గురువారం 02 జూలై 2020
Hyderabad - May 27, 2020 , 01:51:03

కరోనా కాలంలో ప్రత్యేక ‘పెండ్లి’ ప్యాకేజీ

కరోనా కాలంలో ప్రత్యేక ‘పెండ్లి’ ప్యాకేజీ

 • కేవలం 50 మందితో వివాహ తంతు
 • హాజరయ్యే వారందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ 
 • శానిటైజ్‌ చేసి మాస్కుల అందజేత
 • భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు
 • ఆఫర్లు ప్రకటిస్తున్న మ్యారేజ్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్లు

కరోనా కాలంలో ప్రత్యేక పెండ్లి ప్యాకేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. 50 మంది అతిథులను అనుమతిస్తూ మండపాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.  రూ.1,99,999కే  ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. ఈ-ఇన్విటేషన్‌ కార్డు డిజైనింగ్‌ నుంచి, మాస్కులు, శానిటైజర్లు, సీటింగ్‌ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

హైదరాబాద్ :  పెళ్లంటే.. తప్పెట్లు, తాళాలు, పందిళ్లు, సన్నాయిమేళాలు, బరాత్‌లు, సంగీత్‌లు.. ఎన్నెన్నో ఆర్భాటాలు. అది నిన్నమొన్నటి వరకు.. ప్రస్తుతం కరోనా వచ్చింది. కాలం మారింది..  హంగూ ఆర్భాటాలతో కాకుండా కేవలం సాదాసీదాగా పెండ్లి తంతు మారుతున్నది. వివాహం గురించి ఎన్నో కలలు గన్న యువత ప్రభుత్వ నిబంధనల మేరకు 50 మందితో సరిపెట్టుకొని కొవిడ్‌ వేళలో పెండ్లికి సిద్ధమవుతున్నది. ఇదే అదనుగా కొన్ని వెడ్డింగ్‌ సెంటర్లు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. రూ.1,99,999లకే అన్ని సేవలు అందిస్తామని ముందుకొస్తున్నాయి. 

కొవిడ్‌ ప్యాకేజీ..

ప్రతి మనిషికి వివాహ మహోత్సవం అనేది ప్రధానమైన ఘట్టం. అయితే ప్రస్తుత కరోనా వేళ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఫంక్షన్‌ హాళ్ల యాజమాన్యాలు, కొన్ని వెడ్డింగ్‌ సెంటర్లు కొత్తగా ఆలోచిస్తున్నాయి. సరికొత్త వివాహ వేదికలు, ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇ-ఇన్విటేషన్‌ కార్డు డిజైనింగ్‌ మొదలుకొని, 50 మందికి మాస్క్‌లు, శానిటైజర్లు, సీటింగ్‌లో భౌతిక దూరం వరకు అన్ని సౌకర్యాలతో వివాహ వేదికలు, పెళ్లి మండపాలను అతి తక్కువ ఖర్చుతో అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 

ప్యాకేజీలో ఇస్తున్న సేవలు ...

 • ఇ - ఇన్విటేషన్‌ కార్డు డిజైనింగ్‌
 • బ్రైడల్‌ మేకప్‌, మెహందీ ఆర్టిస్ట్‌
 • ఫొటో బూత్‌, ఒక కారుకు అలంకరణ
 • ప్రామాణిక మండపం & ప్రధాన ద్వారం అలంకరణ
 • సన్నాయి మేళం, 50 మందికి శాకాహార భోజనం
 • రెండు మైకులు కలిగిన బేసిక్‌ సౌండ్‌ సిస్టమ్‌
 • ఫొటోగ్రఫీ & వీడియోగ్రఫీ 
 • 50 షీట్స్‌ గల ఫొటో ఆల్బమ్‌
 • అతిథుల కోసం థర్మల్‌ స్క్రీనింగ్‌
 • యూవీ హ్యాండ్‌ శానిటైజేషన్‌ స్టేషన్‌
 • 50 మందికి యాభై మిల్లీ లీటర్ల హ్యాండ్‌ శానిటైజర్లు
 • 50 మందికి ఎన్‌ -95 మాస్క్‌లు
 • కడిల్‌ కర్టెయిన్స్‌ ఫర్‌ గ్రీటింగ్‌


logo