సోమవారం 13 జూలై 2020
Hyderabad - Jun 02, 2020 , 04:15:24

పైసా పెంచకుండానే నాణ్యమైన విద్యుత్‌

పైసా పెంచకుండానే నాణ్యమైన విద్యుత్‌

హైదరాబాద్  : ఒకప్పుడు కరెంటు ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో.. తెలియని పరిస్థితి ఉండేది. వేసవి వచ్చిందంటే.. గంటల తరబడి కోతలు... జనం ఉక్కపోతతో అల్లాడిపోయేవారు. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలూ ప్రకటించేవారు. కానీ ఇప్పుడు..పరిస్థితి పూర్తిగా భిన్నం. స్వరాష్ట్రంలో రెప్పపాటులోనూ కరెంటు పోవడం లేదు.  ఒక్కపైసా పెంచకుండానే 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నది తెలంగాణ సర్కారు. క్షణం కూడా అంతరాయం లేకుండా సరఫరా అందిస్తూ...దేశానికే మార్గదర్శిగా నిలిచింది. ఇక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలున్న భాగ్యనగరం నిరంతరం వెలిగిపోతున్నది. వినియోగం పెరిగినా ‘పవర్‌ ఫుల్‌'గా ముందుకుసాగుతున్నది. 

యూనిట్లు పెరిగినా.. 

తెలంగాణ రాకముందు నగరంలో గృహ వినియోగదారులకు 3-4 గంటల పాటు కోతలు విధించేవారు. పరిశ్రమలకైతే వారానికి రెండు రోజుల పాటు పవర్‌హాలిడే అమలు చేసే వారు. కరెంటు కటకటతో పరిశ్రమలు నష్టపోయేవి. తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత  విద్యుత్‌ రంగం చరిత్రను తిరగరాసింది.  డిమాండ్‌ పెరిగినా, వినియోగదారులు రెట్టింపైనా క్షణం కూడా కరెంటు పోవడం లేదు.  2014లో గ్రేటర్‌లో 38.16 లక్షల వినియోగదారులుండగా, అప్పట్లో డిమాండ్‌ 47.33 మిలియన్‌ యూనిట్లు మాత్రమే. ఇప్పుడు గ్రేటర్‌లో 56 లక్షల కనెక్షన్లుండగా, డిమాండ్‌ 70 మిలియన్‌ యూనిట్లకు చేరింది. 18 లక్షల మంది వినియోగదారులు పెరిగి, 22 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా అవుతున్నది.  కాగా, ఐటీ కంపెనీలు విస్తరిస్తుండటం, ఫార్మాసిటీ, ఎలక్ట్రానిక్‌ సిటీ, కొత్త సెజ్‌లు ఏర్పాటవుతుండటం, పరిశ్రమల విస్తరణతో విద్యుత్‌ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో  భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతిస్తున్నారు. కొత్త లైన్లు వేయడం, సబ్‌స్టేషన్ల నిర్మాణం, భూగర్భ కేబుళ్లు వేయడం వంటి పనులు చకచకా సాగుతున్నాయి.

బకాయిలు మాఫీ

గ్రేటర్‌లో 100 యూనిట్లలోపు గృహ విద్యుత్‌ బకాయిలను సర్కారు మాఫీ చేసింది.  రూ. 41 కోట్లను మాఫీ చేయడంతో 3,35,135 మందికి లబ్ధి చేకూరింది. అంతేకాకుండా 100 యూనిట్ల పైబడి సర్‌చార్జీని సైతం రద్దు చేయడంతో 1.16 లక్షల మంది లబ్ధిపొందారు. 

సోలార్‌ వెలుగులు

తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈ ఆరేండ్లలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఊపందుకున్నది. గ్రేటర్‌ పరిధిలోనే 120 మెగావాట్ల ఉత్పత్తి అవుతున్నది. శంషాబాద్‌ విమానాశ్రయం, దక్షిణ మధ్యరైల్వే వంటి సంస్థలు సైతం సౌరశక్తిని వినియోగించుకుంటున్నాయి.


logo