బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 07, 2020 , 00:58:19

పాఠాలన్నీ యాప్‌లోనే

పాఠాలన్నీ యాప్‌లోనే

  • వర్క్‌షీట్లు కూడా అందులోనే.. 
  • సెలవుల్లో సాంకేతికత అందిపుచ్చుకుంటున్న విద్యార్థులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వరుస సెలవుల నేపథ్యంలో పిల్లలను గాడిన పెట్టడమంటే కష్టంతో కూడుకున్న పనే. లాక్‌డౌన్‌ ఆకస్మిక సెలవుల నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు హోంబేస్డ్‌ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నాయి. సాంకేతికతను, యాప్‌లను వాడుకుంటూ పిల్ల లు చెడుమార్గాలు పట్టకుండా జాగ్రత్తపడుతున్నాయి. కొన్ని పాఠశాలలు యాప్‌లు, వాట్సాప్‌లను, మరికొన్ని యూట్యూబ్‌ను, వినియోగించుకుని బోధనను కొనసాగిస్తున్నాయి. పిల్లలు.. టీచర్లు ఇంట్లోనే ఉంటూ రోజుకో పాఠాన్ని పూర్తిచేస్తూ ఎంతోకొంత విజ్ఞానాన్ని పంచుతున్నారు. బైజూస్‌, జూమ్‌, టీచర్స్‌ యాప్‌, డైలీ డైరీ, పాఠశాల యాప్‌ల ఆధారంగా విద్యాబోధన కొనసాగిస్తున్నారు. ఆ వివరాలేంటో మనమూ ఓ సారి చూద్దాం..

పాఠశాల యాప్‌..

కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ సేవల కోసం ఉమంగ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన పాఠశాల యాప్‌ సైతం ఉంది. ఇందులో కోటి వరకు ఎలక్ట్రానిక్‌ బుక్స్‌, ఆడియోలను అప్‌లోడ్‌ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులు వారి కోసం అన్ని సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాల ఆడియోలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 693 పబ్లికేషన్లు, 504 ప్లిక్‌బుక్స్‌, 3855 ఆడియోలు, వీడియోలున్నాయి. హిందీ, ఇంగ్ల్లిష్‌, ఉర్దూ భాషల్లో 1వ నుంచి 12వ తరగతి వరకు గల పాఠ్యాంశాలు లభిస్తాయి. ఆండ్రాయిడ్‌, విండోస్‌, ఐవోఎస్‌ లాంటి ఆపరేటింగ్‌ సిస్టం గల ఫోన్లల్లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ఉచితంగా లభ్యమవుతున్నది. 

సర్కారీ బడుల్ల్లోనూ..

 హైదరాబాద్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సైతం కర్తవ్య నిష్టతో పని చేస్తున్నారు. సెలవుల్లోనూ పర్యవేక్షణ జరిపి హోంబేస్డ్‌ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నారు. చేతిరాత డ్రాయింగ్‌లను ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు. పనిలో పనిగా కరోనాపై సైతం అవగాహన  కల్పిస్తున్నారు. ఫోన్ల ద్వారా హోం వర్క్‌ సూచనలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల అంబర్‌పేట ప్రధానోపాధ్యాయుడు బద్రీనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని పర్యవేక్షణ జరుపుతున్నారు. సెలవుల్లో ఉత్తమ ప్రదర్శన చూపించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, ప్రొత్సాహకాలు అందజేస్తామని ఆయన వివరించారు.

బైజూస్‌ యాప్‌.. 


బైజూస్‌ యాప్‌ ఇటీవల కాలంలో బాగా ప్రాచూర్యం పొందుతున్నది. ఈ యాప్‌ ద్వారా విద్యార్థులు ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ది లెర్నింగ్‌ యాప్‌ అన్న ట్యాగ్‌లైన్‌ ఉన్న ఈ యాప్‌ పరీక్షలు, మార్కుల కోసం కాకుండా విజ్ఞానాన్ని పంచుతున్నది. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ ఈ యాప్‌లో నిక్షిప్తం చేశారు. 

చేయిస్తున్నారిలా..

  • తరగతి పుస్తకంలోని పాఠాలను చదవడం. తల్లిదండ్రుల ఎదుటే రోజుకో పాఠాన్ని చదివి.. అర్థం చేసుకోవాలి. అంతేకాదు. చదివిన పేజీలపై తల్లిదండ్రుల సంతకం తీసుకోవాలి.
  • ప్రతిరోజు చేతిరాతను ప్రాక్టీస్‌ చేయాలి. నోట్స్‌ రాసిన పేజీలపై తల్లిదండ్రుల సంతకం తీసుకోవాలని సూచిస్తున్నారు. 

జూమ్‌ యాప్‌తో బోధన..


కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ‘వీడియో కాన్ఫరెన్స్‌' ద్వారా విద్యాబోధనను కొనసాగిస్తున్నారు. ఎస్సెస్సీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తుండగా, ఇందుకు ‘జూమ్‌' యాప్‌ను వినియోగించుకుంటున్నారు. పాఠశాల యాజమాన్యం వారం రోజుల షెడ్యూల్‌ను ముందే సిద్ధం చేసి, విద్యార్థులు.. ఉపాధ్యాయులకు ఆయా సమాచారాన్ని చేరవేస్తున్నది. ఇలా వారానికి 20 క్లాసులకు షెడ్యూల్‌ను సిద్ధం చేసి పంపిస్తున్నారు. పాఠశాల పంపించిన లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయులు మందస్తుగా బోధనకు సంసిద్ధమై షెడ్యూల్‌ల్లో పేర్కొన్న సమయానికి వీడియో కాన్ఫరెన్స్‌ సహకారంతో పాఠాలు చెబుతున్నారు. ఈ యాప్‌ సహకారంతో పాఠాలు శ్రద్ధగా వింటున్నట్లు పాఠశాల చైర్మన్‌ మురళీ ముకుంద్‌ తెలిపారు. 

మైక్లాస్‌బోర్డు, ఎక్ట్రామ్యాథ్స్‌.. 


మరికొన్ని విద్యాసంస్థలు మైక్లాస్‌ బోర్డు (ఈఆర్‌పీ), ఎక్ట్రామ్యాథ్స్‌ అప్లికేషన్లను సైతం వినియోగించుకుంటున్నాయి. ఉదాహరణకు ప్రోటాన్స్‌, న్యూట్రాన్స్‌ పాఠా న్ని చెప్పే ముందు ఉపాధ్యాయులు ఈ అప్లికేషన్లలోని వీడియోలను చూడాలని సూచిస్తారు. విద్యార్థులంతా చూసిన తర్వాత టీచర్‌ ఇంట్లో ఉండి పాఠ్యాంశాన్ని బోధిస్తారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతున్నదని మెరిడియన్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌, సీఈవో డా. ఉషారెడ్డి తెలిపారు.  చిన్నపిల్లలకు సైతం రీడింగ్‌ టాస్క్‌, కమ్యూనికేషన్‌ టాస్క్స్‌ గణిత సంబంధ వర్క్‌షీట్స్‌ను పంపిస్తున్నమని, కొంత మందికి వర్క్‌షీట్స్‌ మెయిల్స్‌ చేస్తున్నామని తెలిపారు.

వాట్సాప్‌తో.. 


వాట్సాప్‌ ఆధారంగా డిస్టెన్స్‌ వర్చువల్‌ లెర్నింగ్‌ విధానాన్ని కొన్ని పాఠశాలలు అనుసరిస్తున్నాయి. వాట్సాప్‌ సహకారంతో అటు పాఠశాల, ఇటు పిల్లల తల్లిదండ్రులతో అనుసంధానం చేయబడి ఉంటారు. ప్రతిరోజూ పిల్లల తల్లిదండ్రుల వాట్సాప్‌నకు వర్క్‌షీట్‌కు పంపిస్తున్నారు. పిల్లలు రాసిన సమాధాన పత్రాలను తల్లిదండ్రులు ఇమేజ్‌ రూపంలో తిరిగి టీచర్‌కు పంపించాలి. టీచర్లు మూల్యాంకనం చేసి మళ్లీ తల్లిదండ్రులకు పంపిస్తారు. ఆ తర్వాత ఎవరో ఒక టీచర్‌ పిల్లలకు ఫోన్‌ చేసి మాట్లాడతారు. వర్క్‌షీట్‌లోని తప్పొప్పులను చర్చిస్తారు. జనరల్‌ బుక్స్‌, స్టోరీ చదివించడం వంటివి చేయిస్తున్నారు.  స్టోరీ అంశాన్ని క్లుప్తంగా రాసి పంపమంటున్నారు. ఉన్నత తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాలను వీడియోలుగా చిత్రీకరించి, తల్లిదండ్రులకు పంపించడం, యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి లింక్‌ పంపిస్తున్నారు. డిస్టెన్స్‌ వర్చువల్‌ లెర్నింగ్‌కు పిల్లలు, తల్లిదండ్రుల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని స్టేట్‌ విద్యాసంస్థల చైర్మన్‌ అమర్‌నాథ్‌ తెలిపారు.


logo