శనివారం 26 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 07, 2020 , 00:56:52

ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ..సిద్ధంగా మరో ఫ్లైఓవర్‌

ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ..సిద్ధంగా మరో ఫ్లైఓవర్‌

ప్రయాణానికి సులువైన మార్గం 

యుద్ధ ప్రాతిపదికన  పనులు  

ఎల్బీనగర్‌, ఆగస్టు 6 : ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా మరో ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇన్నర్‌రింగ్‌రోడ్డు, నాగార్జునాసాగర్‌ రహదారిలో బైరామల్‌గూడ జంక్షన్‌ వద్ద  ట్రాఫిక్‌ చిక్కులకు త్వరలోనే తెర పడనుంది. ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తాలో అండర్‌పాస్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభమైన అనంతరం బైరామల్‌గూడ జంక్షన్‌లోనే ట్రాఫిక్‌ రద్దీ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే ఎల్బీనగర్‌ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా కామినేని జంక్షన్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపు రెండు ఫ్లై ఓవర్లు, ఓ అండర్‌పాస్‌, చింతలకుంటతో అండర్‌పాస్‌, ఎల్బీనగర్‌లో ఎడమవైపు ఫ్లై ఓవర్‌ ఇప్పటికే మంత్రులు కేటీఆర్‌, సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాగా  బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధ మైంది. 

  రూ. 26. 50 కోట్ల వ్యయంతో బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ 

  ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో బైరామల్‌గూడ జంక్షన్‌లో ట్రాఫీక్‌ ఫ్రీజోన్‌గా చేసేందుకు ఎస్‌ఆర్‌డీపీలో మొత్తం మూడు ఫ్లై ఓవర్లు నిర్మాణం చేస్తున్నారు. వీటిలో కుడివైపు నిర్మాణం పూర్తయ్యింది. రూ. 26.50 కోట్ల వ్యయంతో ప్రీ కాస్ట్‌ విధానంలో ఫ్లై ఓవర్‌ను నిర్మాణం చేశారు. చౌరస్తాను సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం చేసే విధంగా ఎల్బీనగర్‌ నుంచి ఓవైసీ జంక్షన్‌ వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ను 14 పిల్లర్స్‌తో నిర్మిస్తున్నారు. 11 మీటర్ల వెడల్పుతో 780 మీటర్ల దూరం నిర్మస్తున్న ఫ్లై ఓవర్‌ ద్వారా ఎల్బీనగర్‌ వైపు నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా వాహనాలు ప్రయాణం చేసుందుకు వీలుగా ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం ఎల్బీనగర్‌ నుంచి బైరామల్‌ గూడ దారిలో 11 భవనాలను సేకరించి తొలగించారు. 

జోరుగా సాగుతున్న   పనులు 

  బైరామల్‌గూడ జంక్షన్‌లో ఎల్బీనగర్‌ నుండి ఓవైసీ వైపు వెళ్లే కుడివైపు ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయ్యాయి. ఇక ఎడమ వైపు ఫ్లై ఓవర్‌ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ పనులు కూడా పూర్తయితే ఎల్బీనగర్‌ వైపు ప్రయాణం ట్రాఫిక్‌ లేకుండా సాగుతుంది. 

రెండవ  లెవల్‌ ఫ్లై ఓవర్‌తో మరింత ఈజీగా ..

  బైరామల్‌గూడలోని రెండు ఫ్లై ఓవర్స్‌ పూర్తయ్యాక వీటిపైన మరో రెండవ లెవల్‌ వంతెన నిర్మాణం చేయనున్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ఓవైసీ దవాఖాన నుంచి వచ్చే వారు నేరుగా చింతలకుంట, సాగర్‌రింగ్‌రోడ్డులో దిగి వెళ్లేందుకు ఈ రెండవ లెవల్‌ ఫ్లై ఓవర్‌ ప్రస్తుత కుడి, ఎడమ ఫ్లై ఓవర్లపైన నిర్మించనున్నారు. రూ. 70.73 కోట్ల వ్యయంతో 1760 మీటర్ల దూరం ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. 

ఎల్బీనగర్‌ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం 

  ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఎల్బీనగర్‌ రూపురేఖలు త్వరలోనే మారుస్తాం. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ట్రాఫిక్‌ చిక్కులకు పూర్తిస్థాయిలో చెక్‌ పెడుతున్నాం. బైరామల్‌గూడ చౌరస్తాలో ట్రాఫిక్‌ చిక్కులు త్వరలోనే తీరనున్నాయి. ఇక్కడ రెండు ఫ్లై ఓవర్లు పూర్తయితే సాగర్‌ రహదారితో పాటుగా ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ప్రయాణం సులువవుతుంది. జాతీయ రహదారితో పాటుగా సాగర్‌ రింగ్‌రోడ్డులో ట్రాఫిక్‌ ఇక్కట్లను తొలగిచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. 

-  దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి , ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే 

ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పడుతుంది 

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చొరవతో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయి. ప్రధానంగా ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు పూర్తయితే ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పడనుంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతో పాటుగా సాగర్‌రింగ్‌రోడ్డులో ట్రాఫిక్‌ చిక్కులు బైరామల్‌గూడలో రెండు ఫ్లై ఓవర్లు పూర్తయితే పరిష్కారం అవుతాయి. 

- రమావత్‌ పద్మానాయక్‌ , కార్పొరేటర్‌, హస్తినాపురం డివిజన్‌ 


logo