బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 25, 2020 , 01:40:55

నేడే శుభముహూర్తం

నేడే శుభముహూర్తం

 • కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌
 • జూబ్లీహిల్స్‌ రోడ్‌నం.45 ఫ్లైఓవర్‌ సైతం..
 • పర్యాటకుల మనసు కట్టిపడేస్తున్న ‘దుర్గం’ వారధి
 • భాగ్యనగరానికి మరో మణిహారంగా నిలువనున్న కట్టడం

నగరవాసులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నశుభతరుణం రానే వచ్చింది. ఎన్నెన్నో ప్రత్యేకతలతో అద్భుతంగా, సుందరంగా  నిర్మించిన ‘దుర్గం’ తీగల వంతెనను నేడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.దీనికి అనుసంధానంగా నిర్మించిన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 ఫ్లై ఓవర్‌నూ ప్రారంభిస్తారు. చుట్టూ పచ్చదనం.. నీటి గలగలలు.. ఎల్లలు లేని గాలి సవ్వడులు.. మిరుమిట్లు గొలిపే వెలుగుల తోరణాలు.. హృదయానికి హత్తుకునే ప్రకృతి అందాలతో విశ్వనగర ప్రగతికి చిహ్నంగా.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న కేబుల్‌ బ్రిడ్జిని రూ.184 కోట్ల వ్యయం, 735.639 మీటర్ల పొడవుతో నిర్మించారు.చారిత్రక నగరానికి ఆధునిక మణిహారంగా, మరో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఇది విరాజిల్లనున్నది.

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ/కొండాపూర్‌: పర్యాటక రంగానికి వన్నె తెచ్చేలా...ఐటీ కారిడార్‌కు ప్రత్యేక శోభనిస్తూ... ప్రయాణికుల ఇక్కట్లను తొలిగించేలా  మాదాపూర్‌లోని దుర్గం చెరువుపై దేశంలోనే మొదటి సారిగా నూతన టెక్నాలజీతో నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జితో పాటు దీనికి అనుబంధంగా నిర్మించిన రోడ్‌ నంబర్‌-45 దుర్గం చెరువు ఫ్లైఓవర్‌ను పురపాలక, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించను న్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ కలయికతో ప్రత్యేకంగా నిర్మించిన ఈ వంతెన దేశంలోనే మొదటిగా నిలువనుంది. కేబుల్‌ బ్రిడ్జి ఆరు లేన్లు కాగా, ఫ్లైఓవర్‌ నాలుగు లేన్లతో డిజైన్‌చేశారు. వంతెనపై ఇరువైపులా సైక్లిస్ట్‌లు, పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లను ఏర్పా టు చేశారు. 

   దుర్గం చెరువులో వంతెనతో పాటుగా పర్యాటకులను ఆకట్టుకునేలా బోటింగ్‌, రెస్టారెంట్లు, ఓపెన్‌ థియేటర్లు తదితర సౌకర్యాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత ఆధునిక లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. శని, ఆది వారాల్లో ఈ బ్రిడ్జీపైకి వాహనాలను అనుమతించకుండా, కేవలం పాదచారులను, పర్యాటకులను మాత్రమే అనుమతించాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు.

కేబుల్‌ బ్రిడ్జి ప్రయోజనాలు..

 • నగరంలోని ఇతర ప్రాంతాలతో హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు కనెక్టివిటీ.
 • రోడ్‌ నంబర్‌-36, మాదాపూర్‌ రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది.
 • జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌స్పేస్‌, గచ్చిబౌలి ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ప్రయాణదూరం రెండు కిలోమీటర్లమేర తగ్గుతుంది.
 • దేశంలోనే ముఖ్య పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది.

రోడ్‌ నం-45 ఫ్లైఓవర్‌ ప్రయోజనాలు...

 • రోడ్‌ నం-45నుంచి మైండ్‌స్పేస్‌ జంక్షన్‌కు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జీమీదుగా  నేరుగా వెళ్లేందుకు వీలు కలుగుతుంది.
 • హైటెక్‌సిటీ, మైండ్‌స్పేస్‌, గచ్చిబౌలి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది.
 • ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-36, మాదాపూర్‌ రోడ్‌పై ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. 
 • కేబుల్‌ బ్రిడ్జితో కలుపుకొని ఈ ఫ్లైఓవర్‌ మొత్తం పొడవు 2.7కిలోమీటర్లు కాగా, ఈ రెండింటి నిర్మాణంతో రోడ్‌ నంబర్‌-45జంక్షన్‌ నుంచి మీనాక్షీటవర్స్‌, గచ్చిబౌలి వరకు సుమారు 6 కిలోమీటర్లమేర ట్రాఫిక్‌ ఇబ్బందులు లేని కారిడార్‌గా తయారవుతుంది.
 • పంజాగుట్ట-నానాక్‌రామ్‌గూడ కారిడార్‌లో, అంటే ఇన్నర్‌ రింగురోడ్డు నుంచి ఔటర్‌ రింగురోడ్డును కలిపే ప్రధాన మార్గంగా ఉంటుంది.


logo