సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 10, 2020 , 00:27:59

ఆకుపచ్చని మీడియన్‌లు..విశాలమైన రోడ్లు

ఆకుపచ్చని మీడియన్‌లు..విశాలమైన రోడ్లు

ఆకుపచ్చటి మీడియన్‌లు.. విశాలమైన రోడ్లతో నగరానికి కొత్త కళ తీసుకురావాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు.భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రోడ్ల ఏర్పాటుకు మైక్రో ప్లానింగ్‌ రూపొందించాలని ఆదేశించారు. రోడ్లతో పాటు టాయిలెట్లు, బస్‌బేలు, జంక్షన్లు తదితర వివరాలన్నీ అందులోపొందుపర్చాలన్నారు. నెలలోపు నివేదిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు. గ్రేటర్‌లో రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై మంత్రి గురువారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ భవిష్యత్‌ అవసరాలు, మాస్టర్‌ప్లాన్‌ను దృష్టిలో పెట్టుకుని రోడ్ల అభివృద్ధి, విస్తరణపై సమగ్ర నివేదిక తయారుచేయాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. రహదారులతోపాటు, టాయిలెట్లు, బస్‌బేలు, జంక్షన్లు తదితర అంశాలను పొందుపరుస్తూ నెలరోజుల్లో మైక్రోప్లానింగ్‌ నివేదిక రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ పరిధిలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను నాలుగు జోన్లుగా విభజించి మైక్రో ప్లానింగ్‌ నివేదిక తయారు చేయాలని చెప్పారు. రోడ్డు నిర్మాణ కన్సల్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ నెలరోజుల్లోగా సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి వంద అడుగుల రోడ్డు మధ్యలో తప్పనిసరిగా డివైడర్లు ఏర్పాటుచేసి అందులో పచ్చదనం పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రిడ్‌రోడ్లు, రేడియల్‌, మిస్సింగ్‌/ లింక్‌ రోడ్ల నిర్మాణం పురోగతిపై కూడా మంత్రి సమీక్షించారు. ఎస్సార్డీపీ, హెచ్చార్డీసీఎల్‌, సీఆర్‌ఎంపీ తదితర రోడ్ల పనులు ఆయా జోన్ల పరిధిలోనే కొనసాగుతున్నందున జోనల్‌ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

నెలాఖరుకల్లా లింక్‌రోడ్ల నిర్మాణం

మొదటి దశలో చేపట్టిన 23 లింక్‌ రోడ్ల నిర్మాణం ఈ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశముందని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లనిర్వహణకు సంబంధించిన కాంప్రహెన్సివ్‌రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్లాన్‌ (సీఆర్‌ఎంపీ) కూడా సత్ఫలితాలిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో 50శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ రోడ్లకు సంబంధించిన ఫిర్యాదులు పెద్దగా రాలేదని చెప్పారు. ప్రస్తుతం సీఆర్‌ఎంపీ మొదటి దశ రోడ్ల పనులు దాదాపు పూర్తయ్యాయని, ఫుత్‌పాత్‌లు, మీడియన్లు, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టిసారిస్తామని మంత్రికి తెలిపారు. ఎస్సార్డీపీ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే మరిన్ని పనులు పూర్తిచేస్తామన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.logo