బుధవారం 27 మే 2020
Hyderabad - May 23, 2020 , 01:05:51

సొబగులద్దుకుంటున్న చార్మినార్‌ పరిసర ప్రాంతాలు

సొబగులద్దుకుంటున్న చార్మినార్‌ పరిసర ప్రాంతాలు

డివడిగా సాగుతున్న పాదచారుల ప్రాజెక్టు

ఫుట్‌పాత్‌లు, గ్రానైట్‌ రాళ్ల ఏర్పాటు పూర్తి

14సంవత్సరాల నాటి ప్రాజెక్టుకు మోక్షం

ఏడు లింకురోడ్ల నిర్మాణానికి ్రప్రణాళికలు

మంత్రి కేటీఆర్‌ కృషితో ముందుకు సాగిన

సమైక్యరాష్ట్రంలో రూ.35 కోట్లు.. స్వరాష్ట్రంలో రూ.103కోట్లకు పెరిగిన వ్యయం

విశ్వవిఖ్యాత చార్మినార్‌ను పరిరక్షించే ఉద్దేశంతో 14 సంవత్సరాల కిందట స్వచ్ఛ ఐకాన్‌ కింద చేపట్టిన చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు పనులు మున్సిపల్‌ శాఖమంత్రి కే.టీ.రామారావు కృషితో ఊపందుకున్నాయి. మంత్రి ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గ్రానైట్‌ రాళ్లు, డక్ట్‌ తదితర పనులు పూర్తికాగా, ఇన్నర్‌, ఔటర్‌ రింగురోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. వ్యయం రూ.35కోట్ల నుంచి రూ.103కోట్లకు పెరగడం విశేషం.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : 

సమైక్యరాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకుగాను అక్టోబర్‌ 31, 2006న రూ.35 కోట్లు మంజూరుచేసింది. అయితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయి. ఇందులో భాగంగా చార్మినార్‌ చుట్టూ 220మీటర్ల పరిధిలోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. వాహనాలను డైవర్ట్‌ చేసేందుకు ఇన్నర్‌, ఔటర్‌ రింగురోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. 

ఏడు లింకురోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు

చార్‌కమాన్‌ టెంపుల్‌-ఆగ్రా హోటల్‌, మిట్టీకాషేర్‌-లాడ్‌బజార్‌, చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌-కాలీకమాన్‌, పార్కింగ్‌ లాట్‌తోపాటు కోట్లాఅలీజా నుంచి చార్మినార్‌కు అప్రోచ్‌రోడ్డు, లాడ్‌బజార్‌-మిట్టీకాషేర్‌, గుల్జార్‌హౌస్‌-రాయల్‌ ఫంక్షన్‌హాల్‌ వయా జ్యోతి బిల్డింగ్‌, గుల్జార్‌హౌస్‌-రాయల్‌ఫంక్షన్‌హాల్‌ వయా పంజేషా లోధీఖానా రోడ్‌ తదితర లింకురోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. 

ఎన్టీపీసీ సహకారంతో చేపడుతున్న పనులు

చార్మినార్‌ అభివృద్ధికి తమవంతు సహకారం అందించేందుకు ఎన్టీపీసీ ముందుకొచ్చింది. చార్మినార్‌ చుట్టూ బ్యాట్రీ వాహనాల ఏర్పాటుకు రూ.2.51కోట్లు, వ్యర్థాలను సేకరించేందుకు స్వచ్ఛ ఆటో టిప్పర్ల ఏర్పాటుకు రూ.42.50లక్షలు, చార్మినార్‌ చుట్టూ స్టీల్‌ గార్బేజ్‌ బిన్స్‌ ఏర్పాటుకు రూ.9 లక్షలు, చార్మినార్‌ నలువైపులా సుందరీకరణకు హాలోజెన్‌ లైట్ల ఏర్పాటుకు రూ.కోటి, మంటినీటి కియోస్క్‌ల ఏర్పాటుకు రూ.16లక్షలు, మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.2కోట్లు, స్వీపింగ్‌ యంత్రాలకు రూ.2కోట్లు ఇలా మొత్తం రూ.8.18కోట్లు మంజూరుచేసింది. పాదచారుల ప్రాజెక్టు పనులతోపాటు వీటిని కూడా ఏర్పాటుచేస్తున్నారు.

రింగురోడ్ల వల్ల ప్రయోజనాలు

ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు తోడ్పడుతాయి.

వాహనాలను డైవర్ట్‌ చేయడంవల్ల చార్మినార్‌ వద్దకు వచ్చే సందర్శకులు, పాదచారులకు రక్షణ కలుగుతుంది.

కాలుష్యం బారినుంచి చార్మినార్‌ పరిరక్షణకు అవకాశం కలుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తుంది.

స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

చార్మినార్‌ పరిసరాల్లో ఆస్తుల విలువ పెరుగుతుంది. 

548 ఆస్తులు సేకరణ

చార్మినార్‌ వద్ద ఔటర్‌ రింగురోడ్డు పొడవు 5.40 కి.మీటర్లు కాగా, 4.82 కి.మీటర్లు పనులు పూర్తయ్యాయి. మిగిలిన 580 మీటర్లు (ఖిల్వత్‌ రోడ్డు) పనులు చేపట్టాల్సివుంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణకు మొత్తం 308 ఆస్తులు సేకరించారు. 290 ఇండ్లను నేలమట్టంచేసి రోడ్డును ఏర్పాటుచేయగా, 18 ఆస్తులు మిగిలివున్నాయి. ఇందులో ఏడు మత పరమైన నిర్మాణాలు, 11ప్రైవేటు ఆస్తులు ఉన్నాయి. 

ఇన్నర్‌ రింగురోడ్డు..

ఇన్నర్‌ రింగురోడ్డు పొడవు 2.3కి.మీటర్లు కాగా ఇందులో 2.25కి.మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది. కాలికమాన్‌ వైపు మిగిలిన 50మీటర్లు ఏర్పాటు చేయాల్సివుంది. ఈ రోడ్డు ఏర్పాటు కోసం 240ఆస్తులను సేకరించి 229 ఇండ్లను కూల్చివేశారు. మిగిలిన 11ఆస్తులు ఒకే భవనం(జ్యోతి బిల్డింగ్‌)లో ఉండగా, వాటిని కూల్చివేయాల్సి ఉంది.

పూర్తయిన పనులు..

చార్మినార్‌-గుల్జార్‌హౌస్‌, చార్మినార్‌-సర్దార్‌మహెల్‌రోడ్‌, లాడ్‌బజార్‌ రోడ్డు, మక్కామసీద్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఫుట్‌    పాత్‌ అభివృద్ధి, గ్రానైట్‌ పనులు పూర్తయ్యాయి.

మదీనా-పత్తర్‌గట్టి రోడ్డు స్టీట్‌ స్కేపింగ్‌, చార్మినార్‌ చుట్టూ విద్యుత్‌ స్తంభాలు, డక్టింగ్‌ పనులు పూర్తయ్యాయి. 

చార్మినార్‌ చుట్టూ బఫర్‌జోన్‌లో కోబుల్‌ స్టోన్‌ పనులు పూర్తయ్యాయి. 

గుల్జార్‌హౌస్‌, లాడ్‌బజార్‌ స్ట్రెచ్‌లలో ఫిక్స్‌డ్‌, హైడ్రాలిక్‌ బొలార్డ్స్‌ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. 

అశూర్‌ఖానా హుస్సేనీఆలమ్‌, క్లాక్‌టవర్‌ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. 

చేపట్టాల్సిన పనులు..

సెంట్రల్‌ మీడియా, సెంట్రల్‌ లైటింగ్‌, మొక్కలు, రోడ్డు మార్కింగ్‌ పనులు 

లాడ్‌బజార్‌లో బొలార్డ్స్‌ , విద్యుతీకరణ, చార్‌కమాన్‌ పరిరక్షణ పనులు పురోగతిలో ఉన్నాయి. 

లాడ్‌బజార్‌ స్ట్రెచ్‌లో కోబుల్‌ స్టోన్‌ ఫ్లోరింగ్‌ రీప్లేస్‌మెంట్‌, పత్తర్‌గట్టి, చార్మినార్‌ ప్రాంతంలో ఫసాడ్‌, రూ.45.25 కోట్లతో పత్తర్‌గట్టి ప్రాంతంలో రోడ్డు విస్తరణ, నాపరాళ్ల ఏర్పాటు పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. 

లాడ్‌బజార్‌లో ముర్గీచౌక్‌ పునర్నిర్మాణం, ఫసాడ్‌ అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

ముర్గీచౌక్‌ రోడ్డు విస్తరణ, బండల ఏర్పాటు, లాడ్‌బజార్‌లో ఫసాడ్‌ అభివృద్ధి పనులు డీపీఆర్‌ తయారీ దశలో ఉన్నాయి.logo