శనివారం 30 మే 2020
Hyderabad - May 20, 2020 , 23:57:05

లాక్‌డౌన్‌ సడలించగానే గ్రీన్‌ నుంచి ఎల్లోకి...

లాక్‌డౌన్‌ సడలించగానే గ్రీన్‌ నుంచి ఎల్లోకి...

హైదరాబాద్ :  లాక్‌డౌన్‌లో గ్రేటర్‌లో అదుపులో ఉన్న వాయుకాలుష్యం క్రమంగా పెరుగుతున్నది. కేవలం రెండురోజుల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 50శాతం మేర పెరగడం గమనార్హం. లాక్‌డౌన్‌ కొనసాగిన రోజుల్లో గ్రీన్‌ కేటగిరిలో ఉన్న నగరం.. ఇప్పుడు సడలించిన రెండురోజుల్లోనే ఎల్లో కేటగిరిలోకి మారిపోయింది. గ్రీన్‌ కేటగిరి అంటే నగరంలో వాయువుల నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు. ఎల్లో కేటగిరి అంటే మోడరేట్‌గా ఉన్నట్లు. ఈ కేటగిరిలో ఉన్నప్పుడు వాయువులు పీల్చుకుంటే శ్వాసకోశ, ఊపిరితిత్తులు, ఆస్తమా, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బందిపడటానికి అస్కారముంటుంది. మే 18, 20 తేదీల్లో వాయుకాలుష్యం మోతాదు లో గణనీయమైన తేడాలు కనిపించాయి. లాక్‌డౌన్‌ను సడలించి వాహనాల రాకపోకలకు  ప్రభుత్వం అనుమతించిన విష యం తెలిసిందే. పైగా వ్యాపారం, వాణి జ్య కార్యకలాపాలకు సైతం అనుమతించింది. దీంతో నగరంలో జనసంచారం, వాహనాల రద్దీ తీవ్రమైంది. ఫలితంగా వాయు కాలుష్యం సైతం తీవ్రమైనట్లుగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు పేర్కొంటున్నారు.

70శాతానికి పైగా రోడ్డెక్కిన వాహనాలు

గ్రేటర్‌లో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇదివరకు 40లక్షలున్న వాహనాల సంఖ్య తాజాగా 50 లక్షలకు చేరింది. లాక్‌డౌన్‌ సమయంలో కేవ లం 10శాతం వాహనాలే రోడ్డెక్కగా, సడలించడంతో 70శాతానికి పైగా రోడ్డెక్కినట్లుగా తెలుస్తున్నది. నగరంలో ఏ ప్రధాన కూడలిని గమనించినా రెండురోజుల్లోనే భారీ తేడాలు కనిపిస్తున్నాయి. నగరంలో వెలువడుతున్న కాలుష్యంలో ప్రధానభాగం వాహనాలదే. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. 49శాతానికి పైగా కాలుష్యం ఒక్క వాహనాల నుంచే వెలువడుతున్నది. మిగతా ప్రాంతాలతో పోల్చి తే.. వాహనాల రద్దీ తీవ్రంగా ఉండే ప్రాం తాల్లోనే కాలుష్యం అత్యధికంగా నమోదువుతున్నట్లుగా కాలుష్య నమోదు కేంద్రాల ద్వారా తెలుస్తున్నది.


logo