మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:44:06

మూడేండ్లు బేఫికర్‌

మూడేండ్లు బేఫికర్‌

పదేండ్ల తర్వాత జలకళ సంతరించుకున్న హిమాయత్‌సాగర్‌  

గేట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం .. గరిష్ఠ స్థాయికి చేరువవుతున్న ఉస్మాన్‌ సాగర్‌

నగరవాసులకు పానీ పరేషాన్‌ ఉండదని అధికారుల భరోసా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌కి వరప్రదాయినిలుగా మారిన జంట జలాశయాలకు వరద పోటెత్తుతున్నది. గడిచిన కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లోకి వచ్చి చేరుతున్నది. ఉస్మాన్‌సాగర్‌ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం నాటికి 1771.90 అడుగుల మేరకు చేరింది. ఎగువ నుంచి 833 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక హిమాయత్‌సాగర్‌ గరిష్ఠ స్థాయి నీటి మట్టం (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌) 1763 అడుగులు కాగా 1760 అడుగుల మేరకు చేరింది. 2222 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తున్నది. వరద ఉధృతి సాధారణ స్థాయిలో ఉందని, ఒక్క వర్షం పడితే చాలు ఏ క్షణంలోనైనా హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తివేసే పరిస్థితులు ఉంటాయని జలమండలి అధికారులు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా 2010 సంవత్సరంలో హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తామని.. సరిగ్గా పదేండ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితులు వచ్చాయని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జంట జలాశయాలు నిండటంతో పాతనగర ప్రజల తాగునీటి ఇబ్బందులు తప్పినట్లేనని.. రాబోయే మూడేండ్ల వరకు సమృద్ధిగా నీటి సరఫరా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

హిమాయత్‌ సాగర్‌లో ఎంపీ రంజిత్‌రెడ్డి పూజలు  

బండ్లగూడ: జలకళ సంతరించుకున్న హిమాయత్‌ సాగర్‌ను చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మేయర్‌ మహేందర్‌గౌడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జలాశయం వద్ద ఆయన పూజలు చేశారు. అనంతరం జలమండలి అధికారులతో కలిసి వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడు హిమాయత్‌ సాగర్‌ వద్దకు వచ్చి సేద తీరేవారిమన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో అనేక ఏండ్ల తర్వాత హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారడం సంతోషంగా ఉందన్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ మాట్లాడుతూ హిమాయత్‌సాగర్‌ నిండటంతో భూగర్భ జలాలు పెరగడం ఖాయమన్నారు. ఒకప్పుడు జంట జలాశయాల నుంచే నగరానికి తాగునీరు అందించేవారన్నారు. మేయర్‌ మహేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ హిమాయత్‌ సాగర్‌ జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 

ఉస్మాన్‌సాగర్‌ ప్రత్యేకతలు..

పరీవాహక ప్రాంతం 246 చదరపు మైళ్లు

గరిష్ఠ నీటి మట్టం 1790 అడుగులు  

ప్రస్తుతం 1771.937

చెక్‌ డ్యాం వికారాబాద్‌ సాకరవాగు,

ఎర్రగూడ విలేజ్‌

రెయిన్‌ ఫాల్‌ గేజ్‌ బుల్కాపూర్‌, జువ్వాడ,

ఉస్మాన్‌సాగర్‌

గేట్లు ఎత్తిన సంవత్సరాలు 1981, 1983, 1988,

1989, 1990, 1996,

1998, 2000, 2010 

హిమాయత్‌సాగర్‌

పరీవాహక ప్రాంతం 505 చదరపు మైళ్లు

వాస్తవ సామర్థ్యం 1763.00 అడుగులు

ప్రస్తుత సామర్థ్యం 1760.00 అడుగులు 

ఇన్‌ఫ్లో ఛానెల్‌ వెంకటాపూర్‌ మొయిన్‌

రివర్‌ కోర్సు, దిండి

సుల్తాన్‌పల్లి, అమ్డాపూర్‌

గేట్లు ఎత్తిన సంవత్సరం 1981, 1982, 1983,

1988, 1989, 1990,

1991, 1998,

2001, 2010


logo