గురువారం 25 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 24, 2021 , 04:30:24

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన సేవలు

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన సేవలు

గర్భవతులను ఆందోళన పెట్టి అత్యవసరంగా సిజేరియన్‌ చేసి డబ్బు దండుకోవడం ప్రైవేట్‌ దవాఖానల తీరు. కాగా అసలు సిజేరియన్‌ లేకు ండా సహజ ప్రసవం చేయాలన్నది ప్రభుత్వ దృక్ప థం. అందుకు అనుగుణంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం రహ్మత్‌నగర్‌ డివిజన్‌ శ్రీరాంనగర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మహిళలకు సిజేరియన్‌ లేకుండా వైద్య సేవలందుతున్నాయి. ఈ దవాఖానలో జనరల్‌, గైనకాలజీ, పిడియాట్రిక్‌ విభాగాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. సుమారు 500 మంది గర్భవతులకు ప్రత్యేక వైద్య సేవలందిస్తున్న ఈ దవాఖానలో నెలకు సుమారు 5 వేల నుంచి 6 వేల వరకు ఔట్‌ పెషెంట్‌ సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రవేశపెట్టిన మినీ డయాగ్నోస్టిక్‌ హబ్‌ సేవలతో యూసీహెచ్‌సీకి గర్భవతుల నుంచి ఆదరణ మరింత పెరగనుంది.

జూబ్లీహిల్స్‌, జనవరి 23: ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రధానంగా గర్భవతులకు కీలక సమయంలో ఈ కేంద్రాలు అండదండగా నిలుస్తున్నాయి. 7 నెలల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణలో ఉండే  గర్భవతులకు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యంత సంక్లిష్టమైన దశలో అనిర్వచనీయమైన సేవలు అందిస్తున్నారు. రహ్మత్‌నగర్‌ డివిజన్‌ శ్రీరాంనగర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మహిళలకు నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి. ప్రభుత్వం యూసీహెచ్‌సీ దవాఖానల్లో డయాగ్నోస్టిక్‌ హబ్‌లు ఏర్పాటు చేయడంతో ఈ దవాఖానలకు మరింత ఆదరణ పెరగనుంది.

సిజేరియన్‌ అవసరం లేకుండా..    

శ్రీరాంనగర్‌ యూసీహెచ్‌సీ 30 పడకల దవాఖానలో సిజేరియన్‌ చేసే అవసరం లేకుండా ప్రసవాలు చేస్తున్నారు. సిజేరియన్‌ చేయాలంటే అనస్థీషియా డాక్టర్‌తో పాటు ప్రత్యేక థియేటర్‌ ఉండాలి. ఈ దవాఖానలో వీటి ఏర్పాటు లేకుండా సిజేరియన్లు చేయకుండానే వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక కేసులంటే గనుక పెద్ద దవాఖానలకు పంపిస్తున్నారు.

ప్రతినెల 70 సాధారణ ప్రసవాలు..

ఈ దవాఖానలో సుమారు 500 మంది గర్భవతులకు వైద్య సేవలందిస్తాం. గతంలో నెలకు 25 నుంచి 30 ప్రసవాలు మాత్రమే జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో సాధారణ ప్రసవాలే లక్ష్యంగా ప్రతినెల 70 సహజ ప్రసవాలను చేస్తున్నాం. ఇక్కడ అన్ని సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. సిజేరియన్‌ డెలివరీ ఒక్కటి కూడా చేయం. డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు తో గర్భవతులకు అన్ని పరీక్షలు సునాయాసంగా చేసే సౌకర్యం కలిగింది. దీంతో మా దవాఖానపై విశ్వసనీయత, ఆదరణ పెరిగింది. - డాక్టర్‌ రమారాణి, దవాఖాన సూపరింటెండెంట్‌


VIDEOS

logo