శుక్రవారం 07 ఆగస్టు 2020
Hyderabad - Jul 09, 2020 , 23:47:37

ఆపకుండా.. మలుపులు లేకుండా..

ఆపకుండా.. మలుపులు లేకుండా..

ఇందిరాపార్కు-వీఎస్టీ మార్గంలో మలుపులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోనున్నది. నాలుగు లేన్ల బై-డైరెక్షనల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సర్వే, సాయిల్‌ టెస్ట్‌ పూర్తికావడంతో ఈ నెల 11న బ్రిడ్జి  నిర్మాణానికి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. రెండు లెవల్స్‌లో నిర్మించనున్న స్టీల్‌ బ్రిడ్జితో ఇందిరాపార్కు-వీఎస్టీ, రాంనగర్‌-బాగ్‌లింగంపల్లి మార్గాల్లో ప్రయాణం మరింత సులువు కానున్నది.

గత కొంతకాలంగా ప్రతిపాదన దశలో ఉన్న ఇందిరాపార్కు-వీఎస్టీ నాలుగు లేన్ల బై-డైరెక్షనల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌(స్టీల్‌ బ్రిడ్డి) నిర్మాణానికి మోక్షం లభించింది. నేల పరీక్షలు, సర్వే పనులు పూర్తికావడంతో ఇక నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.  ఈ నెల 11న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రెండు లెవల్స్‌లో నిర్మించనున్న ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌తో ఇందిరా     పార్కు-వీఎస్టీ, రాంనగర్‌-బాగ్‌లింగంపల్లి మార్గాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా ప్రయాణం సాగించే వీలు కలుగుతుంది. వీటి నిర్మాణానికి రూ.426 కోట్లు కేటాయించగా 24 నెలల్లో వాహనదారులకు అందుబాటులోకి రానున్నాయి. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇందిరాపార్కు-వీఎస్టీ మార్గం ఇరుకుగా ఉండటమే కాకుండా పలుచోట్ల క్రాసింగ్‌లు కూడా ఉన్నాయి. దీంతో మాటిమాటికీ వాహనాలు ఆపుతూ వెళ్లాల్సి వస్తుంది. రద్దీ వేళల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అలాగే రాంనగర్‌ నుంచి బాగ్‌ లింగంపల్లికి వెళ్లే మార్గంలో సైతం క్రాసింగ్‌ల వద్ద వాహనాలు ఆపాల్సి వస్తుంది. దూరం తక్కువే అయినా రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ వల్ల ప్రయాణ సమయం అధికంగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఇందిరా పార్కు-వీఎస్టీ, రాంనగర్‌-బాగ్‌లింగంపల్లి మార్గాల్లో ఎలివేటెడ్‌ కారిడార్‌లను నిర్మించాలని నిర్ణయించింది. రెండు లెవల్స్‌లో నిర్మించే ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌లో మొదటి లెవల్‌ను రూ.350కోట్ల వ్యయంతో ఇందిరాపార్కు-వీఎస్టీ వరకు, రెండో లెవల్‌లో రూ.76కోట్లతో రాంనగర్‌-బాగ్‌లింగంపల్లి వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఇందిరాపార్కు-వీఎస్టీ ఫ్లైఓవర్‌ మెట్రోరైలు కారిడార్‌ పైనుంచి వెళ్లి వీఎస్టీ వద్ద ల్యాండ్‌ అవుతుండగా, రాంనగర్‌-బాగ్‌లింగంపల్లి ఫ్లైఓవర్‌ వీఎస్టీ వద్ద ప్రతిపాదిత ఇందిరాపార్కు-వీఎస్టీ ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్లి బాగ్‌లింగంపల్లి వద్ద ల్యాండ్‌ అవుతుంది. అయితే 24నెలల్లో నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. 

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుంది 

ఇందిరాపార్కు-వీఎస్టీ మార్గంలో ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. ఈ మార్గంలో ఫ్లైఓవర్‌ నిర్మించాలనే ప్రతిపాదన ఎంతోకాలంగా ఉన్నప్పటికీ గత పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంవల్ల ఆచరణకు నోచుకోలేదు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షల ప్రకారం ప్రధాన రోడ్లను సిగ్నల్‌ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ మార్గంలో స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించాలని నిర్ణయించాం. 24నెలల్లో పనులు పూర్తిచేసి వాహనదారులకు అందుబాటులోకి తెస్తాం. -బొంతు రామ్మోహన్‌, మేయర్‌, జీహెచ్‌ఎంసీ 

స్టీల్‌ బ్రిడ్జి ఎందుకంటే..?

ఈ మార్గాలు అత్యంత ట్రాఫిక్‌ రద్దీతో కూడుకున్నవి కావడంతో మామూలు ఫ్లైఓవర్‌ నిర్మించే క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్టీల్‌ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. దీనికి కేవలం పిల్లర్ల పునాదులు, అప్రోచ్‌లు మినహా మిగిలిన పనులన్నీ స్టీల్‌తోనే నిర్మిస్తారు. పిల్లర్లు, దూలాలు తదితర అన్నీ బయట తయారు చేయించి తీసుకువచ్చి ఇక్కడ బిగిస్తారు. అంతేకాకుండా భూసేకరణ అంతగా అవసరం ఉండదు.

మెట్రో కారిడార్‌ పైనుంచి ఫ్లైఓవర్‌

ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మిస్తున్న మొదటి లెవల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.350కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా. ఇది ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద మెట్రో కారిడార్‌ పైనుంచి వెళ్తూ.. వీఎస్టీ వద్ద ల్యాండ్‌ అవుతుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద మెట్రోరైలు కారిడార్‌ పైనుంచి వెళ్తుంది కాబట్టి, ఒకవేళ మామూలు ఫ్లైఓవర్‌ నిర్మించినా మెట్రో క్రాసింగ్‌ వద్ద మాత్రం స్టీల్‌ బ్రిడ్జియే నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ మార్గంలో స్టీల్‌ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు.

గ్రేడ్‌ సెపరేటర్‌ విశేషాలు..రెండవ దశలో..

 • మొదటి లెవల్‌ ఫ్లైఓవర్‌ఇందిరాపార్కు- వీఎస్‌టీ వయా ఎన్టీఆర్‌ స్టేడియం, అశోక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, వీఎస్టీ, ఆజామాబాద్‌
 • 2.620 కిలోమీటర్ల పొడవు
 • 16.60మీటర్ల వెడల్పు.నాలుగు లేన్ల బై-డైరెక్షనల్‌ 
 • వ్యయం రూ.350కోట్లు
 • అప్రోచ్‌లు ఆర్‌ఈ వాల్‌సిమెంట్‌తో నిర్మాణం. మిగిలినఫ్లైఓవర్‌ పిల్లర్లు, దూలాలు తదితర అంతా  స్టీల్‌తోనే నిర్మాణం 
 • ఇందిరాపార్కు వద్ద అప్‌ అండ్‌ డౌన్‌ ర్యాంపు
 • వీఎస్టీకి ముందు అప్‌ ర్యాంప్‌,వీఎస్టీ దాటిన తరువాత డౌన్‌ ర్యాంప్‌
 • వాహనాల వేగం 40కి.మీ.లు
 • లక్ష్యం.. 24నెలల్లో పూర్తి.

ప్రయోజనాలు..

 • ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు గల మార్గంలో ఇరుకు రోడ్డు నుంచి ఉపశమనం. ట్రాఫిక్‌ ఇబ్బందులు పరిష్కారమయ్యే అవకాశం.
 • ఇందిరాపార్కు వైపునుంచి హిందీ మహావిద్యాలయ, ఉస్మానియా యూనివర్శిటీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా వెళ్లే వీలు కలుగుతుంది.
 • ప్రధానంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుంది.
 • ఇందిరాపార్కు క్రాస్‌రోడ్‌, అశోక్‌నగర్‌ క్రాస్‌రోడ్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, బాగ్‌లింగంపల్లి జంక్షన్‌ తదితర చోట్ల క్రాసింగ్‌ల సమస్య ఉండదు కాబట్టి వాహనాలు ఎటువంటి అంతరాయం లేకుండా ఫ్లైఓవర్‌ మీదుగా సాఫీగా వెళ్లే ఆస్కారం కలుగుతుంది.

రెండవ దశలో..

 • రాంనగర్‌-బాగ్‌లింగంపల్లి వయా వీఎస్టీ(ఆజామాబాద్‌)
 • 0.850కి.మీ.ల పొడవు
 • 13.60మీటర్ల వెడల్పు, బై-డైరెక్షనల్‌ ఫ్లైఓవర్‌
 • వ్యయం రూ.76.00కోట్లు
 • అప్రోచ్‌లు ఆర్‌ఈ వాల్‌ సిమెంట్‌తో నిర్మాణం. మిగిలిన ఫ్లైఓవర్‌ పిల్లర్లు, దూలాలు తదితర అంతా స్టీల్‌తోనే నిర్మాణం.
 • రామ్‌నగర్‌లో అప్‌, డౌన్‌ ర్యాంప్‌
 • ఆర్టీసీ కల్యాణ మండపం వద్ద అప్‌, డౌన్‌ ర్యాంప్‌
 • ఫ్లైఓవర్‌పై వేగం 30కి.మీ.లు
 • 24నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉపయోగాలు..

 • రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లికి వెళ్లే మార్గంలో అంతరాయం లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లే వీలు కలుగుతుంది.
 • ట్రాఫిక్‌ రద్దీ ఉండనందున ప్రయాణ సమయం తగ్గుతుంది.
 • బాగ్‌లింగంపల్లి-వీఎస్‌టీ మార్గంలో ఎటువంటి క్రాసింగ్‌లు లేకుండా సాఫీగా వెళ్లే ఆస్కారం కలుగుతుంది.


logo