మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 12, 2020 , 23:33:22

ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అండగా..

ఫిషర్‌ ఉమెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఆర్థికసాయం

ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున అందజేత

మత్స్యకారుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ 

కుత్బుల్లాపూర్‌, జూలై12: మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ సారథ్యంలో కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని 132 జీడిమెట్ల డివిజన్‌ పరిధిలోని వెన్నలగడ్డ చెరువు ఫిషర్‌ ఉమెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ సభ్యులకు లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఒక్కో సభ్యురాలికి రూ.3 లక్షల చొప్పున 30 మంది మహిళా సభ్యులకు ఈ ఆర్థిక సహాయాన్ని పార్టీ యువజన విభాగం నాయకుడు కేపీ విశాల్‌గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేకానంద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవించే వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసి, వారి జీవన విధానాల మెరుగు కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కులవృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వృత్తిని తిరిగి ప్రారంభించుకోవడానికి సొసైటీల ద్వారా ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషర్‌ మెన్స్‌ సెంట్రల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ మాజీ వైస్‌ చైర్మన్‌ నాగభూషణం, నాయకులు అశోక్‌కుమార్‌, గుమ్మడి మధుసూదన్‌, మల్లేశ్‌, కృష్ణ, యశ్వంత్‌, ఉమెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షురాలు ఎల్‌.కృష్ణవేణి, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి లలిత, డైరెక్టర్లు భారతి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. 


logo