సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 00:57:29

నగరంలోని దుకాణాలకు సరి, బేసీ నెంబర్లు కేటాయింపు

నగరంలోని దుకాణాలకు సరి, బేసీ నెంబర్లు కేటాయింపు

హైదరాబాద్  : లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కేటాయించిన రోజుల్లోనే షాపులు తెరవాలని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమత అన్నారు. మంగళవారం కూకట్‌పల్లి జోన్‌ పరిధిలో షాపులకు నంబర్లు వేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సడలింపులు ఇచ్చిందని ప్రజలు, దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని షాపులన్నింటికీ 1, 2 నంబర్లు కేటాయించామని 1వ నంబర్‌ సోమ, బుధ, శుక్రవారం, 2వ నంబర్‌ మంగళ, గురు, శనివారం తెరువాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంహెచ్‌వోలు చంద్రశేఖర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఉన్నారు.

హైదర్‌నగర్‌ : పలు మినహాయింపులతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో పలు వాణిజ్య దుకాణాలు మంగళవారం తెరుచుకున్నాయి. జోన్‌ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్‌, ఆర్‌సీపూర్‌, యూసుఫ్‌గూడ సర్కిళ్ల పరిధిలో ఆయా సర్కిళ్ల డీసీలు, ఏఎంవోహెచ్‌ల పర్యవేక్షణలో తొలి రోజు సరి, బేసి సంఖ్యలను దుకాణాల ఎదుట రాయించారు. అందుకు అనుగుణంగా దుకాణాలు తెరిచి, కొవిడ్‌ నిబంధనలకు లోబడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలని జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ తెలిపారు.

తెరుచుకుంటున్న దుకాణాలు

కూకట్‌పల్లి: లాక్‌డౌన్‌ సడలింపుతో కూకట్‌పల్లి, మూసాపేట్‌ జంట సర్కిళ్ల పరిధిలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరుచుకుంటున్నాయి. రోజు విడిచి రోజు దుకాణాలు తెరిచే విధంగా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి గాను దుకాణాలకు నంబరింగ్‌ ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా శానిటైజర్‌, మాస్కులు వినియోగిస్తూ విక్రయాలు చేయాలని, కొనుగోలుదారులు సైతం మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు.


logo