మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 19, 2021 , 23:42:41

అరుదైన వ్యాధికి మెరుగైన చికిత్స

అరుదైన వ్యాధికి మెరుగైన చికిత్స

కొండాపూర్‌, జనవరి 19: కణజాలాన్ని ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత (మార్ఫన్‌ సిండ్రోమ్‌ ఆర్టిక్‌ డిసెక్షన్‌)తో బాధపడుతున్న ఓ యువకుడికి మెడికోవర్‌ దవాఖాన వైద్యులు చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ‘సింగిల్‌ స్టేజ్‌ ఫ్రోజెన్‌ ఎలిఫెంట్‌ ట్రంక్‌ టెక్నిక్‌' పద్ధతిలో హైటెక్‌ సిటీలోని మెడికోవర్‌ దవాఖాన వైద్యులు చికిత్స అందించారు. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దవాఖాన వైద్యులు డాక్టర్‌ ప్రమోద్‌ రెడ్డి వెల్లడించారు. నాగ్‌పూర్‌కు చెందిన 20 ఏండ్ల కుర్రాడు కణజాలాన్ని ప్రభావితం చేసే వారసత్వ రుగ్మతతో బాధపడుతు దవాఖానకు వచ్చాడని, ఈ వ్యాధి ఎముకలు, చర్మం, గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, కళ్ళు, నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఈ వ్యాధిని గుర్తించేందుకు ఫ్లోరోస్కోపి, ఐవీయూఎకస్‌ ఇమేజింగ్‌ని వినియోగించి ఫ్రోజెన్‌ ఎలిఫెంట్‌ ట్రంక్‌ ఆర్టిక్‌(బృహద్దమని) అమర్చి రోగి ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. కాగా, ఆర్టిక్‌ డిసెక్షన్‌ అనేది అత్యవసర పరిస్థితని, దీని ద్వారా రక్తనాళాల్లోని లోపలి పొర విడిపోయి, రోగికి తీవ్ర ఛాతి నొప్పి, వెన్నునొప్పి వస్తుందన్నారు. క్రమంగా నొప్పి మెడ, వెన్ను దిగువ భాగానికి చేరి శ్వాస సరిగా అందక మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళేలా చేస్తుందన్నారు. ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుందని, పురుషుల్లో 60 నుంచి 70 ఏండ్ల వయస్సు వారిలో కనిపిస్తుందన్నారు. 


VIDEOS

logo