శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Sep 13, 2020 , 02:08:45

స్వచ్ఛందంగా 624 మంది రక్తదానం

 స్వచ్ఛందంగా 624 మంది రక్తదానం

కార్ఖానా పోలీసులు, రెడ్‌ క్రాస్‌, రోటరీ క్లబ్‌ తదితర సంస్థల సంయుక్తాధ్వర్యంలో కేజేఆర్‌ గార్డెన్స్‌లో శనివారం మెగారక్తదాన శిబిరం నిర్వహించారు. స్వచ్ఛందంగా 624 మంది రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన సీపీ అంజనీకుమార్‌.. అన్ని దానాల కన్నారక్తదానం గొప్పదన్నారు.

పోలీసుల సేవలు అభినందనీయం


  • నార్త్‌జోన్‌ పోలీసుల ఆధ్వర్యంలో  మెగా రక్తదాన శిబిరం
  • ప్రారంభించిన సీపీ అంజనీకుమార్‌
  • పాల్గొన్న 624 మంది దాతలు

కంటోన్మెంట్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. నార్త్‌జోన్‌ పరిధిలోని కార్ఖానా పోలీసులు, రెడ్‌క్రాస్‌ స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్‌తో పాటు పలు సంస్థలు సంయుక్తంగా శనివారం  కార్ఖానాలోని కేజేఆర్‌గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన  మెగా రక్తదాన శిబిరాన్ని నార్త్‌జోన్‌ డీసీపీ కళ్మేశ్వర్‌ సింగెన్‌వార్‌తో కలిసి నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌  ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు వారి సేవలకు గుర్తింపుగా సీపీ చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. నార్త్‌జోన్‌ పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్ఖానా సీఐ మధుకర్‌స్వామి నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఇదే స్ఫూర్తితో నగరంలోని  రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలను సీపీ అభినందించారు.

అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలను, పండ్లను పంపిణీ చేశారు. రక్తదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజా సంక్షేమంలో భాగంగా పోలీసులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.ఈ శిబిరంలో సుమారు 624 మంది రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించిన కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ పరావస్తు ముధకర్‌స్వామిని సీపీ అభినందించారు.