ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 25, 2020 , 07:51:50

హైదరాబాద్‌ విస్తరణకు అడ్డంకిగా ఆర్మీ స్థలాలు

హైదరాబాద్‌ విస్తరణకు అడ్డంకిగా ఆర్మీ స్థలాలు

  • రోడ్లు వేయనీయరు.. స్కైవేలు కట్టనీయరు
  • కేంద్రం తీరుపై  నగర ప్రజలఆగ్రహం
  • కర్ణాటకలో అడిగిన వెంటనే ధారాదత్తం
  • అత్యవసరమైనా భూములు అప్పగించని మోదీ సర్కార్‌
  • రక్షణశాఖ స్థలాల నుంచి వెళ్లాలంటే సవాలక్ష ఆంక్షలు

సుదీర్ఘపోరాటం తర్వాత బానిస సంకెళ్లు తెంచుకున్న ప్రత్యేక తెలంగాణలో మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటపై అఠారాసీడీ ప్రాంతంలో జాతీయజెండా ఎగురవేసి, అక్కడే పరేడ్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు.  ఇందుకోసం ఏర్పాట్లు చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను అక్కడ కాలు పెడితే కాల్చేస్తామంటూ ఆర్మీ అధికారులు బెదిరించారు. దీనిని సీరియస్‌గా  తీసుకున్న రాష్ట్రప్రభుత్వం డిఫెన్స్‌ భూమిగా ఆధారాలు చూపాలని అడిగితే నోరెళ్లబెట్టారు. ‘అప్పట్లో ఇచ్చారు.. ఆ రికార్డులు కోర్టుల్లో ఉన్నాయి’ అంటూ నమ్మబలికారు. వారం రోజుల గడువు ఇచ్చి వాటిని తీసుకురమ్మంటే.. ఇప్పటిదాకా అటువైపు కూడా రాలేదు. సీఎం కేసీఆర్‌ 2014 నుంచి ఆగస్టు 15న గోల్కొండకోటపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారు కానీ, పరేడ్‌ మాత్రం అక్కడ నిర్వహించడం లేదు.

హైదరాబాద్‌ : విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ అభివృద్ధికి నగరం నడిబొడ్డున ఉన్న రక్షణస్థలాలు అడ్డంకిగా మారుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘హైదరాబాద్‌ స్టేట్‌' భూములను అడ్డాగా మార్చుకున్న రక్షణశాఖ ఇప్పుడు స్థానిక అభివృద్ధికి మోకాలడ్డుతున్నది. ట్రాఫిక్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల నుంచి రోడ్డు లేదా స్కైవే నిర్మించాలన్నా.. తాగునీటి సరఫరా చేయాలన్నా.. పేదలకు ఇండ్లు నిర్మించాలన్నా.. అనుమతుల పేరుతో మోదీ సర్కారు కాలయాపన చేస్తున్నది. సికింద్రాబాద్‌ నుంచి కంటోన్మెంట్‌ మీదుగా మల్కాజిగిరి వెళ్లేదారిలో ఆర్మీ అధికారులు ఆర్నెళ్లకోసారి ఏవోసీ గేట్‌వేసి మూసివేస్తుంటారు. దీంతో ఈ రహదారుల మీదుగా ప్రయాణించే సుమారు 20 లక్షల మంది ప్రజలతోపాటు, 2 లక్షల మంది వాహనదారులు 10-15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. ఈ రోడ్లను మూసివేయడం అనివార్యమైన పక్షంలో.. ప్రత్యామ్నాయ రోడ్లను నిర్మించేందుకు స్థలం కేటాయించాలని ఐదారేండ్లుగా అడుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.

మా వినతిని పెడచెవిన పెడుతున్నారు


సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో పదే పదే రోడ్ల మూసివేతతో 10లక్షలమంది స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక మిలిటరీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రోడ్ల మూసివేతకు సంబంధించి 2018లో కేంద్ర రక్షణశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సైతం మిలిటరీ అధికారులు పాటించడం లేదు. ఏవోసీ రోడ్లు సహా మిలిటరీ అధికారులు మూసేసిన పలు రోడ్లు వందేండ్లకు పైగా స్థానిక ప్రజలు వినియోగిస్తున్నవే. కంటోన్మెంట్‌ చట్టంలో ‘వీధులు’గా పేర్కొన్న రోడ్లను మూసివేయాలంటే సెక్షన్‌-258 ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. - ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రాసిన లేఖలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌

రోడ్డు విస్తరణకు అడ్డంకి

హైదరాబాద్‌లో దాదాపు అన్ని ప్రాంతాలు సిగ్నల్‌ఫ్రీగా మారినా.. కంటోన్మెంట్‌, తిరుమలగిరి, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు. సిద్దిపేట, కరీంనగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌- కరీంనగర్‌ స్టేట్‌హైవే విస్తరణ పనులు పూర్తయినా.. జేబీఎస్‌ నుంచి తూముకుంట వరకు 16 కిలోమీటర్ల విస్తరణ అలాగే ఉండిపోయింది. 4 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి 66.37 ఎకరాలను అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రరక్షణశాఖకు ప్రతిపాదనలు పంపింది. అలాగే ఎన్‌హెచ్‌-44కు అనుసంధానంగా 11 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి 39.40 ఎకరాలు, ఏవోసీ మార్గంలో ప్రత్యామ్నాయ రోడ్లకోసం 41.25 ఎకరాలను లీజు లేదా భూమికిభూమి పద్ధతిన ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. 106 ఎకరాలను బదలాయిస్తే ప్రత్యామ్నాయంగా వనపర్తి జిల్లాలో 600, వికారాబాద్‌ జిల్లాలో 500 ఎకరాలను ఇస్తామనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఏండ్లు గడిచినా కేంద్రం పట్టించుకోవడంలేదు. కంటోన్మెంట్‌ ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు.

గడువు ముగిసినా ఖాళీచేయరు


మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండల పరిధిలోని (గతంలో శామీర్‌పేట) సర్వేనంబర్లు 502, 937లలో 617 ఎకరాల ప్రభుత్వ స్థలం  ఉన్నది. గతంలో అడవులను తలపించేలా ఉన్న ఈ భూములను రక్షణశాఖ విజ్ఞప్తి మేరకు 1968లో నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 85 ద్వారా ఫైరింగ్‌ రేంజ్‌ అవసరాల కోసం మూడేండ్లపాటు లీజుకు ఇచ్చింది. ప్రతి మూడేండ్లకోసారి దానిని రెన్యూవల్‌ చేసుకుంటూ 2013 మార్చి 31 వరకు అక్కడ ఫైరింగ్‌ కార్యకలాపాలు నిర్వహించారు. తర్వాత ప్రజల అవసరానికి ఆ స్థలాలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2013లో రెన్యూవల్‌ చేయకపోగా.. వెంటనే ఖాళీ చేయాలని రక్షణశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ భూములుగా సూచిక బోర్డులు ఏర్పాటుచేసినా డిఫెన్స్‌ అధికారులు మాత్రం అక్కడ్నుంచి కదలడం లేదు.

భూమి రాష్ట్ర ప్రభుత్వానిది.. పొజిషన్‌ డిఫెన్స్‌ది

గోల్కొండ, ఆసిఫ్‌నగర్‌, తిరుమలగిరి, సికింద్రాబాద్‌, బండ్లగూడ, మారేడుపల్లి, షేక్‌పేట్‌ మండలాల పరిధిలో అత్యధికంగా డిఫెన్స్‌ భూములున్నట్టు హైదరాబాద్‌ జిల్లా రెవెన్యూ, సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ అధికారులు గతంలోనే గుర్తించారు. ఇది రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి కాగా, పొజిషన్‌లో మాత్రం డిఫెన్స్‌ ఉన్నది. సుమారు 657 ఎకరాల భూమికి సంబంధించి రక్షణశాఖకు ఇచ్చినట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వద్ద కానీ, అటు రక్షణశాఖ వద్ద కానీ ఎలాంటి పత్రాల్లేవు. సమగ్ర సర్వే చేస్తే మరో 100 నుంచి 200 ఎకరాల ప్రభుత్వ భూమి తేలుతుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. 

ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వానిదే

గోల్కొండ మండల పరిధిలోని సర్వేనంబర్‌ 244, 245, 246లలో 51 ఎకరాలు, గోల్కొండ ఖిలాపై సర్వేనంబర్లు 234, 235, 238 కొంతభాగంలో 50 ఎకరాలు 1939 రెవెన్యూ రికార్డుల ప్రకారం, 1965-1975లో చేసిన టౌన్‌సర్వే రికార్డుల ప్రకారం, ఆర్కియాలజీ గ్రాఫ్‌ల ప్రకారం ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నది. 239 సర్వేనంబర్‌లోఉన్న 31ఎకరాలు మాత్రం 1956 నుంచి డిఫెన్స్‌ పేర మార్చబడింది. ఇది ఎందుకు మార్చారనేదానిపై మాత్రం స్పష్టత లేదు. గోల్కొండ కోటపై అఠారాసీడీ (18మెట్లప్రాతం)లోని కొంత భూమిని  2006లో అప్పటిప్రభుత్వం ముందస్తు స్వాధీనం (అడ్వాన్స్‌ పొజిషన్‌) జీవోను విడుదలచేసి 244, 245, 246 సర్వే నంబర్లలోని 51ఎకరాలు, 234, 235, 238 కొంత భాగంలో ఉన్న మరో 50ఎకరాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది. గోల్కొండ కోట దక్షిణం వైపుఉన్న మాతైదర్వాజ సమీపంలో 139 ఎకరాల స్థలాన్ని కేంద్రప్రభుత్వం డిఫెన్స్‌కు కేటాయించినట్టు రెవెన్యూ రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. కానీ, గోల్కొండకోట చుట్టూఉన్న మాతైదర్వాజ వద్ద, సెవెన్‌ టూంబ్స్‌, ఇబ్రహీంబాగ్‌, ఖిలాఅహ్మద్‌నగర్‌ ప్రాంతాల్లో వందల ఎకరాల భూముల చుట్టూ డిఫెన్స్‌ అధికారులు ఫెన్సింగ్‌ పాతారు.

సచివాలయ నిర్మాణానికీ ససేమిరా

అందరికీ అందుబాటులో ఉండేలా సమీకృత సచివాలయ నిర్మాణానికి సికింద్రాబాద్‌ బైసన్‌పోలో గ్రౌండ్‌ అనువైనదిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం డిఫెన్స్‌ ఆధీనంలోఉన్న 61.032 ఎకరాల గ్రౌండ్‌,  90.694 ఎకరాల జింఖానా మైదానాన్ని తమకు బదలాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోదీకి లేఖరాశారు. ఆ భూమికి బదులుగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో 596 ఎకరాలతోపాటు సుమారు రూ.95 కోట్ల వరకు చెల్లిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలు పలుమార్లు కేంద్ర రక్షణశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రెండేండ్లపాటు కాలయాపన చేసిన బీజేపీ ప్రభుత్వం.. భూములు ఇస్తాం కానీ, ఏటా రూ.31.20 కోట్లు చెల్లించాలనే నిబంధన పెట్టింది. కేంద్రం తీరుతో విసుగుచెందిన తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలోనే నూతన భవన నిర్మాణానికి పూనుకొన్నది.

కేంద్రం వైఖరి సరిగా లేదు..

ట్రాఫిక్‌తోపాటు రోడ్ల విస్తరణ జరగకపోవడంతో అల్వాల్‌ నుంచి తిరుమలగిరి చౌరస్తా మీదుగా సికింద్రాబాద్‌ చేరుకునేందుకు రెండు, మూడు గంటల సమయం పడుతున్నది. ఈ సమస్యను అధిగమించాలంటే రోడ్ల విస్తరణ జరగాలి. ఎలివేటెడ్‌ ఫ్ల్లైఓవర్లు నిర్మాణం కావాలి. ఇవి సాధ్యపడాలంటే.. రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. రాజకీయ దురుద్దేశంతో కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుతగులుతోంది. రక్షణ భూముల అప్పగింత వ్యవహారంలో కేంద్రం వైఖరి సరిగ్గా లేదు. - సంగిశెట్టి సదానంద్‌, కంసారిబజార్‌, న్యూ బోయిన్‌పల్లి

రోడ్ల విస్తరణపై కేంద్రం వివక్ష

కంటోన్మెంట్‌ ప్రాంతంలో రోడ్ల విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతున్నది. రోడ్ల విస్తరణతోపాటు ప్రజోపయోగ కార్యక్రమాలకు రక్షణశాఖ పరిధిలోని భూములను ఇవ్వాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. పలుమార్లు కేంద్రం వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసింది. దశాబ్ద కాలంగా సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ బస్టాండ్‌ నుంచి తిరుమలగిరి, అల్వాల్‌ మీదుగా కరీంనగర్‌ వచ్చి వెళ్లే ప్రధానమార్గం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అలాగే, జేబీఎస్‌ నుంచి తాడ్‌బండ్‌, బోయినపల్లి మీదుగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు వచ్చి వెళ్లే మార్గం కూడా ఇదే స్థితిలో ఉంది. అనివార్యమైన ఈ రోడ్ల విస్తరణకు.. కంటోన్మెంట్‌ పరిధిలోని ఆర్మీ భూములు అడ్డంకిగా మారాయి. - జక్కుల మహేశ్వర్‌రెడ్డి, ఒకటోవార్డు సభ్యుడు, కంటోన్మెంట్‌ బోర్డు
logo