ఆదివారం 25 అక్టోబర్ 2020
Hyderabad - Aug 04, 2020 , 23:47:04

ఇక గోకుల్‌ ప్లాట్స్‌ వంతు!

ఇక గోకుల్‌ ప్లాట్స్‌ వంతు!

అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న కొరడా..

గోకుల్‌ ప్లాట్స్‌లో భారీగా కూల్చివేతలు

గత కొద్ది రోజులుగా జీహెచ్‌ఎంసీ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న విషయం విదితమే. ఇటీవల మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో పెద్ద సంఖ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు మంగళవారం అదే ప్రాంతంలోని గోకుల్‌ ప్లాట్స్‌లో పలు బహుళ అంతస్థుల భవనాలను కూల్చివేశారు. ఇందుకు అత్యాధునిక యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.

 సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హఫీజ్‌పేట్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 78లోగల 107ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఆ భూమి తమదని ప్రభుత్వం వాదిస్తుండగా, తమకు వారసత్వంగా సమకూరినట్లు ఓ ప్రైవేటు కంపెనీ పేర్కొంటున్నది. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉండటంతో జీహెచ్‌ఎంసీ ఈ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలేదు. అయినప్పటికీ అక్రమంగా పెద్ద సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. రాజకీయ నాయకుల జోక్యంతో అక్రమ నిర్మాణాలకు అడ్డులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అక్రమ నిర్మాణాలపై న్యాయస్థానం సైతం కన్నెర్ర చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం గోకుల్‌ ప్లాట్స్‌లో బహుళ అంతస్థుల భవనాలను సైతం ఆధునిక యంత్రాలతో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. ఎవ్వరూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని, లేనిపక్షంలో భారీగా నష్టపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. logo