గులాబీమయమైన సికింద్రాబాద్ నియోజకవర్గం

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం గులాబీమయమైంది. మంత్రి కేటీఆర్ రోడ్‌షోకు నియోజకవర్గంలో అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్మండి, బౌద్ధనగర్ ప్రాంతాలనుంచి గులాబీ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా వేలాదిగా జనాలు తరలివచ్చారు. గ్రేటర్లో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో జరుపబోయే అభివృద్ధిని, ప్రజలను మాయచేయడానికి వస్తున్న కొన్ని పార్టీల గురించి కేటీఆర్ ప్రసంగాన్ని జనాలు ఎంతో ఆసక్తితో విన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు మతాలు, ప్రాంతాలుగా విభజించి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంటాయని చెప్పగానే జై తెలంగాణ అంటు జనాల నుంచి పెద్దఎత్తున నినాదాలు వినిపించాయి. మీరు చెప్పింది నమ్మడానికి ఇది అహ్మదాబాద్ కాదు హమారా హైదరాబాద్ అనగానే ఈలలు, చప్పట్లు మార్మోగాయి.
ఏ జోష్ కో ఔర్ దో తీన్ దిన్తక్ రకో అంటూ కేటీఆర్ చలోక్తులు విసిరారు. శాంతినగర్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగా మధ్యలో కొందరు యువకులు ఈలలు వేస్తుండగా ఏ క్యారే బాయ్.. పరేషాన్ కర్రే.. కొంత దూరంలో పటాకులు కాల్చుతున్న శబ్దం రావడంతో అరే వాడు మనోడు కాదేమో.. పటాకులపై నీళ్లు పోయిండ్రి అంటూ నవ్వుతూ అన్నారు. ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటుండగా ఇదేందిరా బై... ఏంది నీ పరేషాని... మన పోరగాండ్లు ఇట్ల తయారైండ్రు అన్నారు. దీంతో పిల్లలు, పెద్దలు, యువకులు కేరింతలు కొట్టారు. అరే కహాసే లాయేరే తుమారేకో అంటూ నవ్వుతూ మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడుతూ ప్రసంగాన్ని కొనసాగించారు.
తెలంగాణకు అడ్డ సికింద్రాబాద్ గడ్డ అంటూ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సికింద్రాబాద్ తెలంగాణకు అడ్డాగానే ఉంటుందని తెలిపారు. భారీ వర్షాలు కురిసి వరదలు వస్తే మీరంతా నిద్రపొండి... వరదలకు నేను కాపలాగా ఉంటానని అర్దరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా ప్రజలకు అండగా నిలిచాన్నారు. సికింద్రాబాద్‌లో ఇతర పార్టీలకు చెందిన వారు వస్తుంటారు, ఎన్నికల్లో అపజయంపాలై బాధతో వెళుతుంటారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలకు అండగా ఉండడానికి సైనికుల్లా పంపారన్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాక బడా నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు వస్తున్నారు. కాని ప్రజలు మాత్రం మమ్మల్నే నమ్ముకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీలకు తెలంగాణ దెబ్బేంటో మరోసారి చూపించాలన్నారు. మరోసారి మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అలరించిన కళా బృందం...
కేటీఆర్ రోడ్‌షోను తిలకించడానికి జనాలు వేలసంఖ్యలో వచ్చారు. కేటీఆర్ షోకు రావడం ఆలస్యం అవుతుండడంతో కళా బృందం ఆటపాటలతో అలరించారు. తెలంగాణ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ టీఆర్ఎస్ మహిళా నేతలు చిందులు వేశారు. తార్నాక డివిజన్‌కు చెందిన మహిళా నేతలు సంగీతానికి అనుగుణంగా డాన్స్ చేశారు. మంత్రి రావడం ఆలస్యం అవుతున్నా కూడా ఏమాత్రం నీరసపడకుండా మహిళల డాన్స్‌ను తిలకించారు. లయబద్దంగా మహిళలు ఎంతో సంబురంగా డాన్స్ చేస్తూ చూపరుల్లో జోష్‌ను నింపారు. బతుకమ్మ, గ్రామీణ పాటలకు లయబద్దంగా చేసిన నృత్యం ఎంతో ఆకట్టుకుంది.