e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home హైదరాబాద్‌ కరోనా కట్టడి కట్టుదిట్టం

కరోనా కట్టడి కట్టుదిట్టం

కరోనా కట్టడి కట్టుదిట్టం
  • కొవిడ్‌ నియంత్రణలో ఆదర్శంగా 8వ పోలీస్‌ బెటాలియన్‌
  • మహమ్మారిపై పోరుకు వినూత్న కార్యక్రమాలు
  • సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
  • మేమున్నామంటూ ఉన్నతాధికారులు భరోసా
  • క్యాంపస్‌లో 94 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నది. రోజురోజుకూ కేసులు అధికమవుతున్నాయి. పక్కవారు తుమ్మినా, దగ్గినా వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి. వైరస్‌ బారిన పడిన వారిని కుటుంబ సభ్యులే చేరదీయలేని దయనీయ స్థితి. ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి పలు శాఖల సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారు. ఇందులో పోలీస్‌ శాఖ పోషిస్తున్న పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా కరోనా నియంత్రణలో కొండాపూర్‌ 8వ పోలీస్‌ బెటాలియన్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. కొవిడ్‌ కట్టడికి వినూత్న కార్యక్రమాలను చేపడుతూ క్యాంపస్‌లోని సిబ్బంది తమను తాము కాపాడుకోవడమే కాకుండా ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఏడాది కాలంగా బెటాలియన్‌ ఎలాంటి కార్యక్రమాలను చేపట్టింది? అక్కడి సిబ్బంది మానసిక ఒత్తిడిని అధిగమిస్తున్న తీరుపై ‘నమస్తే తెలంగాణ’ కథనం..

1980లో జంటనగరాల్లో చెలరేగిన మతకలహాలను దృష్టిలో పెట్టుకుని, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రత్యేక పోలీస్‌ పటాలాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దానిని కొండాపూర్‌ 8వ పోలీస్‌ బెటాలియన్‌గా విస్తరించారు. ప్రస్తుతం ఆ బెటాలియన్‌లో 1400 మంది పైచిలుకు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, వీఐపీల భద్రతతో పాటు పర్యాటక, చారిత్రక ప్రాంతాల సంరక్షణ ఈ బెటాలియన్‌ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. అదీగాక కొవిడ్‌ నివారణకు గాంధీ, నేచర్‌క్యూర్‌, గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌తో పాటు ఐసోలేషన్‌, ట్రీట్‌మెంట్‌ సెంటర్ల వద్ద భద్రతను సైతం ఇదే పటాలం పర్యవేక్షిస్తూ కీలక భూమిక పోషిస్తున్నది. పోలీస్‌ శిక్షణ అకాడమీగా సేవలనూ అందిస్తున్నది. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో వైరస్‌ కట్టడిలోనూ ఈ బెటాలియన్‌ విశేష సేవలను అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నది.

కరోనా కట్టడికి అవిశ్రాంతంగా కృషి..

గతేడాది మార్చిలో కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కొండాపూర్‌ బెటాలియన్‌ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు శక్తి వంచన లేకుండా విశ్రమిస్తున్నది. ఓ వైపు శాంతి భద్రతలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే మరోవైపు కరోనా కట్టడి చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నది. అందరూ విధిగా మాస్కులు ధరించేలా బెటాలియన్‌ సిబ్బంది ప్రోత్సహిస్తున్నారు. మాస్కు లు ధరించని వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్కులు అందిస్తూ వైరస్‌ నిర్మూలనలో ప్రత్యేకంగా ‘కరోనా గురించి తెలుసుకో’ నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అంతేకాక లాక్‌డౌన్‌ తర్వాత ఎలా మసులుకోవాలి? ఆరోగ్య పరిరక్షణపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.

ఆచరణలో ముందంజ..

కరోనా నిబంధనలు పాటించాలని చెప్పడమే కాకుండా దానిని బెటాలియన్‌ పరిధిలో తప్పకుండా అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బెటాలియన్‌ పరిధిలో 1400 సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా 3500 నుంచి 4000 మంది వరకు ఉన్నారు. అదేవిధంగా కరోనా వ్యాప్తి చెందిన గతేడాది బెటాలియన్‌లో 500 మంది, ప్రస్తుతం 466 మంది శిక్షణ పొందుతున్నారు. అయితే ఏడాది కాలంలో కేవలం 132 మంది మాత్రమే వైరస్‌ బారిన పడ్డారు. వారు కూడా క్యాంపస్‌ బయట నివాసం ఉంటున్న వారే కావడం గమనార్హం. దీంతో బెటాలియన్‌ ఉన్నతాధికారులు కొవిడ్‌ నిబంధనలను ఎంత పక్కాగా అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మాస్క్‌ లేకుంటే నో ఎంట్రీ..

క్యాంపస్‌లోకి వైరస్‌ చొరబడకుండా బెటాలియన్‌ ఉన్నతాధికారులు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. బెటాలియన్‌ పరిధిలోని సిబ్బందికే కాకుండా వారి కుటుంబ సభ్యులకు సైతం కొవిడ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా వైరస్‌ లక్షణాలు.. దాని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కట్టడి కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై బెటాలియన్‌లోని సిబ్బందికి సవివరంగా వివరించారు. మాస్క్‌ ధరించని వారిని బెటాలియన్‌ లోనికి రానివ్వకుండా ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయనిదే ఎవరినైనా క్యాంపస్‌లోకి అడుగు పెట్టనివ్వడం లేదు. నిత్యావసరాల కోసం బయటికి వెళ్లకుండా హోల్‌సేల్‌ వ్యాపారులతో మాట్లాడుకొని నేరుగా వాటిని క్యాంపస్‌కే తెప్పించుకుంటున్నారు. పూర్తిగా శానిటైజ్‌ చేసిన అనంతరం పంపిణీ చేస్తున్నారు. బెటాలియన్‌ ప్రాంగణంలోని సిబ్బంది క్వార్టర్స్‌ను ఎనిమిది విభాగాలుగా విభజించి క్రమం తప్పకుండా క్లీన్‌ చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించే సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను కూడా కఠినంగానే అమలు చేస్తున్నారు.

అందరి సహకారంతోనే..

డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏడీజీపీ అభిలాష్‌ బిస్త్‌ మార్గదర్శకత్వం, క్యాంపస్‌లోని సిబ్బంది సహకారంతో బెటాలియన్‌లో కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తున్నాం. ఏ ఒక్కరూ వైరస్‌ బారిన పడకుండా చూడటంతో పాటు, దాని వ్యాప్తిని నివారించగలిగాం. కొవిడ్‌ మనకు కొన్ని గుణపాఠాలు నేర్పింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలి. శారీరకంగా, మానసికంగా బలోపేతం కావాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. తప్పక మాస్క్‌ ధరించాలి.- మురళీకృష్ణ, కమాండెంట్‌, 8వ పోలీస్‌ బెటాలియన్‌ కొండాపూర్‌

పర్యావరణ పరిరక్షణకు కృషి

కొండాపూర్‌ 8వ పోలీస్‌ బెటాలియన్‌ సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా బెటాలియన్‌ పరిధిలో పలు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 2020 అక్టోబర్‌ 4న క్యాంపస్‌ను ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా ప్రకటించింది. బెటాలియన్‌ పరిధిలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించింది. అదేవిధంగా ‘హలో డస్ట్‌బిన్‌’ కార్యక్రమాన్ని చేపట్టి చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చర్యలు చేపట్టింది. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నది. హరితహారంతో పాటు ఇటీవల నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమంలోనూ బెటాలియన్‌ సిబ్బంది భాగస్వామ్యం అయ్యారు. సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాల నిర్మూలనపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.

సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..

కొవిడ్‌ నేపథ్యంలో పోలీస్‌ సిబ్బంది తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురి అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోగ్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందించడంతో పాటు ఇప్పటికే క్యాంపస్‌ పరిధిలో ఉన్న సిబ్బందిలో 94 శాతం మందికి వ్యాక్సిన్‌ వేయించారు. బెటాలియన్‌లోని సిబ్బంది, క్యాంపస్‌ బయట ఉండే సిబ్బందిని వేరు చేసి విధులు కేటాయిస్తున్నారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం సిబ్బంది యోగక్షేమాలను పర్యవేక్షిస్తున్నారు. కరోనా బారిన పడినా.. లక్షణాలు కనిపించిన వెంటనే సిబ్బందికి బెటాలియన్‌లోని వైద్యాధికారుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. ఉస్మానియా, నేచర్‌క్యూర్‌, టిమ్స్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో మానసిక ైస్థెర్యాన్ని నింపేందుకు ప్రతి వారం బెటాలియన్‌ కమాండెంట్‌ మురళీకృష్ణ ‘డయల్‌ యువర్‌ కమాండెంట్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యాంపస్‌ పరిధిలోని సిబ్బందికి ప్రతివారం ఆయన ఫోన్‌ చేస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.

Advertisement
కరోనా కట్టడి కట్టుదిట్టం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement