై నిల్చొని, ఏకదంతుడై.. తొండంలో కలశాన్ని ధరించి దర్శనమిస్తారు. పాదాల వద్ద గణపతిని ప్రార్థిస్తూ మూషికుడు ఉంటాడు. లాక్‌డౌన్‌ సమయంలో భక్తులు ఆర్థికంగా దెబ్బతినడంతో పాటు పిల్లలు సైతం చదువులకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో స్వామివారి కుడిపక్కన ధనవర్షాన్ని కురిపిస్తున్నట్లుగా నాలుగున్నర అడుగుల చొప్పున గులాబీ రంగు పద్మంపై లక్ష్మీదేవి, ఎడమ వైపు తెల్లని రంగు పద్మంపై చదువుల తల్లి సరస్వతిని ప్రతిష్ఠిస్తున్నారు. 

గంగమ్మ ఒడి నుంచి బంక మట్టి..

గణనాథుడు పార్వతీ తనయుడిగా రూపుదిద్దుకొని గంగమ్మ ఒడికి చేరడం ఆనవాయితీ. అయితే ఖైరతాబాద్‌ గణేషుడి చరిత్రలోనే తొలిసారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో పారుతున్న పవిత్ర గంగానది ఒడ్డు నుంచి తెచ్చిన బంకమట్టితో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిని రూపొందిస్తారు.

ఎకో గణేశుడిగా..

విగ్రహ తయారీకి 25 కిలోల చొప్పున బరువుండే 30 సంచుల బంకమట్టిని వినియోగిస్తున్నారు. అలాగే విగ్రహ రూపకల్పనకు 50 కట్టల వరిగడ్డి, ఐదు 50 కిలోల బస్తాల బియ్యం పొట్టు వాడుతున్నారు. నగరానికి చెందిన ప్రముఖ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల తయారీదారుడు, సీనియర్‌ ఆర్టిస్ట్‌ కె.నగేశ్‌ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎనిమిది మంది కళాకారులు ఈసారి విగ్రహ తయారీలో పాలుపంచుకుంటున్నారు. విగ్రహం తయారీలో ఎక్కడా లోహం వినియోగించకుం డా పూర్తిగా ప్రకృతిమయంగా వెదురు బొం గు కర్రలను మాత్ర మే ఉపయోగిస్తున్నా రు. స్వామివారితో పాటు ఉప విగ్రహాలుగా కనిపించే లక్ష్మి, సరస్వతిని సైతం మట్టితో రూపొందిస్తున్నారు. సింథటిక్‌ వాడకుండా స్వచ్ఛమైన వాటర్‌ కలర్స్‌ను విగ్రహానికి అద్దుతారు. 

ఆన్‌లైన్‌లోనే దర్శనాలు..

ఈ ఏడాది ప్రజలకు ప్రత్యక్ష దర్శనాలు ఉండవని ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ www.ganapathideva.org ద్వారా స్వామివారిని దర్శించుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. ఈ ఏడాది గణేశుడిని మండపంలోనే ప్రతిష్ఠిస్తున్నామని, భక్తులు ఎవరూ కూడా నేరుగా దర్శనానికి రావద్దని ఆయన కోరారు.

ఖైరతాబాద్‌ మహా గణపతి ఈసారి ‘నవ’ నాయకుడి అవతారమెత్తనున్నాడు. కరోనా రక్కసిని తరిమేసేందుకు ధన్వంతరి రూపంలో దర్శనమివ్వనున్నాడు. గతేడాది 60 అడుగుల ఆజానుబాహుడిలా కనిపించిన పార్వతీ తనయుడు.. ఈసారి గంగమ్మ ఒడి నుంచి తరలివచ్చే స్వచ్ఛమైన బంకమట్టితో తొమ్మిది అడుగుల ఎత్తులోనే కనువిందు చేయనున్నాడు. లక్ష్మి, సరస్వతీ సమేతంగా శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా రూపుదిద్దుకొని నవరాత్రులు పూజలు అందుకోనున్నాడు.


logo