ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 04:18:55

ప్రజల రక్షణే ప్రాధాన్యం

ప్రజల రక్షణే ప్రాధాన్యం

బాలానగర్‌, జనవరి 27 : నేర రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ముందడుగు వేస్తోంది. లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నగర ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం విశేషం గా కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టుదలతో నేరాల నియంత్రణకు శ్రీకారం చుట్టింది. నగరంలోని ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లు, బస్‌స్టాండ్లు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ సంకల్పానికి బాలానగర్‌ పోలీసులు చేయూతనందిస్తూ నేరాల నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్నారు. 

కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా సీసీల పరిశీలన 

బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును పోలీస్‌ స్టేషన్‌లో కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాలనీలలో ఏర్పాటు చేసిన సీసీల పనితీరును కాలనీ సం ఘాల కార్యాలయాల్లో పరిశీలించుకోవచ్చు. ఇక ఎల్‌అండ్‌టీ వారు ఏర్పాటు చేసిన సీసీలు సీపీ కార్యాలయంతో పాటు బాలానగర్‌ పీఎస్‌కు అనుసంధానం చేశారు. గతంలో మాదిరిగా నేరస్తులు తాము ఏం చేసినా ఎవరు చూస్తారులే అనుకుంటే తప్పులో ఇరుక్కున్నట్లే. రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాల నుంచి పోకిరీల వెకిలి చేష్టల వరకు సీసీలలో రికార్డు కావడంతో నేరస్తులను సకాలంలో పట్టుకుని కేసులు నమోదు చేయడంతో నేరాలు చాలా వరకు తగ్గు ముఖం పట్టాయని పోలీసులు అంటున్నారు. 

ప్రజలకు భరోసా..

సమాజం రోజు రోజుకు ఎంత అభివృద్ధి చెందుతున్నా అదే స్థాయిలో నేరాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కాలంలో పోలీసులు సీసీలతో కేసులను చేదిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరింత భరోసా కలిగిస్తున్నది. సీసీల నిఘాలో నేరస్తులు వేస్తున్న ఎత్తులు చిత్తు అవుతున్నాయి. ప్రధానంగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, చైన్‌ స్నాచింగ్‌లు, బాలికల పట్ల పోకిరీల వేదింపులు ఇక తెరపడిందని చెప్పవచ్చు. 

పీఎస్‌ పరిధిలో ఏర్పాటైన సీసీలు..

బాలానగర్‌లో పీఎస్‌ పరిధిలో మొత్తం 2685 సీసీ కెమెరాలు ఉండగా కాలనీ సంఘాల సహకారంతో ఏర్పాటు చేసినవి 554. నేను సైతం కార్యక్రమంలో భాగంగా కొందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు ఇండ్ల వద్ద 2131 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా బాలానగర్‌ ప్రధాన రహదారిలో ప్రభుత్వం (ఎల్‌అండ్‌టీ) వారు 54 కెమెరాలను ఏర్పాటు చేశారు. వేంకటేశ్వర కో ఆపరేటివ్‌ సొసైటీలో 8, రంగారెడ్డినగర్‌ పారిశ్రామికవాడలో 27, ఆదర్శనగర్‌లో 8, వినాయక్‌నగర్‌లో 12, ఫిరోజ్‌గూడలో 8, గౌతంనగర్‌లో 8, సాయినగర్‌లో 13, కల్యాణ్‌నగర్‌లో 9 సీసీలు ఉండగా బాలానగర్‌ ప్రధాన రహదారి శోభనబస్‌స్టాఫ్‌ వద్ద రెండువైపుల రెండు కెమెరాలు ఉన్నాయి. ఆనంద్‌భవన్‌ వద్ద మరో రెండు సీసీలు, బీహెచ్‌ఈఎల్‌ ఆర్‌అండ్‌డీ పరిశ్రమ ప్రధాన గేట్‌ ఎదుట రెండు, బీబీఆర్‌ దవాఖాన సమీపంలో రెండు, ఫిరోజ్‌గూడలో ఐదు, భారత్‌ లాడ్జ్‌ వద్ద ఒకటి, మల్హోత్ర షేవింగ్‌ కంపెనీ వద్ద ఒకటి, రాజుకాలనీ రోడ్డు సమీపంలో రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి. 

VIDEOS

logo