మంగళవారం 09 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 04:38:03

తొలిసారిగా నగరంలో 56 అంతస్తుల ఎత్తయిన భవనం

తొలిసారిగా నగరంలో 56 అంతస్తుల ఎత్తయిన భవనం

  • ఐటీ కారిడార్‌లో డైమండ్‌ టవర్స్‌ 
  • జీప్లస్‌ 56 అంతస్తుల్లో నిర్మాణం  
  • గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌లో శ్రీకారం
  • 2 టవర్లు.. 6,95,754 చ.అ. వైశాల్యం 
  •  ప్రభుత్వ పరిశీలనలో అనుమతి ప్రక్రియ 
  • నగరంలో 33 అంతస్తులే ఇప్పటివరకు అత్యధికం

భాగ్యనగరమంటే చార్మినార్‌, గోల్కొండ, ట్యాంక్‌బండ్‌, హైటెక్‌సిటీ.. తాజాగా డైమండ్‌ టవర్స్‌ కూడా చేరనున్నాయి. జీప్లస్‌ 56 అంతస్తుల్లో అతి ఎత్తయిన వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌లో అవుటర్‌ సర్వీసు రోడ్డుకు ఆనుకొని గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌లో డైమండ్‌ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నార్సింగి నుంచి నానక్‌రాంగూడ వచ్చే మార్గంలో 7.64 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.750 కోట్ల వ్యయంతో ఈ ఆకాశ హర్మ్యాలను నిర్మించనున్నారు. ఇప్పటికే ఇక్కడ భూమిని చదును చేసి సెల్లార్‌ కోసం తవ్వకాలు పూర్తి చేశారు. నిర్మాణ అనుమతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా ప్రక్రియ పరిశీలనలో ఉన్నది. నగరంలో ప్రస్తుతం 33 అంతస్తులే అత్యధికం కాగా, డైమండ్‌ టవర్లు పూర్తయితే హైదరాబాద్‌ ఖ్యాతి మరింత ‘ఎత్తు’ ఎదగనుంది.    

సిటీబ్యూరో,జనవరి 27 (నమస్తే తెలంగాణ): మహానగరం అమ్ముల పొదిలో మరో ఆభరణం రానున్నది. ఐటీ కారిడార్‌లో మణిహారంగా నిలిచే ఐకానిక్‌ భవనం రూపుదిద్దుకోనున్నది. ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న హైరైజ్‌ భవనాల ఎత్తు 33 అంతస్తులు మాత్రమే.  తాజాగా ఔటర్‌ రింగు రోడ్డును ఆనుకొని 56 అంతస్తులో డైమండ్‌ టవర్స్‌ నిర్మాణానికి  ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. పేరుకు తగ్గట్టుగానే దాని నిర్మాణం ఆద్యంతం  అద్భుతంగా ఉండేలా నిర్మించేందుకు బిల్డర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. జంట భవనాలుగా ఉండే  ఈ డైమండ్‌ టవర్స్‌ ఎలివేషన్‌ మొత్తం డైమండ్‌ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో  ఈ కట్టడానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉన్నది. 

ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డుకు ఆనుకొని..

గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు సర్వీసు రోడ్డును ఆనుకొని గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో డైమండ్‌ టవర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నార్సింగి నుంచి నానక్‌రాంగూడ వచ్చే మార్గంలో సుమారు 7.64 ఎకరాల్లో రూ. 750 కోట్లతో 5 బేస్‌మెంట్స్‌,  జీ ప్లస్‌ 56 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే  ఇక్కడ భూమిని చదును చేయడంతో పాటు  సెల్లార్‌ కోసం  తవ్వకాలు చేసి ఉంచారు. నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అనుమతి వచ్చిన వెంటనే క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టేందుకు బిల్డర్లు సిద్ధంగా ఉన్నారు.

హైరైజ్‌ బిల్డింగ్‌లకు భలే క్రేజ్‌..

హైరైజ్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ అనేది అన్ని మెట్రో నగరాల్లో ఊపందుకున్నది. హైరైజ్‌ భవనాల్లో ఉండడానికి చాలా మంది ఇష్టపడడానికి కారణం ఉన్న ఏరియాలోనే  ఎత్తులో భవనం నిర్మించి, కింద గ్రౌండ్‌ లెవల్‌లో ఎక్కువగా ఖాళీ స్థలాన్ని వదులుతారు. ఆలోచన విధానంలో వచ్చిన మార్పుతోనే  హైదరాబాద్‌ నగరంలో ఈ భవనాలకు ఆదరణ పెరుగుతున్నదని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బెంగళూరు నగరం కంటే హైదరాబాద్‌లోనే ఆఫీస్‌ స్పేస్‌కు ఎక్కువగా డిమాండు ఉంటున్నదని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తమ నివేదికల్లో వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ కారిడార్‌లో అత్యంత ఎత్తయిన వ్యాపార భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. 

ముంబైలోనే  అత్యధికంగా..

ముంబైలోనే అత్యంత ఎత్తయిన భవనాలు ఎక్కువగా  ఉన్నాయి. వీటిలో వర్లీలోని పాలయిస్‌ రాయల్‌ భవనం ఎత్తు 320 మీటర్లు (88) అంతస్తులు. ఇక  76 అంతస్తులు (285 మీటర్లు) ఉన్న భవనాలు 7 వరకు లోయర్‌ పారెల్‌లోనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రతిపాదనల ప్రకారం.. ముంబైలో 125 అంతస్తుల భవనం జోయస్‌ హౌసింగ్‌లో, 110  అంతస్తులతో  శ్రీపతి గార్డెన్‌ టవర్‌-1,2లు, లోధా ప్రాజెక్టు వాదలా 101 అంతస్తుల నిర్మాణాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.VIDEOS

logo