బుధవారం 05 ఆగస్టు 2020
Hyderabad - Jul 03, 2020 , 02:22:32

ఒకేరోజు.. రూ. 36.64 లక్షలు టోకరా..

ఒకేరోజు.. రూ. 36.64 లక్షలు టోకరా..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రిస్టియన్లకు  సహాయంగా 30 వేల పౌండ్లు పంపిస్తానంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ మహిళకు రూ.11.6 లక్షలు టోకరా వేశారు. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ  ఫేస్‌బుక్‌కు ఇటీవల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రాగా.. ఆమె దానిని యాక్సెప్ట్‌ చేసింది. లండన్‌లోని ఓ క్రిస్టియన్‌ మిషనరీ సంస్థ నిర్వాహకుడిగా పరిచయమైన  వ్యక్తి.. క్రిస్టియన్‌ కమ్యూనిటీ కోసం బహుమతి పంపిస్తున్నాను.. దానిని అందరికీ పంచాలంటూ సూచించాడు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ బాధితురాలికి ఫోన్‌ వచ్చింది. మీ పేరుతో వచ్చిన పార్శిల్‌లో 30 వేల పౌండ్లు ఉన్నాయంటూ.. రకరకాల క్లియరెన్స్‌ల పేరుతో రూ. 11.6 లక్షలు టోకరా వేశారు. బాధితుల ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరికొన్ని ఫిర్యాదులు..

- గూగుల్‌ పే ద్వారా జవాన్‌ అమోల్‌యాదవ్‌ తనకు తెలిసిన వారికి నగదు పంపించగా.. ఆ డబ్బు చేరకపోవడంతో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌ సర్చ్‌ చేసి.. సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ.54 వేలు పోగొట్టుకున్నాడు.

- బంజారాహిల్స్‌కు చెందిన విద్యారమణ్‌ అనే వ్యాపారికి, ఉత్తరాదిలోని గోల్డీ అనే  సంస్థ తన క్లయింట్‌గా ఉంది. డబ్బు పంపించాలంటూ బ్యాంకు ఖాతాలను సూచిస్తూ గోల్డీ నుంచి  మెయిల్స్‌ రావడంతో.. నమ్మిన రమణ్‌ రూ.1.5 లక్షలు డిపాజిట్‌ చేసి మోసపోయి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- సునీల్‌ అనే వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్రవాహనాన్ని కొనేందుకు ప్రయత్నించి సైబర్‌నేరగాళ్ల చేతిలోపడి రూ. 49 వేలు, సైదాబాద్‌లో ఉండే రమావత్‌ శ్రీను ఓఎల్‌ఎక్స్‌ ద్వారా బైక్‌ కొనేందుకు ప్రయత్నించి రూ. 56 వేలు పోగొట్టుకున్నారు. 

- వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన గోపీకృష్ణ ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌ ద్వారా ద్విచక్రవాహనం కొనేందుకు ప్రయత్నించి సైబర్‌నేరగాళ్లకు చిక్కి రూ. 75 వేలు పోగొట్టుకున్నాడు.

- గోల్కొండ క్రాస్‌రోడ్డుకు చెందిన రాజ్‌కుమార్‌ వాట్సాప్‌కు.. తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ మేసేజ్‌ వచ్చింది. వచ్చిన నంబర్‌పై తన సోదరుడి ఫొటో డిస్‌ప్లే అయ్యింది. నిజమని నమ్మిన రూ.2 లక్షలు ఆయా ఖాతాల్లో డిపాజిట్‌ చేసి మోసపోయాడు. 

- ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన వాసు డెబిట్‌కార్డును క్లోన్‌ చేసి, బెంగళూరులో ఆ కార్డు నుంచి రూ. 50 వేలు సైబర్‌నేరగాళ్లు కొట్టేశారు.  బోయిన్‌పల్లికి చెందిన రాజశేఖర్‌కు బ్యాంకు ఖాతా కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయాలంటూ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ. 70 వేలు టోకరావేశారు. 

ట్రేడింగ్‌ పేరుతో రూ.18 లక్షలు లూటీ..

వాట్సాప్‌లో చైనా పౌరుడిగా పరిచయమై.. మాస్కులు, ఇన్‌ఫ్రా రే థర్మామీటర్ల ట్రేడింగ్‌లో బోలెడన్ని డబ్బు సంపాదించవచ్చని నమ్మించి గచ్చిబౌలీ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి రూ.18 లక్షలు టోకరావేశారు. గచ్చిబౌలీకి చెందిన ఉమకాంత్‌కు మైక్‌ పేరుతో వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. ఆ ఫోన్‌కాల్‌లో..  మైక్‌ తాను చైనా పౌరుడినని..సర్జికల్‌ సామగ్రిని సరఫరా చేస్తానని చెప్పాడు. మాస్కులు, ఇన్‌ఫ్రారే థర్మామీటర్స్‌ సరఫరాకు గురించి వివరించి.. ఉమాకాంత్‌తో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ రియల్‌ ఫాక్స్‌లో ఖాతాను తెరిపించాడు. రియల్‌ ఫాక్స్‌ సంస్థ హాంగ్‌కాంగ్‌ ఏస్టే సర్వీసెస్‌, మెటా ఏ4ల ట్రేడింగ్‌ సంస్థలతో కలిసి ట్రేడింగ్‌ను నిర్వహిస్తుందనీ, ఇందులో ఖాతా తెరవాలంటే రూ. 2.30 లక్షలు డిపాజిట్‌ చేయాలని సూచించి వివరాలు తెలిపాడు.  మైక్‌ సూచించిన జూబ్లీహిల్స్‌ కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌లో మహ్మద్‌ ఇర్ఫాన్‌ పేరుతో ఉన్న ఖాతాలో ఉమాకాంత్‌ రూ. 2.30 లక్షలు జమ చేశాడు. ఆ తర్వాత అప్‌డేట్‌ పేరుతో ఉమాకాంత్‌తో 15.20 లక్షలు డిపాజిట్‌ చేయించాడు.మూడు రోజుల తర్వాత మరో మెయిల్‌ వచ్చింది. మీరు డిపాజిట్‌ చేసిన నగదు ఫ్రీజ్‌ అయ్యాయని.. వాటిని తిరిగి రిలీజ్‌ చేయాలంటే 60 శాతం నగదును చెల్లించాలని మైక్‌ సూచించాడు. దీంతో రూ.18 లక్షలు మోసపోయానని గ్రహించిన ఉమాకాంత్‌ సైబరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ  ఫిర్యాదుపై సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.logo