గురువారం 28 మే 2020
Hyderabad - May 19, 2020 , 23:51:55

56 రోజుల తర్వాత జనం రద్దీతో కిటకిటలాడింది

56 రోజుల తర్వాత జనం రద్దీతో కిటకిటలాడింది

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ సడలింపుతో ఒకవైపు దుకాణాలు..మరో వైపు ఆటోలు.. క్యాబ్‌లు..ఇలా ఎటు చూసినా హైదరాబాద్‌ మంగళవారం జనం రద్దీతో కిటకిటలాడింది. మార్చి 24 నుంచి అంటే దాదాపు  56రోజుల తర్వాత మంగళవారం నగరంలో మళ్లీ సాధారణ జీవనం కనిపించింది. అయితే ప్రభుత్వం అన్ని రకాల షాపులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోజు విడిచి రోజు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. సమస్యలు తలెత్తకుండా సరి, బేసి సంఖ్య ఆధారంగా దుకాణాలు తెరుస్తున్నారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు  కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. ఆ సమయంలో అన్ని రకాల దుకాణాలు మూసివేయాల్సిందే. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మంగళవారం దుకాణాలకు వరుసగా నంబరింగ్‌ వేసే పనులు చేపట్టారు. ఉదాహరణకు వరుసగా ఒకటి నుంచి పది నంబర్‌ వరకు దుకాణాలుంటే, మొదటి రోజు ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది నంబర్ల దుకాణాలు తెరుచుకుంటాయి. ఆ మరుసటిరోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది నంబర్ల దుకాణాలు తెరుచుకుంటాయి. దుకాణాల నిర్వహణ, క్రమపద్ధతి అమలుపై నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఆదేశించారు. మలక్‌పేట్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించి దుకాణాలకు నంబరింగ్‌ ఏర్పాటును పర్యవేక్షించారు.

నిబంధనల అమలుపై తనిఖీలు : లోకేశ్‌కుమార్‌

లాక్‌డౌన్‌ సడలించినప్పటికీ దుకాణాదారులు, కొనుగోలుదారులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీచేసినట్లు, వీటి అమలుపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించేవారికి జరిమానాలు విధిస్తామన్నారు. 

వీటిపై నిషేధం..

మాల్స్‌, రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు, సినిమాహాళ్లు, ఫంక్షన్‌హాళ్లు తదితర జనాలు అధికంగా గుమిగూడే అవకాశమున్న ప్రాంగణాలకు మాత్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదు. అయితే రెస్టారెంట్ల నుంచి టేక్‌ అవేకు మాత్రం అనుమతించారు. కంటైన్మెంట్‌ జోన్లలో యథావిధిగా ఏ దుకాణం తెరిచే అవకాశం లేదు. వీటిపై ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి. 

టెంపరేచర్‌ చెక్‌ చేశాకే..

నగరంలో దుకాణాదారులు థర్మల్‌ స్క్రీనింగ్‌తో టెంపరేచర్‌ చెక్‌ చేసిన తర్వాతనే వినియోగదారులను లోపలికి అనుమతిస్తున్నారు. శానిటైజర్లు కూడా అందించి చేతులు శుభ్రం చేసుకునేలా, దుకాణాల ఎదుట భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఐటీ కార్యకలాపాలు ఇలా..!

ఐటీ కార్యాలయాలు తమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. కానీ చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రంహోంకే ప్రాధాన్యతనిస్తున్నాయి. ముఖ్యంగా వారు కూర్చునే వరుస క్రమంలో మార్పులు తీసుకొస్తున్నారు. మరికొన్ని రోజుల వరకు కొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రం హోంకే అనుమతిచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల రాకపోకలతో గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. మంగళవారం కొన్ని కంపెనీల్లో ఉద్యోగులు విధులు నిర్వహించారు.

తెరుచుకున్నవి ఇవే..

  •  ఆటోమొబైల్స్‌, కార్‌ షోరూమ్‌లు
  •  సర్వీసింగ్‌ సెంటర్లు, సెల్‌ఫోన్‌ ఔట్‌లెట్లు
  •  సెలూన్లు  
  •  ఎలక్ట్రిక్‌ షాపులు
  •  ఫర్నిచర్‌ దుకాణాలు
  •  బట్టల షాపులు, చిన్నచిన్న వ్యాపారాలు
  •  మోటారు గ్యారేజీలు
  •  గార్మెంట్‌ షాపులు, ఆభరణాల 
  • దుకాణాలు
  •  హార్డ్‌వేర్‌, సిమెంట్‌ దుకాణాలు, బుక్‌స్టోర్లు
  •  చిన్నచిన్న కర్మాగారాల్లో వస్తువుల తయారీ 
  •  బేకరీలు, స్వీట్‌ హౌస్‌లు 
  •  ట్యాక్సీలు, ఆటోల సేవలు

  పాటించాల్సిన జాగ్రత్తలు..

   • దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
   • కొనుగోలుదారులు సైతం తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
   • నో మాస్కు, నో గూడ్స్‌, నో సర్వీస్‌ నిబంధన కచ్చితంగా అమలు
   • మాస్కు నిబంధన అతిక్రమిస్తే రూ.1000 జరిమానా విధిస్తారు
   • నాలుగు అడుగుల భౌతిక దూరం తప్పనిసరి. దీనికి ఫుట్‌ మార్కింగ్‌ చేయాలి
   • ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద హ్యాండ్‌ శానిటైజర్‌ సదుపాయం కల్పించాలి
   • వీలైనచోట ఆటోమేటిక్‌ డోర్స్‌ను ఏర్పాటు చేయాలి
   • ఈ నిబంధనలు ఈనెల 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి

   తెరుచుకున్న సెలూన్లు..

   లాక్‌డౌన్‌తో మూతపడ్డ సెలూన్‌ దుకాణాలు కొన్ని తెరుచుకున్నాయి. దీంతో వృత్తిపై ఆ ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న నాయీబ్రాహ్మణులు సంబరపడుతున్నారు. మంగళవారం కావడంతో సెలూన్స్‌ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. బుధవారం నుంచి సేవలు అందుబాటులో ఉండనున్నాయి.   


logo