ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 04:27:40

దోమలపై దండయాత్ర

దోమలపై దండయాత్ర

మన్సూరాబాద్‌, జనవరి 27: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంటమాలజీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దోమలను లార్వా దశలోనే అంతమొందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. నీటి నిల్వల నుంచి దోమలు వృద్ధిచెందకుండా ఉండేందుకు గానూ చెరువుల శుద్ధికి పూనుకున్నారు. దోమల నివారణలో భాగంగా మన్సూరాబాద్‌ పెద్ద చెరువులో ఎంటమాలజీ సిబ్బంది గత వారం రోజులుగా చేపడుతున్న పనులపై పరిసర కాలనీలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన గుర్రపు డెక్కతో పాటు ఇతర చెట్ల మొక్కలను తొలిగించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. మన్సూరాబాద్‌ పెద్దచెరువు సగం మేర పచ్చగా పర్చుకున్నా.. పిచ్చిమొక్కలతో లార్వా వృద్ధిచెంది దోమలుగా రూపాంతరం చెంది.. కాలనీలపై దండయాత్ర చేస్తున్నాయి. ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారు. ఈ విషయంపై పరిసర కాలనీలవాసులు, చెరువు వద్దకు మార్నింగ్‌ వాకింగ్‌కు వచ్చే వారు ఎంటమాలజీ అధికారులకు ఫిర్యాదు చేశారు.  

చెరువు పరిరక్షణకు వాకర్స్‌ చేయూత..

మన్సూరాబాద్‌ పెద్దచెరువులో పెరుగుతున్న గుర్రపు డెక్కతో పాటు ఇతర వ్యర్థాలను తొలిగించేందుకు ఎంటమాలజీ సిబ్బంది వద్ద కావాల్సిన పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం మార్నింగ్‌ వాకర్స్‌ గుర్తించారు. మార్నింగ్‌ వాకర్‌ అయిన సుధాకర్‌ శర్మతో పాటు మరికొందరు ముందుకు వచ్చి వ్యర్థాల తొలిగింపు కోసం కావాల్సిన నాలుగు దంతాల (వ్యర్థాల తొలిగింపు పరికరాలు)ను ఎంటమాలజీ సిబ్బందికి అందజేశారు.

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన్సూరాబాద్‌ పెద్దచెరువు పరిశుభ్రత కోసం చర్యలు తీసుకుంటున్నాం. దోమలను లార్వా దశలోనే అంతమొందించేలా పనులు చేపడుతున్నాం. చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కతో పాటు ఇతర వ్యర్థాలు, చెట్లను వేగవంతంగా తొలగిస్తున్నాం. మరో వారం రోజుల్లో చెరువును శుద్ధి చేస్తాం. వ్యర్థాల తొలిగింపు కోసం కొందరు మార్నింగ్‌ వాకర్స్‌ నాలుగు దంతాలను సమకూర్చి చెరువు పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. - జనార్దన్‌, ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌

ముందుస్తు చర్యలు అభినందనీయం

దోమల నివారణకు ఎంటమాలజీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం అభినందనీయం. చెరువులోకి ఇప్పటికీ కొన్ని కాలనీల మురుగునీరు చేరుతుంది. దీంతో చెరువులో వ్యర్థాల నిల్వ పెరిగిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. చెరువులోకి వచ్చే మురుగునీటిని అరికట్టినట్లయితే దోమల బెడద ఉండదు. - గంగదాసు కృష్ణారెడ్డి, సహారాస్టేట్స్‌కాలనీ

VIDEOS

logo