శనివారం 11 జూలై 2020
Hyderabad - Jun 06, 2020 , 02:30:22

పారిశ్రామికవేత్తలుగా ఆదివాసీలు

పారిశ్రామికవేత్తలుగా ఆదివాసీలు

నాడు నాగరికతకు దూరంగా ఉన్న గిరిజనులు నేడు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. అక్షరాలు నేర్వని అడవి బిడ్డలుఉత్పాదక రంగంలో ఉరకులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నవశకానికి నాంది పలికిన గిరిజన సంక్షేమశాఖ అడవుల్లో అరుదుగా దొరికే గిరి ఉత్పత్తులకు మహర్దశ కల్పించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిసత్యవతి రాథోడ్‌, ఆ శాఖ కమిషనర్‌, కార్యదర్శి క్రిష్టినా జడ్‌ చొంగ్తూ చొరవతో గిరిజన సహకార సంస్థఆధ్వర్యంలో అడవి ఉత్పత్తులు అంగడిలోకి తెచ్చేందుకు జీసీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రాసెసింగ్‌ రంగంలో ఇప్పటికే 3 యూనిట్లు నెలకొల్పడంతో పాటు కొత్తగా మరో8యూనిట్లు స్థాపించేందుకు రంగం సిద్ధం చేశారు.

అహ్మద్‌నగర్‌ : అడవిలో దొరికే స్వచ్ఛమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు గిరిజన సహకార సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో గిరి ఉత్పత్తులంటే ఒక తేనె మాత్రమే మన మదిలో మెదిలేది. కానీ అడవిలో దొరికే అమూల్యమైన ఉత్పత్తులతో ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యయ్యే అనేక ఉత్పత్తులను బహిరంగ మార్కెట్‌లోకి తెచ్చేందుకు జీసీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

మార్కెట్‌లోకి వచ్చే ఉత్పత్తులు

సౌందర్య ఉత్పత్తులలో గిరి నేచర్‌ హనీ బాత్‌సోప్స్‌, అలోవెరా, నీమ్‌, ఆరెంజ్‌, పపాయ బాత్‌సోప్స్‌తో పాటు అలోవెరా శాంపూల వంటి కాస్మొటిక్స్‌,  మొహువా లడ్డూలు, గిరి గారెలు, జొన్న రొట్టెలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి ప్రోటీన్లతో కూడిన ఆహార ఉత్పత్తులతో పాటు స్వచ్ఛమైన పసుపు, కారం వంటి ఉత్పత్తులను మార్కెట్లలోకి తేనున్నారు. 

పొదుపుగ్రూపులకు ప్రాధాన్యత

ఎంఎస్‌ఎంఈ పొదుపు గ్రూపుల ద్వారా మహిళలకు ప్రాధాన్యమిస్తూ 110 మంది ఆదివాసీలతో 11 ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పనున్నారు. గిరిజనులు సేకరించే ముడిపదార్థాలను ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా అత్యంత నాణ్యతతో కూడిన వస్తువులను తయారు చేసేందుకు విరివిగా పరిశ్రమలను స్థాపించడమే కాకుండా వాటిని బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రత్యేక విభాగాలను రంగంలోకి దింపుతున్నారు.


logo