శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 06:55:47

మరో పదిరోజులు స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌

మరో పదిరోజులు స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌

  • 18 నుంచి నిరంతరాయంగా కొనసాగిన స్పెషల్‌ డ్రైవ్‌
  • మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో       మరో పది రోజులు పొడిగింపు
  • బల్దియా పరిధిలోని పది సర్కిళ్లపై ప్రత్యేక దృష్టి
  • చెత్త, వ్యర్థాల తొలగింపునకు 2,530 మంది సిబ్బంది, 737 వాహనాలు
  • కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నగరంలోని వందలాది కాలనీలు తీవ్ర ముంపునకు గురైన విషయం తెలిసిందే. దాదాపు నగరంలో 235కాలనీల్లో చెత్త, ఇతరత్రా వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ను చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ గురువారం తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నగరంలో 89,134 మెట్రిక్‌ టన్నుల చెత్తను, వ్యర్థాలను తొలగించినట్లు చెప్పారు. ఇందులో 62,996 మెట్రిక్‌ టన్నుల చెత్తను జవహర్‌నగర్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌కు, 15,634 మెట్రిక్‌ టన్నుల భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించి జీడిమెట్ల, ఫతుల్లాగూడలోని సీఅండ్‌డీ ప్లాంట్లకు పంపినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 10,504 మెట్రిక్‌ టన్నుల రీ సైక్లింగ్‌ వ్యర్థాలను సేకరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా పది సర్కిళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వివరించారు. ఆయా సర్కిళ్ల వారీగా నియమించిన సంబంధిత స్పెషల్‌ శానిటేషన్‌ అధికారుల సెల్‌ నంబర్లను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, శానిటేషన్‌పై జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్‌ నం.040-21111111లకు ఫిర్యాదు చేయాలన్నారు. 

వ్యర్థాల తొలగింపునకు 737 వాహనాలు

మిషన్‌ మోడ్‌ పద్ధతిలో చేపట్టిన స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ కొరకు అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను వినియోగిస్తున్నామన్నారు. చెత్త తరలింపునకు రెగ్యులర్‌గా వినియోగిస్తున్న 242 వాహనాలకు అదనంగా 495వాహనాలను సిద్ధం చేసి మొత్తం 737 వాహనాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. అందులో 177 జేసీబీలు, 26 బాబ్‌ కాట్స్‌, 258 టిప్పర్లు, ఆరు టన్నుల సామర్థ్యం కలిగిన 96టిప్పర్లు, 10 టన్నుల సామర్థ్యం కలిగినవి 126టిప్పర్లతో పాటు 44 ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్టు తెలిపారు. అయితే, వరద ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను, వరదనీటిని తొలగించేందుకు 334పంపులను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీములకు చెందిన 1008 మందితో పాటు అదనంగా 1522మందిని రోజు వారీ పద్ధతిపై తీసుకొని వినియోగిస్తున్నట్టు తెలిపారు. అంటు వ్యాధులను నివారించుటకు కాలనీల్లో బ్లీచింగ్‌, యాంటీ లార్వా, క్రిమీ సంహారకాలను స్ప్రేయింగ్‌ చేయిస్తున్నామన్నారు. శానిటేషన్‌, ఎంటమాలజీ విభాగాలకు చెందిన 23వేల మంది సిబ్బందితో పాటు అదనంగా 2,530 మంది వర్కర్లను వినియోగిస్తున్నట్టు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో పేరుకుపోయిన చెత్త, నిర్మాణ, ఇతర వ్యర్థాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి సాధారణ స్థితికి తెచ్చేందుకు, అంటు వ్యాధుల నివారణకు చేపట్టిన స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో రూ.5 కోట్ల 51 లక్షలను ఇప్పటికే ఖర్చు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ను ఇంకా పది రోజుల పాటు కొనసాగించుటకు వినియోగిస్తున్న అదనపు వాహనాలు, సిబ్బందికి మరో రూ.5కోట్లు పైబడి ఖర్చు అవుతుందన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు కమిషనర్‌ తెలిపారు.