e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home హైదరాబాద్‌ కోలుకుంటున్నవారు 90% పైనే

కోలుకుంటున్నవారు 90% పైనే

కోలుకుంటున్నవారు 90% పైనే
 • లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి
 • పూర్తిస్థాయి కొవిడ్‌ సెంటర్‌గా కింగ్‌కోఠి జిల్లా దవాఖాన
 • అందుబాటులో 350 పడకలు.. రికవరీ అధికం
 • ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌

సుల్తాన్‌బజార్‌,ఏప్రిల్‌ 28 : కరోనాపై పోరులో సికింద్రాబాద్‌ గాంధీ, గచ్చిబౌలి టిమ్స్‌తోపాటు కింగ్‌కోఠిలోని హైదరాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి విశేష సేవలందిస్తున్నది. స్వల్ప లక్షణాలతోపాటు ఆక్సిజన్‌ అవసరమున్న వారికి ఇక్కడి వైద్యులు, సిబ్బంది చక్కటి వైద్యమందిస్తున్నారు. కరోనా రోగులకు ధైర్యమిస్తూ వారు త్వరగా కోలుకునేలా చేస్తున్నారు. కింగ్‌కోఠి దవాఖానలో మొత్తం 350 పడకలు ఉండగా, ఇందులో 200 ఆక్సిజన్‌ పడకలు, 50 ఐసీయూ, 100 సాధారణ పడకలున్నాయి. కరోనా బారిన పడిన వారి దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్న తరుణంలో ఇక్కడి వైద్యులు నేరుగా రోగుల వద్దకెళ్లి వారి బాగోగులు తెలుసుకొని వైద్యమందిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ 25 వరకు ఆస్పత్రికి 17,551 మంది అవుట్‌ పేషెంట్లు రాగా 1702 మందికి అడ్మిషన్‌ అందించి ప్రత్యేక వైద్యచికిత్స అందిస్తున్నారు. 95 శాతం మంది రికవరై డిశ్చార్జీ అవుతుండగా 103 మంది మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో సేవలు, పడకల లభ్యత, కరోనా రోగుల మనోభవాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌ మాటల్లోనే..

1,59,300 మందికి.. కింగ్‌కోఠి పరిధిలో టీకా తీసుకున్న వారి సంఖ్య

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులు కొవిడ్‌ పరీక్షలు చేస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. కింగ్‌కోఠి ప్రభుత్వ దవాఖాన క్లస్టర్‌ పరిధిలోని 8 ప్రభుత్వ కేంద్రాలు, 8 ప్రైవేట్‌ దవాఖానల్లో మార్చి 1 నుంచి ఇప్పటివరకు 1,59,300 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 45 ఏండ్లకు పైబడిన వారు అత్యధికంగా ముందుకొచ్చి టీకా తీసుకోవడం అభినందనీయమని డాక్టర్‌ పద్మజ పేర్కొన్నారు. అన్ని యూపీహెచ్‌సీలలో ప్రత్యేకంగా కరోనా పరీక్షలు చేపట్టడంతోపాటు అత్యధికంగా పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకించి మొబైల్‌ వాహనాల ద్వారా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తూ మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.

జాగ్రత్తలే మేలు :

 • కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మాస్కు ధరించాలి. అత్యవసరమైతే
 • గాని బయటకు రావొద్దు.
 • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
 • కరోనా నాకేమి రాదన్న అపోహ వీడాలి. ప్రధానంగా జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్‌ చేయించుకోవాలి.
 • ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. గుంపుల్లో తిరగవద్దు. శుభ్రత పాటించాలి. -డాక్టర్‌ జలజ, అదనపు సూపరింటెండెంట్‌

మాట్లాడితే సగం రోగం నయమవుతుంది

 • కరోనా పాజిటివ్‌ రాగానే తనకేమో అయిపోతుందనే భయాన్ని వీడాలి.
 • వారిలో భయాన్ని పోగొట్టేందుకు నిత్యం వార్డుల్లోకెళ్లి మాట్లాడి చికిత్సలు అందిస్తున్నాం.
 • దీంతో వారిలో కరోనా భయం పోయి సాధారణస్థితికి వచ్చి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. -డాక్టర్‌ మల్లికార్జున్‌, కొవిడ్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌

కింగ్‌కోఠి దవాఖానలో సేవలు ఎలా అందుతున్నాయి ?

కరోనా అనుమానితులుగా వచ్చిన వారికి ఓపీలో మూడు విభాగాలుగా ఏర్పాటు చేశాం. మైల్డ్‌,మోడరేట్‌,సివిలియర్‌ మూడు భాగాలుగా విభజించి వైద్యులు పరీక్షించిన అనంతరం వారి లక్షణాల ఆధారంగా సేవలందిస్తున్నాం. రోగి పరిస్థితిని బట్టి ఐసీయూ లేదా ఆక్సిజన్‌ పడక కేటాయించి చికిత్స ప్రారంభిస్తున్నాం. స్వల్ప లక్షణాలున్న వారిని హోం ఐసోలేషన్‌లో ఉండమని మందులిచ్చి పంపిస్తున్నాం.

వ్యాక్సినేషన్‌ ఎలా కొనసాగుతోంది?

దవాఖానలో రెండు విభాగాలు ఏర్పాటు చేసి టీకాలు ఇస్తున్నాం. మొదటి డోస్‌, రెండో డోస్‌ తీసుకునే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వ్యాక్సిన్‌ సమయంలో భౌతికదూరం పాటించేలా చూస్తున్నాం. కరోనా కట్టడికి టీకా తీసుకోవడం ఉత్తమం.

కరోనా నిర్ధారణకు ఏ పరీక్ష మంచిది ?

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ర్యాపిడ్‌తో పోల్చితే ఆర్టీపీఆర్‌ టెస్ట్‌లో పూర్థిస్థాయిలో నిర్ధారణ అవుతుంది. ఏ మాత్రం జలుబు, జ్వరం, దగ్గు వచ్చినా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే ప్రమాదమున్నది.

దవాఖానలో కరోనా రికవరీ శాతం ఎంత ?

90 శాతానికిపైగానే రికవరీ అవుతున్నారు. గతేడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు 42,676 మంది అవుట్‌ పేషెంట్లు రాగా 5121 మంది రోగులను చేర్చుకున్నాం. ఇందులో 90 శాతానికి పైగా ఆరోగ్యం బాగుపడి ఇంటికెళ్లిపోగా, 340 మంది మృత్యువాత పడ్డారు.

దవాఖానలో నిత్యం ఎన్ని లీటర్ల ఆక్సిజన్‌ వాడుతున్నారు?

కింగ్‌కోఠి దవాఖానలో ఆక్సిజన్‌ లెవల్‌ పడిపోయిన వారు అధికంగా వస్తుండడంతో ప్రధానంగా ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నాం. ప్రస్తుతం 8 వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ నిల్వ ఉండగా నిత్యం మూడు వేల లీటర్ల వరకు వాడుతున్నాం. ఐసీయూలో వెంటిలేటర్‌పై 24 మంది చికిత్స
పొందుతున్నారు.

ఎలాంటి లక్షణాలు ఉన్నవారు అధికంగా వస్తున్నారు ?

కరోనా మొదటిదశతో పోల్చుకుంటే రెండోదశలో శ్వాస సమస్యతో బాధపడుతున్న వారే అధికంగా వస్తున్నారు. జ్వరం,దగ్గుతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వారు అధికంగా వస్తుండడంతో వారికి తగిన వైద్య సేవలు అందిస్తున్నాం.

పూర్తిస్థాయి వైద్య సేవలు

కరోనా బారిన పడి సాచురేషన్‌ లెవల్‌ తగ్గి దవాఖానకు వచ్చిన వారికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తున్నాం. మెరుగైన సేవలందిస్తుండడంతో 90 శాతానికి పైగా రికవరీ అయ్యి ఇంటికెళ్లి పోతున్నారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి. విధిగా మాస్కు ధరిస్తూ
భౌతికదూరం పాటించాలి. -డాక్టర్‌ విరజ,ఆర్‌ఎంవో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోలుకుంటున్నవారు 90% పైనే

ట్రెండింగ్‌

Advertisement