బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Dec 01, 2020 , 08:16:02

76 కిలోల గంజాయి పట్టివేత ముగ్గురు అరెస్ట్‌..

76 కిలోల గంజాయి పట్టివేత ముగ్గురు అరెస్ట్‌..

హైదరాబాద్‌ : పోలీసుల తనిఖీలో 76 కేజీల గంజా యి పట్టుబడింది. విశాఖ సీలేరు నుంచి నగరంలో గంజాయి విక్రయించడానికి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు సరఫరాదారులతోపాటు మరొకరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా జిల్లాకు చెందిన దబ్బికొండ వెంకన్న స్వామి కారు నడుపుతుంటాడు. ఇటీవల కుటుంబంతో కలిసి విశాఖపట్నం సీలేరు ప్రాజెక్ట్‌  చూ డడానికి వెళ్లాడు. అక్కడ ఒడిశాకు చెందిన సంజీవ్‌ కబీరాజ్‌ పరిచయమయ్యాడు. గంజాయి సరఫరా చేసే సీలేరు ప్రాంతానికి చెందిన మంగా  సూ చన మేరకు వారిద్దరు  గంజాయి విక్రయించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో మానేకర్‌ మదన్‌, రమేశ్‌కు విక్రయించడానికి కారులో 76 కేజీల గంజాయి తీసుకొని బయలుదేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట వద్ద తనిఖీల్లో భాగంగా..వారి కారును సోదా చేశారు. గంజాయి దొరకడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే గంజాయిని బుక్‌ చేసుకున్న మానేకర్‌ మదన్‌ను కూడా అదుపులో తీసుకున్నారు.  

7 కిలోల ఆల్ఫాజోలం పట్టివేత

రసాయన ఫ్యాక్టరీల ముసుగులో మత్తు పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్న  ఇద్దరిని మల్కాజిగిరి యూనిట్‌ డీటీఎఫ్‌, ఉప్పల్‌ ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.30లక్షల విలువ చేసే 7 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఈఎస్‌ ప్రదీప్‌రావు, డీటీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌నాయక్‌ కథనం ప్రకారం...గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి మల్లాపూర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఎల్బీనగర్‌, చింతల్‌కుంట ప్రాంతానికి చెందిన మన్నె అంజిరెడ్డి, చౌటుప్పల్‌, పద్మశాలికాలనీకి చెందిన గట్ల సుధాకర్‌ను ఆపి.. తనిఖీ చేయగా కిలో ఆల్ఫాజోలం లభించింది. వారు ఇచ్చిన సమాచారంతో  చెంగిచెర్లలోని ‘ఎస్‌ఆర్‌ కెమికల్‌' ఫ్యాక్టరీలో సోదా చేశారు.  అక్కడ మరో 6 కిలోల ఆల్ఫాజోలం,  ముడి రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 


logo