సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Sep 24, 2020 , 01:04:45

ఉన్నది ఉన్నట్టుగా..

ఉన్నది ఉన్నట్టుగా..

3డీ టెక్నాలజీతో అదిరే ఆకృతులు

3డీ హబ్‌గా ఉస్మానియా 

వర్సిటీలో సీపీడీడీఏఎం కేంద్రం 

రూసా 2.0 నిధులతో ఏర్పాటు

త్వరలో డిఫెన్స్‌, రీసర్చ్‌ ప్రాజెక్టులు 

సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న విశ్వవిద్యాలయం 

ఒక వస్తువును  అచ్చం అలాగే తయారు చేయడం కష్టమే.. కానీ 3డీ ప్రింటింగ్‌తో అది సాధ్యమే. ఉన్నది ఉన్నట్టుగా అందమైన ఆకృతులు రూపొందించుకోవడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.  ఎప్పుటికప్పుడు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఓయూ ..ఈ 3 డీ పరిజ్ఞానానికి హబ్‌గా మారుతున్నది. ఇటీవల వర్సిటీలో సెంటర్‌ ఫర్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆడిటివ్‌ మ్యానుఫాక్చరింగ్‌ను స్థాపించారు. గతంలో ఉన్న సెంటర్‌ ఫర్‌ ప్రోటోటైపింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్ట్స్‌ (సీపీటీఐపీ)ను అప్‌గ్రేడ్‌ చేసి, దీనిని నెలకొల్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అధునాతన యంత్రాలను సమకూర్చుకుంటున్నారు.  వీటిలో సాలిడ్‌ టు సాలిడ్‌, లిక్విడ్‌ టు సాలిడ్‌, పౌడర్‌ టు సాలిడ్‌ వంటి 3డీ ప్రింటర్లు ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో కూడా లేని యంత్రాలు మన ఓయూలో ఉండటం గర్వకారణం.

- ఉస్మానియా యూనివర్సిటీ

రూసా 2.0లో భాగంగా...

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పథకమైన రూసా 2.0 (రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ 2.0) ఉస్మానియా యూనివర్సిటీకి మంజూరైంది. ఇందులో భాగంగా రూ. 5 కోట్లతో సీపీడీడీఏఎంను స్థాపించారు. ఇందులో ఎనభై శాతం సొమ్మును యంత్రాలు సమకూర్చుకునేందుకే వినియోగించారు. మిగిలిన నిధులు మౌలిక వసతుల కల్పనకు, ఉద్యోగుల జీత భత్యాలకు కేటాయించారు. 

మెటల్‌ 3డీ ప్రింటర్‌...

సుమారు రూ. 3.6 కోట్లు ఖర్చు పెట్టి దీనిని (ఎస్‌ఎల్‌ఎం 280 హెచ్‌ఎల్‌) జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. దేశంలోనే మరే ఇతర విద్యాసంస్థల్లో ఇది లేకపోవడం గమనార్హం. పౌడర్‌ రూపంలో ఉన్న లోహాలను సాలిడ్‌ రూపంలో 3డీ ప్రింట్‌ చేస్తుంది. ఇది సెలెక్టివ్‌ లేజర్‌ మెల్టింగ్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. తక్కువ బరువు ఉండి, అత్యధిక దృఢమైన వాటిని దీని ద్వారా తయారు చేయవచ్చు. నికెల్‌, కో బాల్ట్‌, కాపర్‌, టైటానియం, అల్యూమినియం, స్టీల్‌ వంటి లోహ ముద్రలను రూపొందించవచ్చు. విమానయాన రంగం, ఆటోమొబైల్‌, డిఫెన్స్‌, మిలిటరీ, వైద్య, బయోమెడికల్‌ రంగాల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మెటీరియల్‌ నుంచి.. 

లిక్విడ్‌ రెసిన్‌ రూపంలో ఉన్న మెటీరియల్‌ నుంచి సాలిడ్‌ 3డీ రూపాలను రూపొందించే ప్రింటర్లను సమకూర్చుకున్నారు. వీటిలో మొదటిది ఆబ్జెక్ట్‌ 30 ప్రో.. దీనిని ఇజ్రాయిల్‌ నుంచి తెప్పించారు. కాన్సెప్టువల్‌ డిజైన్‌, ప్రోటోటైప్‌ మోడల్స్‌, వైద్యరంగం, ఆభరణాల పరిశ్రమ, టూలింగ్‌ అండ్‌ క్యాస్టింగ్‌ల్లో ఈ ప్రింటర్‌ను వినియోగిస్తారు. ఇక రెండోది ఫ్యాబ్‌ ప్రో 1000. దీనిని అమెరికా నుం చి దిగుమతి చేసుకున్నారు. ఇది దేశంలోనే మొదటిది. వ్యాక్యూ మ్‌ క్యాస్టింగ్‌లో మాస్ట ర్‌ ప్యాటర్న్స్‌, టూల్స్‌, మౌల్డ్స్‌, డైస్‌, కాంప్లెక్స్‌ అసెంబ్లీస్‌, కస్టమ్‌ అసెంబ్లీ జిగ్స్‌ అండ్‌ ఫిక్చర్స్‌, విండ్‌ టన్నెల్‌ మోడల్స్‌ తదితర రంగాల్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

ఓయూకే మణిహారం 

సీపీడీడీఏఎం పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే ఓయూకే మణిహారంగానిలుస్తుం ది.  రక్షణ రంగం, విమానయాన రంగానికి సం బంధించిన ప్రాజెక్టులతో చాలా పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉం టుంది. ఈ ప్రాజెక్టులతో పాటు వైద్యులకు ప్రత్యేకంగా ఒక వర్క్‌షాప్‌ నిర్వహించి.. వారి అవసరాలు తెలుసుకోవడంతో పాటు, ఇక్కడ ఉన్న వసతులు, పరికరాలు చూపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమలకు సంబంధించిన నిపుణులకు ప్రత్యేకంగా సర్టిఫికెట్‌ కోర్సులు అందజేసేందుకు కూడా అవసరమైన అనుమతులు తీసుకుంటున్నాం. 

- ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌, డైరెక్టర్‌, 

సీపీడీడీఏఎం, ఓయూ


ప్లాస్టిక్‌ 3డీ ప్రింటర్‌...

దీనిని (ఫార్మిగా పీ 100) ఉస్మానియా యూనివర్సిటీలో సీపీటీఐపీలోనే సమకూర్చుకున్నారు. దేశంలోనే మరే ఇతర విద్యాసంస్థల్లో ఇది కూడా లేదు. దీనిని కూడా జర్మనీ నుంచే దిగుమతి చేసుకున్నారు. ఇది పౌడర్‌ రూపంలోని ప్లాస్టిక్‌ మెటీరియల్‌ నుంచి సాలిడ్‌ రూపంలోకి మారుస్తుంది. ఇది సెలెక్టివ్‌ లేజర్‌ సింటెరింగ్‌ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఫంక్షనల్‌ ప్రోటోటైప్స్‌, ఆటోమోటివ్‌, ఏరోనాటిక్స్‌, ఏరోస్పేస్‌, టూలింగ్‌, మెడికల్‌ సర్జరీ, టూలింగ్‌ అండ్‌ క్యాస్టింగ్‌ తదితర రంగాల్లో ఇది ఎంతో ఉపయోగకరం. 

3డీ స్కానర్‌...

ఆర్టెక్‌ 3డీ స్కానర్‌గా పిలువబడే దీనిని లక్సంబర్గ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇది ప్రధానంగా రివర్స్‌ ఇంజినీరింగ్‌లో ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లోనే ఇది మొదటి 3డీ స్కానర్‌. ఏదైనా ఒక టూల్‌కు సంబంధించిన సరైన కొలతలు తెలియనప్పుడు దానిని ఈ స్కానర్‌ ముందు ఉంచితే, 360 డిగ్రీల్లో అది కొలతలు తీసుకుని, దానిని మరో ప్రింటర్‌కు అనుసంధానం చేసినప్పుడు 3డీ రూపంలో ఆ టూల్‌ను ప్రింట్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది. రివర్స్‌ ఇంజినీరింగ్‌, 3డీ స్కానింగ్‌, 3డీ మోడల్స్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌, ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌, సైన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, పోర్ట్రేట్‌ స్కానింగ్‌, మెడికల్‌ తదితర రంగాల్లో దీనిని వినియోగిస్తారు. 

వైర్‌ టు సాలిడ్‌ 3డీ ప్రింటర్‌...

ఘన రూపంలో ఉన్న వైర్‌ నుంచి సాలిడ్‌ 3డీ రూపాన్ని ప్రింట్‌ చేసే మూడు యంత్రాలను సమకూర్చుకున్నారు. ఇవి ఫ్యూజ్‌డ్‌ డిపోసిషన్‌ మోడలింగ్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. వాటిలో మొదటిది అల్టీమేకర్‌ ఎస్‌5 ప్రో బండిల్‌ను నెదర్లాండ్స్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. వైర్‌ రూపంలో ఉన్న నైలాన్‌ ఫిలమెంట్‌ను ముందుగా పూర్తిగా కరగదీసి.. ద్రవ రూపంలోకి మార్చి, మెటల్‌ 3డీ రూపాన్ని తయారు చేస్తుంది. ర్యాపిడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, ఫంక్షనల్‌ టెస్టింగ్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ కాన్సెప్ట్‌ మోడల్స్‌, టూలింగ్‌, జిగ్స్‌ అండ్‌ ఫిక్చర్స్‌, వైద్యరంగాల్లో దీనిని వినియోగిస్తారు. ఇక రెండోది ఫ్లాష్‌ఫోర్జ్‌ ఫైండర్‌. దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకున్నారు. మూడోది శివ్‌ ఓయూ 3డీ ప్రింటర్‌. దీనిని ఒక ప్రాజెక్టులో భాగంగా యూనివర్సిటీలోనే రూపొందించారు. ఈ రెండూ వైర్‌ రూపంలో ఉన్న వాటిని కరగదీసి ద్రవ రూపంలోకి మార్చి..మెటల్‌ 3డీ రూపాన్ని తయారు చేస్తాయి.

త్వరలో రక్షణ ప్రాజెక్టులు ?

సీపీడీడీఏఎం కేంద్రానికి వివిధ రంగాలకు సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు వచ్చే అవకాశమున్నది. ఇప్పటికే రక్షణ రంగానికి చెందిన డీఆర్‌డీవో అధికారులు పరికరాలను పరిశీలించారు. త్వరలో ప్రాజెక్టుకు సంబంధించి తుది ఒప్పందం చేసుకోనున్నారు. అనాలసిస్‌, డిజైనింగ్‌, ప్రోటోటైపింగ్‌, 3డీ ప్రింటింగ్‌లకు సంబంధించిన ప్రాజెక్టులు రానున్నాయి. రక్షణ రంగంతో పాటు పరిశ్రమలకు చెందిన కన్సల్టెంట్‌, ఆర్‌ అండ్‌ డీ ప్రాజెక్టులు, నూతన ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుల కోసం కూడా పలువురు ఓయూ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.