బుధవారం 03 మార్చి 2021
Hyderabad - Jan 24, 2021 , 04:42:52

మరో కొత్త రహదారి సిద్ధం

మరో కొత్త రహదారి సిద్ధం

శేరిలింగంపల్లి, జనవరి 23: ఐటీకి తలమానికమైన నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లో మెరుగైన వసతుల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ) ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులను తగ్గించడంతో పాటు ప్రధాన రహదారులను కలుపుతూ కొత్తగా నిర్మించిన రహదారి ప్రారంభానికి సిద్ధమైంది. ఐటీ కారిడార్‌ వేవ్‌రాక్‌ నుంచి నెహ్రూ ఔటర్‌ రింగురోడ్డు జంక్షన్‌ వరకు నూతనంగా మరో రహదారిని నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లోని వేవ్‌రాక్‌ ఐటీ సెజ్‌ సమీపంలో రంగ్‌లాల్‌ కుంటను ఆనుకొని కొత్తగా విశాలంగా ప్రత్యేక హంగులతో నూతనంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఐటీ కారిడార్‌లోని జాతీయ, బహుళ జాతీయ సంస్థల ఉద్యోగులతో పాటు సాధారణ వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నది. వేవ్‌రాక్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌కు రావాలంటే విప్రో సర్కిల్‌ మీదుగా నానక్‌రాంగూడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా టీఎస్‌ఐఐసీ వేసిన ఈ నూతన రహదారితో కేవలం కిలోమీటరు దూరం ప్రయాణంతో సులువుగా, క్షణాల్లో నానక్‌రాంగూడ ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌కు చేరుకోవచ్చు. వేవ్‌రాక్‌ ఐటీ సెజ్‌ నుంచి రంగ్‌లాల్‌ కుంట మీదుగా కేవలం కిలోమీటరు ప్రయాణంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. 

రూ.7 కోట్లతో రహదారి నిర్మాణం

దాదాపు కిలోమీటరు మేరకు నాలుగు లేన్ల(80 అడుగులు) విస్తీర్ణంతో విశాలంగా ఈ రహదారిని నిర్మించారు. రహదారి మధ్యలో రంగ్‌లాల్‌ కుంట ప్రాంతంలో వంతెన నిర్మాణం సైతం చేపట్టారు. రూ. 7కోట్ల వ్యయం వెచ్చించి టీఎస్‌ఐఐసీ దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. కిలోమీటరు మేరకు రహదారికి రూ.4 కోట్లు, వంతెన నిర్మాణానికి రూ.3 కోట్ల వ్యయం వెచ్చించారు. ఎత్తైన బహుళ అంతస్తుల మధ్యలో వేవ్‌రాక్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు సర్వీస్‌ రోడ్డుకు ఈ రహదారిని విశాలంగా తీర్చిదిద్దారు. నూతనంగా తీర్చిదిద్దిన ఈ రహదారి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ అధికారికంగా దీనిని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

VIDEOS

logo