మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 17, 2021 , 04:11:05

ఆరోగ్యానికి లైవ్‌ చేపలే మేలు

ఆరోగ్యానికి లైవ్‌ చేపలే మేలు

  • కరోనా నేపథ్యంలో ఆహారంపై పెరిగిన శ్రద్ధ
  • ప్రాణంతో ఉన్న చేపలకు ఆర్డర్‌..
  • మక్కువ చూపిస్తున్న మాంసాహార ప్రియులు

మేడ్చల్‌  : కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అని భావిస్తున్నారు. ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్‌లకు ప్రాధాన్యత ఇచ్చే నగర సంస్కృతి తగ్గుతోంది. వీకెండ్స్‌, సెలవు దినాల్లో బయటకు వెళ్లి తినాలన్న కోర్కెలు తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో మాంసాహార ప్రియులు లైవ్‌ చేపలను ఇష్టపడుతున్నారు. అవే ఆరోగ్యానికి మంచిదని, రుచికి పసందు అంటున్నారు. 

వాహనాల్లో విక్రయం..

వినియోగదారులు బతికున్న చేపలు తినడం ఇష్టపడుతున్న నేపథ్యంలో విక్రయదారులు ట్యాంకుల్లో నీటిని నింపి, చేపలు తీసుకొస్తున్నారు. ఇందుకోసం మత్స్యకారులకు ప్రభుత్వం కల్పించిన వాహన సౌకర్యం కలిసి వస్తున్నది.  చనిపోయిన చేపలతో పోలిస్తే బతికున్న చేపలకు కిలో రూ.50 నుంచి రూ.70 అధికంగా ధర పలుకుతుంది. ధర ఎక్కువైనా వినియోగదారులు బతికున్న చేపలనే కొనుగోలు చేస్తున్నారు.  మేడ్చల్‌ పట్టణ శివారు, ఎల్లంపేట చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఆదివారం వాహనాల్లో లైవ్‌ చేపలు లభిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో 15 నుంచి 20 మంది కలిసి, మత్స్యకారులకు ముందస్తుగా డబ్బులు చెల్లించి, లైవ్‌ చేపలను తెప్పించుకుంటున్నారు.  

చేపలు తినడం వల్ల లాభాలెన్నో..

చేపల వినియోగంతో ఎన్నో లాభాలు ఉన్నాయి. మటన్‌, చికెన్‌తో పోలిస్తే సాచ్యూరేటెడ్‌ ఫ్యాట్స్‌ తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెండుగా ఉంటాయి.  ఎక్కువ మంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ లైవ్‌ చేపలను తినడానికి ఇష్టపడుతున్నారని తేలింది. -డాక్టర్‌ రేచర్ల శ్రీకాంత్‌, ఎండీ, సాన్వికా వైద్యశాల, మేడ్చల్‌.

 చేపలను ఇష్టపడుతున్నారు 

ఈ మధ్య కాలంలో 90 శాతం మంది బతికున్న చేపలు ఇష్టపడుతున్నారు. గ్రామంలో కొంత మంది సిండికేట్‌గా మారి ఆర్డర్‌ ఇస్తున్నారు.  నెలలో రెండు, మూడు సార్లు ఇలా ఆర్డర్‌ ఇచ్చి, తెప్పించుకుంటున్నారు. - ఆకుల శేఖర్‌ ముదిరాజ్‌, ప్రధాన కార్యదర్శి, మత్స్య సహకార సంఘం, గౌడవెల్లి.

 లైవ్‌ చేపలను తింటున్నాం..

కరోనాకు ముందు చేపలను ఎక్కువగా తినేవాళ్లం కాదు. ఆరోగ్యానికి మంచిదని తెలుసుకొని, చేపలను కొనుగోలు చేస్తున్నాం. చనిపోయిన చేపలు తినడానికి ఇష్ట పడడం లేదు. రుచికి, ఆరోగ్యానికి లైవ్‌ చేపలు మంచివని వాటినే తీసుకుంటున్నాం.  -మాలే స్వామి, మేడ్చల్‌. కొనుగోలు దారుడు.

VIDEOS

logo