మంగళవారం 19 జనవరి 2021
Hyderabad - Dec 06, 2020 , 05:37:47

అదనంగా 75కోట్ల లీటర్లు

అదనంగా 75కోట్ల లీటర్లు

  • మహానగరానికి సమృద్ధిగా జలాలు 
  • ఘన్‌పూర్‌ వద్ద అతిపెద్ద నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం 
  • కొండపోచమ్మ సాగర్‌ నుంచి ఘన్‌పూర్‌కు నదీ జలాల తరలింపు 
  • శుద్ధి నీరు గోదావరి రింగు మెయిన్‌తో అనుసంధానం 
  • ప్రాజెక్టు పనులు వేగవంతం చేసిన జలమండలి

మహానగరానికి సమృద్ధిగా నీరు అందించేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ఇందుకోసం ఘన్‌పూర్‌ వద్ద అతిపెద్ద నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నది. రూ. 4,777 కోట్ల కేశవాపూర్‌ ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ నుంచి నదీ జలాలను ఈ కేంద్రానికి తరలిస్తారు. సుమారు 75 కోట్ల లీటర్లను ఇక్కడ శుద్ధి చేస్తారు. ఆ నీటిని గోదావరి రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌కు అనుసంధానం చేసి.. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 2.41 కోట్ల లీటర్లకు తోడు అదనపు నీటిని అందుబాటులోకి తెస్తారు.ఈ మేరకు ఘన్‌పూర్‌ నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతుండగా, పది నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.

హైదరాబాద్‌ మహానగర ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంలభించనుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పనులు త్వరలోనే పూర్తికానున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న నీటితోపాటు అదనపు జలాలు నగరానికి వచ్చేలా  మహత్తర ప్రాజెక్టులకు జలమండలి శ్రీకారం చుట్టింది. కొండపోచమ్మ సాగర్‌నుంచి నీటిని తీసుకొచ్చి నగర శివారులో శుద్ధి చేసి నగరవాసులకు అందించే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.

- సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా జలమండలి నీటి సౌకర్యం మెరుగుపరుస్తున్నది. సంస్థ పరిధిలో 10.6 లక్షల నల్లా కనెక్షన్లకు వివిధ వనరుల నుంచి 468 ఎంజీడీల (మిలియన్‌ గ్యాలన్ల) నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తరిత ప్రాంతాల్లోని ప్రజలకు సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే అదనంగా అవసరమైన 75 కోట్ల లీటర్ల తాగునీటిని మహానగరానికి తరలించేందుకు ఘన్‌పూర్‌ వద్ద చేపట్టిన భారీ నీటి శుద్ధి కేంద్రం పనులు వడివడిగా సాగుతున్నాయి. మరో పది నెలల్లో ఈ భారీ రిజర్వాయర్‌ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఎండీ దానకిశోర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల వేగిరంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రూ.4777 కోట్ల కేశవాపూర్‌ ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ నుంచి ఘన్‌పూర్‌కు నదీ జలాలను తరలించనున్నారు. శుద్ధి చేసిన నీటిని గోదావరి రింగ్‌ మెయిన్‌కు అనుసంధానం చేయనున్నారు. 

కేశవాపూర్‌ రిజర్వాయర్‌ పనులు ఆలస్యమైనా సకాలంలో ఘన్‌పూర్‌ నుంచి నగరానికి నీటిని అందించనున్నారు. ఘన్‌పూర్‌ నీటి శుద్ధి కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్‌ నుంచి 3600 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ పైపులైన్‌ ఏర్పాటు చేసి గోదావరి నదీ జలాలను తరలిస్తారు. అక్కడ నిత్యం సుమారు 75 కోట్ల లీటర్ల గోదావరి జలాలను శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన గోదావరి జలాలను 9 కిలోమీటర్ల మేర దూరంలోని శామీర్‌పేట వరకు మరో భారీ పైపులైన్‌ ఏర్పాటు చేసి గోదావరి రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌కు అనుసంధానించనున్నారు. దీంతో నగరంలో ప్రస్తుతం సరఫరా చేస్తున్న 241 కోట్ల లీటర్ల నీటికి అదనంగా మరో 75 కోట్ల లీటర్ల గోదావరి జలాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.