ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 23, 2021 , 04:57:37

పాదచారులకు పై వంతెనలు

పాదచారులకు పై వంతెనలు

  • మరో వారంలో ప్రారంభం కానున్న పనులు.
  • హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు 

ఎల్బీనగర్‌, జనవరి 22 : జాతీయ రహదారిపై మూడు అధునాతన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మాణం కానున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గంలో జాతీయ రహదారిపై నిర్మించనున్న ఈ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నారు. పాదచారుల కోసం నిర్మిస్తున్న ఈ పై వంతెనలకు లిఫ్ట్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు మరో వారం రోజుల్లో షురూ కానున్నాయి.

పెరిగిన రద్దీ.. ఇబ్బంది పడుతున్న పాదచారులు

హైదరాబాద్‌, విజయవాడ మార్గంలో జాతీయ రహదారిపై దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌, ఎల్బీనగర్‌ ప్రాంతం వరకు నిత్యం రద్దీ తీవ్రంగా ఉంటుంది. రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. పాదచారుల ఇబ్బందులను తొలగిచేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలోని 28 ప్రాంతాల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో విజయవాడ జాతీయ రహదారిపై దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గంలో మూడు పై వంతెనలను నిర్మించనున్నారు. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఆర్‌ఈ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ మదన్‌ తెలిపారు. 

లిఫ్ట్‌ సౌకర్యంతో..

జాతీయ రహదారిపై మెట్రో రైలు మార్గం కింద 5.5 మీటర్ల ఎత్తులో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మాణం కానున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌, కొత్తపేట చౌరస్తాలో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ వద్ద, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వద్ద పాదచారుల సౌలభ్యం కోసం పుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 1.50 కోట్ల నుంచి రూ. 1.70 కోట్ల వ్యయం అవుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఇండోర్‌స్టేడియం వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ముంబైకి చెందిన ఆర్‌ఈ ఇన్‌ఫ్రా సంస్థ నిర్మిస్తున్నది. బ్రిడ్జిలకు మెట్ల మార్గం, లిఫ్ట్‌ సౌకర్యంతో నిర్మిస్తున్నారు.

అన్ని హంగులతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు

జాతీయ రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాదచారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. కర్మాన్‌ఘాట్‌ ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోనూ మరో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి రానున్నది. - ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

పాదచారులకు మేలు చేసేందుకే

పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం చేస్తున్నాం. జాతీయ రహదారిపై రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు వీలుగా ఈ పై వంతెనలు నిర్మిస్తున్నాం. - ఉపేందర్‌రెడ్డి, జోనల్‌ కమిషనర్‌, ఎల్బీనగర్‌


VIDEOS

logo