గురువారం 25 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 24, 2021 , 04:34:24

రూ.650 కోట్ల నిధులపై నీలినీడలు

రూ.650 కోట్ల నిధులపై నీలినీడలు

  • స్పష్టత ఇవ్వని కేంద్రం.. సతమతమవుతున్న బోర్డు
  • ఈ నెల చివర్లో ఢిల్లీకి వెళ్లనున్న బోర్డు పాలకమండలి

కంటోన్మెంట్‌, జనవరి 23 : దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్‌ బోర్డుగా ఉన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌పై కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్రం ఆధీనంలో ఉండే బోర్డుకు అన్ని విధాలుగా సహకరించాల్సిన సమయంలో చేతులెత్తేస్తుండటంతో అభివృద్ధిలో పోటీపడలేక చతికలపడుతుంది. బోర్డు పరిధిలోని ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, మిలటరీ స్థావరాలు, కార్యాలయాల నుంచి బోర్డుకు రావాల్సిన సర్వీస్‌ చార్జీలను చెల్లించడం లేదు. సర్వీస్‌ చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి బోర్డుకు సుమారు రూ.600 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. కానీ ఇందులో కనీసం రూ.100 కోట్లు కూడా చెల్లించడంలేదు. దీంతో కేంద్రం ఎదుట బోర్డు సభ్యులు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. బకాయిలు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రం అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం రూ.99 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇవ్వాలని బోర్డు సభ్యులు రెండున్నరేండ్లుగా అడుగుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. బోర్డు యంత్రాంగం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా బకాయిల విడుదలలో మాత్రం కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై పలువురు ఆరోపిస్తున్నారు. 

రాష్ట్ర సర్కారు నిధులతో అభివృద్ధికి అడుగులు.. 

కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా రాష్ట్ర సర్కారు మాత్రం బోర్డుకు దశల వారీగా నిధులను విడుదల చేస్తూ అభివృద్ధికి సహకరిస్తుంది. కంటోన్మెంట్‌లోని ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ (టీపీటీ) నిధులను రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఇప్పటికే రెండు దఫాలలో విడుదల చేసింది. అదేవిధంగా కేంద్రం ఇచ్చే 13,14,15వ ఆర్థిక సంఘం నిధుల్లో బోర్డుకు చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వం ఈ మధ్యనే బోర్డు ఖాతాలో జమచేసింది. జీఎస్టీ, వినోద, వృత్తి పన్నులాంటి ఇతరాత్ర మార్గాల ద్వారా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం రెండు,మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. బోర్డు ఆదాయానికి వేరే మార్గాలు లేవని ఇలాంటి గ్రాంట్లు, సర్వీస్‌ చార్జీల ద్వారానే మనుగడ సాగిస్తుందని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో సమస్యల పరిష్కారానికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి కృషిచేస్తున్నారు. మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో సర్కారు బకాయిలను నెలనెలా రూ.10 కోట్లు చెల్లిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ఇప్పటికే మూడు దఫాలుగా నిధులను బోర్డుకు విడుదల చేసింది. అయితే కేంద్ర బకాయిల విడుదలకు సంబంధించి బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల చివరిలో ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.

బకాయిలపై కేంద్రాన్ని నిలదీస్తాం.. 

కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలపై తప్పక నిలదీస్తాం. కంటోన్మెంట్‌ బోర్డులో నిధులు లేక సతమతమవుతుంటే రాష్ట్ర సర్కారు ఇక్కడ సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా, జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కంటోన్మెంట్‌ ప్రజలకు కూడా అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పికెట్‌నాలా, హస్మత్‌పేట్‌ నాలాలు పొంగి కాలనీలు, బస్తీలను ముంపు బారిన పడకుండా చూస్తున్నాం. రామన్నకుంట చెరువు ప్రక్షాళనకు ప్రత్యేక నిధులు కేటాయించాం. ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపారు. త్వరలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి మరిన్ని నిధులు విడుదల చేయించేందుకు కృషి చేస్తాం. -  మహేశ్వర్‌రెడ్డి, బోర్డు ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్‌


VIDEOS

logo