గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 22, 2020 , 03:24:09

బయోడైవర్సిటీ కూడలిలో పనులన్నీ పూర్తి

బయోడైవర్సిటీ కూడలిలో పనులన్నీ పూర్తి

ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4లో చివరి ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి

అందుబాటులోకి బయోడైవర్సిటీ ఫస్ట్‌లెవల్‌ పై వంతెన

బయోడైవర్సిటీ కూడలిలో పనులన్నీ పూర్తయ్యాయి. ఐటీ కారిడార్‌లో వాహనాలు ఇక ఆగకుండా దూసుకుపోతాయి. ట్రాఫిక్‌ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బయోడైవర్సిటీ జంక్షన్‌లో రూ. 30.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను గురువారం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఎస్‌ఆర్‌డీపీ  ప్యాకేజీ-4లో భాగంగా రూ. 379 కోట్ల వ్యయంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు సుమారు 12 కిలోమీటర్ల కారిడార్‌లో నాలుగు ఫ్లైఓవర్లు, రెండు అండర్‌పాస్‌లు పూర్తయ్యాయి.

బయోడైవర్సిటీ కూడలిలో పనులన్నీ పూర్తయ్యాయి. ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4లో చివరిదైన  ఫ్లై ఓవర్‌ను గురువారం మంత్రులు 

కేటీఆర్‌, సబితారెడ్డి  ప్రారంభించడంతో   ఐటీ కారిడార్‌లో వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు మరింత తీరాయి. ఇప్పటికే వినియోగంలో ఉన్న నాలుగు పై వంతెనలు, రెండు అండర్‌ పాస్‌లు ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. తాజాగా  అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌తో గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వైపు సాఫీగా వెళ్లేందుకు వీలు కలిగింది. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వెస్ట్‌జోన్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఏరియాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ఎదురవుతున్న ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక ప్యాకేజీ-4 కింద పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రూ. 379 కోట్ల వ్యయంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు సుమారు 12 కిలోమీటర్ల కారిడార్‌లో నాలుగు ఫ్లై ఓవర్లు, రెండు అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందులో రాజీవ్‌గాంధీ జంక్షన్‌, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌లో ఫస్ట్‌ లెవల్‌, సెకండ్‌ లెవల్‌ తదితర నాలుగు ఫ్లై ఓవర్లతో పాటు అయ్యప్ప సొసైటీ జంక్షన్‌, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌లో అండర్‌పాస్‌లు ఉన్నాయి. ఇందులో ఐదు పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. గురువారం బయోడైవర్సిటీ  ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి ప్రారంభించారు. ఈ పై వంతెన సైతం అందుబాటులోకి రావడంతో నాలుగో ప్యాకేజీ కింద చేపట్టిన మొత్తం ఆరు పనులూ పూర్తయ్యాయి. కాగా,  కరోనా కారణంగా ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవ వేడుక  సాదాసీదాగా జరిగింది. కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే  గాంధీ,  ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 విశేషాలు....

రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లైఓవర్‌: మెజిస్టిక్‌ షాపింగ్‌ మాల్‌ నుంచి మలేషియన్‌ టౌన్‌షిప్‌ వరకు రూ. 97.93కోట్ల వ్యయంతో 1230 మీటర్ల పొడవుతో నిర్మించారు. గతేడాది ఏప్రిల్‌ 6న అందుబాటులోకి వచ్చింది. జేఎన్‌టీయూ-హైటెక్‌సిటీ మధ్య ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోయాయి.

అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ అండర్‌పాస్‌: రూ.44.30 కోట్లతో దీన్ని నిర్మించగా, జనవరి 3, 2018న ఇది అందుబాటులోకి వచ్చింది. కొండాపూర్‌ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ కష్టాలు తీరాయి. 

మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ ఫ్లైఓవర్‌: రూ. 80.23 కోట్లతో చేపట్టిన ఈ పైవంతెన నవంబర్‌ 9, 2018న ప్రారంభించారు. ఇనార్బిట్‌ మాల్‌ నుంచి ర్యాడిసన్‌ మధ్య రాకపోకలు సులువయ్యాయి. 

మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ అండర్‌పాస్‌:  రూ. 51.41కోట్లతో నిర్మించారు. 365 మీటర్ల పొడవు, 28.8 మీటర్ల వెడల్పుతో  మూడు లేన్లుగా డిజైన్‌ చేశారు. ఏప్రిల్‌ 28, 2018న ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల హైటెక్‌సిటీ - బయోడైవర్సిటీ సొసైటీ మధ్య ట్రాఫిక్‌ కష్టాలు తీరాయి.

బయోడైవర్సిటీ జంక్షన్‌ సెకండ్‌ లెవల్‌ ఫ్లై ఓవర్‌: రూ. 69.12కోట్ల వ్యయంతో 990 మీటర్ల పొడవుతో నిర్మించిన మూడు లేన్ల ఫ్లైఓవర్‌ ఇది. నవంబర్‌ 4, 2019న అందుబాటులోకి వచ్చింది. మెహిదీపట్నం నుంచి మైండ్‌స్పేస్‌ వైపు వెళ్లే వాహనదారులకు ఊరట లభించింది. 

బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌: రూ. 30.26కోట్లతో నిర్మించగా, గురువారం ప్రారంభించారు. దీనివల్ల గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు సాఫీగా వెళ్లేందుకు వీలు కలిగింది.   


‘పెద్ద చెరువును సుందరీకరించండి’

శేరిలింగంపల్లి: పెద్ద చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, చెరువు చుట్టూ కొనసాగుతున్న 100 అడుగుల రహదారి పనులను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్‌  అధికారులను ఆదేశించారు. ఖాజాగూడ పెద్దచెరువును మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్‌ సాయిబాబాతో కలిసి పరిశీలించారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌ సమీపంలో ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కేటీఆర్‌..అనంతరం సమీపంలోని ఖాజాగూడ పెద్దచెరువును సందర్శించారు. చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు పూర్తిచేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ సీఈ వసంత, సిటీ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డి, ఎస్‌ఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. logo