e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home హైదరాబాద్‌ తప్పించుకోలేక చావే శరణ్యమై

తప్పించుకోలేక చావే శరణ్యమై


సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 16(నమస్తే తెలంగాణ): అభంశుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యం చేసి.. హత్య చేసిన ఆ పాపాత్ముడు దిక్కులేని చావు చచ్చాడు. పోలీసుల అష్టదిగ్బంధంతో భయపడిన బాలిక హత్యచార ఘటన నిందితుడు రాజు (30) రైలు కిందపడి ఆత్మహత్మ చేసుకున్నాడు. నిందితుడిని పట్టుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కంటిమీద కునుకు లేకుండా గాలించారు. బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఆటోలు, లారీల అడ్డాలు, మద్యం, కల్లు దుకాణాలు, పుట్‌పాత్‌ అడ్డాల వద్ద నిఘా పెంచారు.

దీంతో రాజుకు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎటు వెళ్లినా.. దొరికిపోతాననే భయం అతడిని వెంటాడింది. రోడ్డు మార్గంలో కుదరకపోవడంతో రైలు పట్టాలపై నడుచుకుంటూ.. వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆ క్రమంలో స్టేషన్‌ ఘనాపూర్‌ వద్ద పొలాల్లో ఉండే రైతులు, రైల్వే గ్యాంగ్‌మెన్‌ల కంట పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. వాళ్లు పట్టుకుంటారనే భయంతో పొదల్లోకి వెళ్లి.. ఇక ఎక్కడకు వెళ్లినా..పట్టుబడటం ఖాయమనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

పచ్చబొట్టు ఆధారంగా నిర్ధారణ..

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిందితుడు రాజు కోసం గాలిస్తుండడంతో తప్పించుకోలేననే మానసిక ఆందోళనకు గురైన రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రాజుకు రెండు చేతులపై తెలుగు, ఇంగ్లిష్‌లో మౌనిక అని పచ్చబొట్టు ఉందని, అతని కుటుంబ సభ్యులు కూడా మృతదేహం రాజుదేనని గుర్తించారని సీపీ వెల్లడించారు.

ఊపిరీ పీల్చుకున్న పోలీసులు

అమానుష ఘటనకు పాల్పడిన నిందితుడు రాజుకు కేరాఫ్‌ అడ్రస్‌ లేదు.. బంధాలు, బంధుత్వాలు సరిగ్గా లేవు. ఉన్మాదిగా మారి ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ ఘటన పోలీసులను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఘటన జరిగిన రోజు రాత్రి 9 గంటల వరకు నిందితుడు అదే ప్రాంతంలో ఉన్నాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. రాజును పట్టుకోవడం కోసం 10వతేదీ నుంచి 16వ తేదీ ఉదయం 9 గంటల వరకు పోలీసులు అణువణువూ గాలించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం రైలు కింద పడి నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు రూ. 20 లక్షల చెక్కు అందజేత

సైదాబాద్‌, సెప్టెంబర్‌ 16: ఆరేండ్ల చిన్నారి బాధిత కుటుంబాన్ని గురువారం ఉదయం హోం మంత్రి మహమూద్‌ అలీ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. ప్రభత్వుం తరుపున రూ.20 లక్షల చెక్కును అందజేసి వారికి భరోసా కల్పించారు. డబుల్‌ బెడ్రూం ఇల్లు, ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఉన్నారు.

రాజు ఇంటిని కూల్చేశారు..

సైదాబాద్‌, సెప్టెంబర్‌ 16: చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి.. హత్య చేసిన రాజు ఇంటిని స్థానికులు గురువారం కూల్చివేశారు. బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డ అతడి గృహం ఉండవద్దంటూ జనం అగ్రహం వ్యక్తం చేస్తూ.. నేలకూల్చారు. కొద్ది నెలల కిందట చారి అనే వ్యక్తి నుంచి నిందితుడు లక్షన్నర రూపాయలకు ఇల్లును కొనుగోలు చేశాడు.

దిక్కులేని చావు చచ్చాడు..

ఆభం శుభం తెలియని చిన్నారిని హత్య చేసిన కిరాతకుడికి తగిన శిక్ష పడింది. తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. దొరికిపోతే శిక్ష తప్పదని భయంతోనే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దిక్కులేని చావు చచ్చాడు. -అలివేలు (సింగరేణికాలనీ)

జనం చేతికి చిక్కి ఉంటే….

నిందితుడు రాజు జనం చేతికి చిక్కి ఉంటే.. శిక్ష మరింతగా ఘోరంగా ఉండేది. ఘోరాలు చేసే వారు జనం మధ్య ఉండొద్దు. తప్పుజేస్తే జనం దండిస్తారని కామాంధులకు తెలిసి రావాలి. ఆలస్యంగానైనా న్యాయం జరిగింది. -సత్యమ్మ( సింగరేణికాలనీ)

పాపం పండింది…

చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కామాంధుడి పాపం పండింది. రాజు గురించి పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగటంతో ప్రజలకు కన్పిస్తే..వదిలి పెట్టరనే భయంతోనే చచ్చిపోయాడు. చావు తప్ప మారో మార్గం దొరక్కపోవటంతోనే బలవంతంగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగింది. సంతోషంగా ఉంది. -ఆండాలు (సింగరేణికాలనీ)

న్యాయం జరిగింది

చిన్నారిపై జరిగిన దారుణాన్ని చూసి ప్రజలందరూ కన్నీరు పెట్టుకున్నారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలని కోరుకున్నారు. ఈ క్రమంలో వాడే రైలు కింద పడి చచ్చిపోయాడు. ప్రజల చేతికి చిక్కితే నరకం తప్పదని గ్రహించి.. అత్మహత్య చేసుకున్నాడు. రాజు చావుతో చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగింది. -తార్యనాయక్‌ (సింగరేణికాలనీ)

ప్రభుత్వం ఎంతో శ్రమించింది..

నిందితుడిని పట్టుకునేందుకు ప్రభుత్వం ఎంతో శ్రమించింది. రాజు గురించి అందరికీ తెలిసిపోవటంతో కామాంధుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యారు. దిక్కు తోచని స్థితిలోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజులకు చిన్నారి కుటంబానికి న్యాయం జరిగింది. – తుకారం (సింగరేణికాలనీ గుడిసెవాసుల సంక్షేమ సంఘం అధ్యక్షులు) ప్రజలంతా గాలించారు..
పోలీసులు, ప్రజలు రాజు కోసం పెద్ద ఎత్తున గాలిస్తుండటంతో ఎక్కడికి వెళ్లలేని స్ధితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజలకు చిక్కి ఉంటే.. శిక్ష మరో విధంగా ఉండేది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తేనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. -మోతీలాల్‌ నాయక్‌ (సేవాలాల్‌ బంజారా సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు)

దేవుడి తీర్పు.. ఎవ్వరూ ఆపలేరు నెటిజన్ల వ్యాఖ్యలు

కిరాతకుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంతో “గణనాథుడే ఆ రాక్షసుడిని మట్టుబెట్టాడు.” అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ.. పోస్టులు పెట్టారు.

ఓదార్పునిచ్చింది..

ఆ దుర్మార్గుడి చావు కాస్త ఊరటనిచ్చింది. చిన్నారి పట్ల కర్కషంగా వ్యవహరించిన ఆ నీచుడు చనిపోయాడన్న వార్త వారి తల్లిదండ్రులకు ఓదార్పునిచ్చింది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరుగకుండా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలి. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – యుగేంధర్‌, నెటిజన్‌

దైవ నిర్ణయం

ఇది దైవ నిర్ణయం. ఎవ్వరూ మార్చలేరు. ఆ కిరాతకుడు మరణించడం ఆ చిన్నారి ఆత్మకు కొంత శాంతి కలిగింది. దేవుడున్నాడనడానికి ఇదే నిదర్శనం. గణనాథుడు ఆ కిరాతకుడిని శిక్షించాడు. నిందితుడు గాలింపులో పోలీసులు, బలగాలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములయ్యారు. మీడియా గొప్ప పాత్ర పోషించింది. – దుర్గా, నెటిజన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement