శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Feb 23, 2021 , 06:09:40

అలుపెరుగని విజేత

అలుపెరుగని విజేత

అరవై ఏండ్లు వస్తే చాలు, ఇక జీవితపు చరమాంకానికి చేరుకున్నామనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడిక హాయిగా విశ్రాంతి తీసుకోమంటూ సమాజం సైతం ప్రోత్సహిస్తుంది. ఒంట్లో సత్తువ ఉన్నా, శరీరానికి పని చెప్పడానికి మనసొప్పదు. విశ్రాంతికీ, నిస్తేజానికి మధ్య ఉన్న సన్నటి పొరని గ్రహించలేని జీవితాలు మనవి. అలాంటి వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు 71 ఏండ్ల డేవిడ్‌ ఫ్రాన్సిస్‌. అథ్లెటిక్స్‌లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. 

 డేవిడ్‌ ఫ్రాన్సిస్‌ వయసు 71. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. 35 ఏండ్ల సర్వీసులో వందలాది మంది విద్యార్థులకు అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. పదవీ విరమణ పొందిన అనంతరం ఆదిలాబాద్‌ నుంచి నగరానికి వచ్చి రహ్మత్‌నగర్‌లో స్థిరపడ్డాడు. ప్రస్తుతం తెలంగాణ రిటైర్డ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అదనపు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు.

ఏడు పదులు దాటినా...

వయసు ఏడు పదులు దాటినా ఒంట్లో సత్తువ ఏ మాత్రం తగ్గలేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొన్న డేవిడ్‌ ఫ్రాన్సిస్‌ 18 పతకాలు సాధించాడు. పదవీ విరమణ అనంతరం అథ్లెటిక్స్‌లో పాల్గొని సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు. మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటూ రాణిస్తూ బంగారు, వెండి పతకాలను కైవసం చేసుకున్నాడు. తాజాగా మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ క్రీడా ప్రాంగణంలో జరిగిన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పాల్గొన్న డేవిడ్‌ ఫ్రాన్సిస్‌ అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. 70 ఏండ్ల క్యాటగిరీలో నిర్వహించిన షాట్‌పుట్‌ పోటీలో బంగారు పతకాన్ని సాధించాడు. లాంగ్‌జంప్‌లో వెండి పతకాన్ని కైవసం చేసుకొని నిర్వాహకుల ప్రశంసలు పొందాడు. ఇలా ఇప్పటి వరకు సుమారు 9 పతకాలు సాధించాడు. గతేడాది గుజరాత్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభచాటిన డేవిడ్‌ మరోసారి ఈఏడాదిలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. వచ్చే నెల 20వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పాల్గొననున్నాడు. 

వయసుతో నిమిత్తం లేకుండా.. 

మాది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌. చిన్నప్పుడు జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌, రన్నింగ్‌, త్రోబాల్‌ పోటీల్లో పాల్గొనేవాడిని. ఉద్యోగంలో చేరిన తర్వాత వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. పలుమార్లు అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాను. మంచి ఆహారపుటలవాట్లు.. ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేకుండా రాణించవచ్చు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకంపై దృష్టి పెడతా. - డేవిడ్‌ ఫ్రాన్సిస్‌, రిటైర్డ్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు

VIDEOS

logo