ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Nov 27, 2020 , 08:48:36

నగర అభివృద్ధే గెలుపు పునాదులు

నగర అభివృద్ధే గెలుపు పునాదులు

మన్సూరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నగరంలో కనీవినీరీతిలో జరిగిన అభివృద్ధే టీఆర్‌ఎస్‌ అభ్యర్థలను భారీ మెజార్టీతో గెలిపించబోతుందని ఎంఆర్డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధి వీరన్నగుట్టకాలనీలో గురువారం ఉదయం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ఆయన మార్నింగ్‌ వాక్‌ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల విఠల్‌రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వీరన్నగుట్ట రూపురేఖలు మార్చిన తెలంగాణ ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్బీనగర్‌లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు రూ.448 కోట్లతో అండర్‌పాస్‌ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించి, అందులో కొన్ని ప్రారంభించుకున్నామన్నారు. మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ నగరంలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారం ఉందని, అలాంటప్పుడు నగరాభివృద్ధికి సహకరించవచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా బీజేపీ వ్యవహరించాలని, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే, వారే అందులో మాడిమసై పోతారన్నారు.

ఆపద సమయంలో ఆదుకున్నాం..

వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచి వారిని ఆదుకున్నామని మన్సూరాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల విఠల్‌రెడ్డి తెలిపారు. కరోనా, వరదల లాంటి ఆపద సమయంలో ప్రజల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్షాలు, ఎన్నికలు రాగానే, ప్రజల చెంతకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాయని, వారి నిజ స్వరూపాలు ప్రజలకు తెలుసునని తెలిపారు. ఐదేండ్ల కాలంలో మన్సూరాబాద్‌ డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, మరోసారి తనకే పట్టం కడతామని ప్రజలు తనకు భరోసా ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మహిళా అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, మాజీ అధ్యక్షులు చుక్కమెట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొసనం వెంకట్‌రెడ్డి, పోచబోయిన జగదీశ్‌యాదవ్‌, నాయకులు రఘువీర్‌రెడ్డి, రమణారెడ్డి, కేకేఎల్‌ గౌడ్‌, రాంచంద్రారెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.