శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Jul 09, 2020 , 23:35:32

భక్తి శ్రద్ధలతో గోల్కొండ బోనం ఐదో పూజ

భక్తి శ్రద్ధలతో గోల్కొండ బోనం ఐదో పూజ

మెహిదీపట్నం, జూలై 9: గోల్కొండ కోటపై ఆషాఢ మాసం బోనాల ఐదో పూజ గురువారం వేడుకగా జరిగింది. అమ్మవారి ఆలయంలో గురువారం చండీహోమం నిర్వహించారు. ఆలయ ఈవో ఎస్‌.మహేందర్‌కుమార్‌, కులవృత్తుల సంఘం అధ్యక్షుడు సాయిబాబాచారి నేతృత్వంలో పూజారి సర్వేశ్వర్‌చారి అమ్మవారికి బోనం సమర్పించారు. కులవృత్తుల సంఘం నాయకులు శివశంకర్‌, నర్సింగ్‌రావు, శ్రావణ్‌, మహేందర్‌, అశోక్‌ పాల్గొన్నారు. జగదాంబిక ఎల్లమ్మ ఆలయం పక్కనే మహంకాళి ఆలయంలో పూజారి సాయిబాబాచారి అర్చనలు నిర్వహించారు. గోల్కొండ కోటలోకి ఎవరూ రాకుండా ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. 

31 వరకూ కోట బంద్‌

సోమవారం నుంచి గోల్కొండ కోట సందర్శనకు అనుమతి ఇచ్చినా.. ప్రజల నుంచి స్పందన లేకపోవడం, కరోనా కేసులు  పెరుగుతుండటంతో బుధవారం నుంచి కోటను మూసివేశారు పురావస్తు శాఖ అధికారులు. జూలై 31 వరకు గోల్కొండ కోటను బంద్‌ చేస్తున్నట్లు  కోట పర్యవేక్షణాధికారి నవీన్‌ తెలిపారు.   

నేటి నుంచి శత చండీ మహాయాగం

చార్మినార్‌: ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా మీరాలం మండీ మహంకాళేశ్వర దేవాలయంలో గురువారం మహాపూర్ణాహుతి భక్తిశ్రద్ధలతో జరిగింది. శతరుద్ర సహిత ద్విశత మహాచండీ యాగంలో భాగంగా 9రోజుల పాటు కొనసాగిన శతరుద్ర మహాయాగం గురువారం పరిపూర్ణంగా ముగిసింది. శుక్రవారం నుంచి శతచండీ మహాయాగం ప్రారంభమై 18వ తేదీన పరిసమాప్తం కానున్నదని దేవాలయ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి నేటి నుంచి బోనాలు సమర్పించనున్నారన్నారు. 20న అమ్మవారి ఘటపరి సమాప్తి పూజలు నిర్వహించనున్నామని తెలిపారు.